Vastu tips for health: మంచి ఆరోగ్యం కోసం వాస్తు ప్రకారం మీ ఇల్లు ఇలా సర్దుకోండి.. అనారోగ్య సమస్యలే ఉండవు-vastu tips for health arrange your house according to vastu for good health you dont face any health problems ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips For Health: మంచి ఆరోగ్యం కోసం వాస్తు ప్రకారం మీ ఇల్లు ఇలా సర్దుకోండి.. అనారోగ్య సమస్యలే ఉండవు

Vastu tips for health: మంచి ఆరోగ్యం కోసం వాస్తు ప్రకారం మీ ఇల్లు ఇలా సర్దుకోండి.. అనారోగ్య సమస్యలే ఉండవు

Gunti Soundarya HT Telugu
Feb 19, 2024 09:59 AM IST

Vastu tips for health: ఎప్పుడూ ఇంట్లో ఎవరో ఒకరి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారా? అయితే అది వాస్తు లోపం వల్ల కూడా కావచ్చు. మీ ఇంటిని ఇలా సర్దుకున్నారంటే ఆరోగ్యంగా ఉంటారు.

ఇల్లు ఇలా సర్దుకుంటే అనారోగ్య సమస్యలే ఉండవు
ఇల్లు ఇలా సర్దుకుంటే అనారోగ్య సమస్యలే ఉండవు (pixabay)

Vastu tips for health: వాస్తు ప్రకారం చేసే కొన్ని చిన్న తప్పుల కారణంగా ఒక వ్యక్తి జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో తరచూ గొడవలు జరగడం, కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. మనసులో అశాంతి నెలకొంటుంది. వీటితో పాటు ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్య సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మ

మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండదు. ప్రతిరోజు మందుల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇటువంటి సమస్యలన్నీ తరచుగా ఎదుర్కొంటున్నారా? అయితే మీ ఇంట్లో వాస్తు లోపం ఉండి ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబించాలని అనుకుంటే వాస్తు ప్రకారం ఈ జాగ్రత్తలు తీసుకోండి. సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

పడకగదిలో ఇవి పెట్టకండి

వాస్తు ప్రకారం పాత, పనికి రాని వస్తువులు పడకగదిలో నిల్వ చేయకూడదు. అలాగే మంచం ముందు అద్దాలు అసలు ఉంచకూడదు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కొంతమందికి నిద్రలేవగానే దేవుడి బొమ్మ చూసుకోవడం అలవాటు. అందుకే ఇష్టమైన దేవుడి ఫోటో పెట్టుకోవాలని అనుకుంటారు. కానీ పడకగదిలో దేవుడి విగ్రహం లేదా చిత్రపటం పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించరు. ఇది మాత్రమే కాదు బెడ్ రూమ్ ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మురికిగా ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎప్పుడు చిందర వందరగా పెట్టుకోకూడదు.

నేల మీద కూర్చుని తినండి

చాలా మందికి మంచాల మీద కూర్చుని తినే అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. అందుకే తప్పనిసరిగా నేల మీద కూర్చుని తినడం అలవాటు చేసుకోండి. పద్మాసనం వేసుకుని కింద కూర్చుని తినడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే తినేటప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశకు ముఖంగా కూర్చుని తింటే మంచిది.

పడుకునే దిశ ముఖ్యమే

మంచి ఆరోగ్యం కోసం మీరు పడుకునే దిశ మీద కూడా దృష్టి పెట్టాలి. తలని దక్షిణం లేదా తూర్పు దిశలో ఉంచి నిద్రపోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇలా పడుకుంటే ఒత్తిడి తగ్గుతుందని నమ్ముతారు. సగం అనారోగ్యాలకు కారణం నిద్రలేమి సమస్య. అందుకే మీరు పడుకునే దిశ సరిగా ఉందో లేదో చూసుకోవాలి.

వాటర్ లీకేజ్ ఉండకూడదు

ఇంట్లో నీరు కారుతున్న కుళాయి ఉంటే వెంటనే రిపేర్ చేయించుకోండి. కుళాయి నుంచి నీరు కారడం అశుభంగా పరిగణిస్తారు. దీని వల్ల ధన నష్టం జరుగుతుంది. నీరు పోయినట్టే డబ్బు కూడా వృధా ఖర్చులు అవుతాయని చెబుతారు.

మొక్కలు పెంచుకోవాలి

ఇంట్లో ప్రశాంతమైన వాతవరణం కల్పించుకోవడం కోసం మొక్కలు పెట్టుకుంటే మంచిది. ఇది సానుకూలతని పెంచుతుంది. కుటుంబ సభ్యుల మనసుని సంతోషంగా ఉంచుతుంది. గాలిని శుద్ది చేస్తుంది. మీ అదృష్టాన్ని పెంచుతుంది. సంపద, శ్రేయస్సుని తీసుకొస్తుంది.

చెత్త ఉంచకూడదు

వాస్తు ప్రకారం ఇంటి మెట్ల కింద ఎక్కువ చెత్త పెట్టుకోకూడదు. కిచెన్ కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. లేదంటే అది ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.

రోగనిరోధక శక్తి పెంచుకోవాలి

ఇంట్లో వారిలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం ఉత్తరం లేదా ఈశాన్య ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ దిశలో నిద్రిస్తే రోగులు త్వరగా కోలుకుంటారు. అలాగే మందులు పెట్టుకునే స్థానం కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి. మందులు కిచెన్ లో పొరపాటున కూడా పెట్టుకోవద్దు. అవి ఎప్పుడు దక్షిణం లేదా పడమర దిశలో ఉంచకూడదు. మందులు పెట్టుకోవడానికి ఉత్తమ ప్రదేశం ఈస్ట్ లేదా నార్త్ ఈస్ట్.

టాపిక్