Gayatri mantram: గాయత్రీ మంత్రం విశిష్టత ఏమిటి? ఏ స‌మ‌యంలోనైనా దానిని జ‌పించ‌వ‌చ్చా?-what is significance of gayatri mantra can it be chanted at any time ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Gayatri Mantram: గాయత్రీ మంత్రం విశిష్టత ఏమిటి? ఏ స‌మ‌యంలోనైనా దానిని జ‌పించ‌వ‌చ్చా?

Gayatri mantram: గాయత్రీ మంత్రం విశిష్టత ఏమిటి? ఏ స‌మ‌యంలోనైనా దానిని జ‌పించ‌వ‌చ్చా?

HT Telugu Desk HT Telugu
Aug 08, 2024 06:00 AM IST

Gayatri mantram: గాయత్రీ మంత్రం విశిష్టత ఏంటి? ఏ సమయంలో ఈ మంత్రాన్ని జపించాలి. దీన్ని జపించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

గాయత్రీ మంత్రం విశిష్టత ఏమిటి
గాయత్రీ మంత్రం విశిష్టత ఏమిటి

Gayatri mantram: స‌క‌ల వేదాల‌కు అధిదేవ‌త గాయత్రీ దేవి అని ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త‌, పంచాంగ క‌ర్త చిల‌క‌మ‌ర్తి ప్ర‌భాక‌ర చ‌క్ర‌వ‌ర్తి శ‌ర్మ తెలిపారు. గాయత్రీమంత్రాన్ని మించిన మంత్రం లేదు. కన్నతల్లి ఎలాగైతే బిడ్డల్ని కాపాడుకుంటుందో తన మంత్రాన్ని ఉపాసించిన వారిని గాయత్రీమాత కూడా అలా కాపాడుతుంద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు.

ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ మూడు సంధ్యల్లోనూ గాయత్రీమంత్రాన్ని జపించటం వల్ల ఏకాగ్రత, ఇంద్రియాలపై పట్టు లభిస్తుంద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. నిత్యం నియమనిష్ఠలతో గాయత్రీని ధ్యానించలేని, ఉపాసించలేని వారు గాయత్రీ మంత్రాన్ని త్రికాలాలలోనూ పదిసార్లు చొప్పున జపించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఏ పనిలో ఉన్నప్పటికీ చేస్తున్న పనిని కాసేపు ఆపి, పాదరక్షలు వదిలిపెట్టి ఈ మంత్ర జపం చేయవచ్చు. గాయత్రీమంత్రాన్ని జపం చేస్తూ, హోమం చెయ్యటం ద్వారా కొన్ని రోగాల నుంచి ఉపశమనం దొరుకుతుంది.

గాయత్రీ మంత్రం జపించడం వల్ల లాభాలు

రావిచెట్టు కింద శనివారం కూర్చొని నూరుసార్లు గాయత్రీ మంత్రాన్ని జపిస్తే భూత రోగాల నుంచి విముక్తి లభిస్తుంద‌ని, తిప్ప తీగముక్కలు పాలలో నానపెట్టి గాయత్రీ మంత్రాన్ని జపిస్తూ ఆహుతి ఇస్తే అది మృత్యుంజయ హోమం చేసిన ఫలితాన్నిస్తుంద‌ని చిల‌క‌మ‌ర్తి తెలిపారు. సర్వరోగనివారణ కలుగుతుంది. జ్వరం శాంతించటంకోసం గాయత్రీమంత్రాన్ని జపిస్తూ మామిడా కులు, పాలను కలిపి ఆహుతి ఇవ్వాలి. పాలలో వసను నానపెట్టి అగ్నిలో హోమం చేస్తే క్షయరోగం తగ్గుతుంది.

పాలు, పెరుగు, నెయ్యి ఈ మూడింటినీ కలిపి గాయత్రీ మంత్రంతో హోమం చేస్తే రాజయక్ష్మ రోగం శాంతిస్తుంది. సోమలతను కణుపుల వరకూ తుంచి ఆ ముక్కలను అమావాస్య నాడు పాలతో కలిపి ఆహుతి ఇస్తే క్షయవ్యాధి నివారణ అవుతుంది. గాయత్రీమంత్రాన్ని జపిస్తూ శంఖవక్షపు పూలతో హోమం చేస్తే కుష్టురోగం తొలుగుతుంది. మేడిచెట్టుసమిధలతో గాయత్రీమంత్రం జపిస్తూ హోమం చేస్తే మేహరోగాలు నశిస్తాయి. చెరకురసం, తేనె కలిపి హోమం చేసినా మేహ సంబంధ రోగాలు శాంతిస్తాయి. పాలు, పెరుగు, నెయ్యి కలిపి ఆహుతి ఇస్తే మశూచి రోగం మటుమాయమౌతుంది.

మేడి, మర్రి, రావి సమిధలతో హోమం చేస్తే ఆవులు, కోరింది కోరినట్లు లభిస్తుంది! గుర్రాలు, ఏనుగులకు సంబంధించిన రోగాలు దూరమౌతాయి. జమ్మిసమిధలను పాలు, నెయ్యితో కలిపి రెండేసి వందల సార్లు గాయత్రీమంత్రంతో హవనం చేస్తే ఇంట్లో శాంతి నెల కొంటుంది. ఈ హోమం తర్వాత అన్నాన్ని బలిగా వేయాలి. మట్టిబెడ్డను నూరుసార్లు గాయత్రితో అభిమంత్రించి ఏ దిశకు విసిరితే ఆ దిశనుంచి కలిగే అగ్నిభయం, గాలిభయం, దొంగల భయం నశిస్తాయి. దర్భను తాకి గాయత్రీని జపిస్తే భూతరోగాల నుంచి విముక్తి లభిస్తుంది. గాయత్రీమంత్రజలాన్ని తాగినా ఇదే ఫలితం కలుగుతుంది. భూతశాంతికి నూరుసార్లు గాయత్రీ మంత్రంతో భస్మాన్ని అభిమంత్రించి ఆ తర్వాత దాన్ని నొసటన ధరించాలి. అలాంటి వారికి భూతశాంతితో పాటు వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుంది.

గాయత్రీమంత్రంతో చక్కగా విచ్చిన పూలను తెచ్చి అగ్నిలో హోమం చేస్తే పుష్టి కలుగుతుంది. ఎర్రకమలాలను గాయత్రీమంత్రంతో వ్రేల్చితే ధనప్రాప్తి కలుగుతుంది. మారేడు సమిధలను కానీ, ఫలపుష్పాలను కానీ, మారేడువేర్లను కానీ హోమం చేసిన వారింట సిరిసంపదలు తులతూగుతాయి.

మారేడు సమిధలు పాలలో, నేతిలో తడిపి రోజుకు రెండు వందల సార్లు చొప్పున వారం రోజులపాటు హోమం చేస్తే తరగని సిరిసంపదలు, సుఖశాంతులు కలుగుతాయి. పాలు, పెరుగు, నెయ్యి, పేలాలు కలిపి గాయత్రీమంత్రంతో జపం, హోమం చేసిన వరుడికి మంచి వధువు లభిస్తుందని దేవీ భాగవతంలో గాయత్రీమంత్ర జపహోమాల విశేషాల వివరణ కనిపిస్తుంది. గాయత్రీమంత్రంలోని నాలుగు పాదాలు నాలుగు వేదాల నుంచి ఉద్భవించాయి.

గాయత్రీమంత్ర జపం చెయ్యటం వల్ల మొదటి పాదంలో రుగ్వేదంలో చెప్పబడ్డ శుభప్రాప్తి, ఈశ్వరప్రాప్తి, జ్ఞానం, ఆత్మశాంతి, ధర్మనిరతి, కర్తవ్యపాలన, ప్రేమ, దయ, సేవ, ఉపకారత్వం మొదలైన ఫలితాలు కలుగుతాయి. వీటితో పాటు రెండవ పాదంలో యజుర్వేదంలో చెప్పబడ్డ వీరత్వం, రక్షణ, కీర్తి, నేతృత్వ సామర్థ్యం కలుగుతాయి. మూడవ పాదంలో సామవేదంలో చెప్పబడ్డ మనోవికాసం, ఆనందం, సంగీతం, సాహిత్యకళలు, వినోదాన్ని ఇచ్చే శక్తి సాధ్యమౌతాయి. నాలుగవ పాదంలో అధర్వణవేదంలో పేర్కొన్న ధనధాన్యవైభవం, అన్నవస్త్రాదులు, వస్తువాహనాలు, సుఖజీవనం కలుగుతాయి.

గాయత్రీమంత్రంలోని విద్యుత్ ప్రవాహం వంటి తేజస్సు ఆత్మతేజస్సుతో సమానం. ఆ తేజస్సును ధ్యానిస్తే సమస్త ప్రాపంచికవాసనలు నశిస్తాయి. ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. వేదాలు శబ్దబ్రహ్మగా మూర్తీభవించినప్పుడు ప్రజ్వరిల్లిన శబ్దశక్తి స్వరూపమే గాయత్రీబీజశక్తి. ఒక్కమాటలో చెప్పాలంటే గాయత్రీమంత్రజపంతో సాధించనిది ఏదీ లేదని ఆధ్యాత్మిక వేత్త చిల‌కమ‌ర్తి తెలిపారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ