Shani trayodashi: శని చెడు దృష్టి నుంచి బయటపడేందుకు ఈ ఐదు రాశుల వారికి రేపు చాలా ముఖ్యమైన రోజు
Shani trayodashi: శని ప్రభావం చాలా కఠినంగా ఉంటుంది. జీవితంలో అనేక సవాళ్ళు, సమస్యలు ఎదురవుతాయి. ఏలినాటి శని, అర్థాష్టమ శని నుంచి తప్పించుకునేందుకు కుంభం, మకరం, మీనం, వృశ్చికం, కర్కాటక రాశుల వారికి చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకుంటే శని దోషాల నుంచి బయటపడవచ్చు.
Shani trayodashi: ఆగస్ట్ 17 చాలా ముఖ్యమైన రోజు. శనివారం త్రయోదశి రావడంతో పాటు శ్రావణ మాసంలో శని ప్రదోష వ్రతం కూడా వచ్చింది. ఈరోజు శని దేవుడిని, శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు అద్భుతమైన సమయం. ప్రతినెల శుక్ల పక్షం, కృష్ణ పక్షం త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం ఆచరిస్తారు.
శనివారం త్రయోదశి వస్తే ఆరోజును శని త్రయోదశిగా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని అనుగ్రహం పొందేందుకు ఇది చాలా అనువైన రోజు. త్రయోదశి మహా దేవుడికి కూడా ప్రీతికరమైన రోజు. అందుకే ఈరోజు శివుడు, శనీశ్వరుడిని పూజిస్తారు. శని జన్మించిన తిథి త్రయోదశి అందువల్ల ఈ తిథికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది.
ఈరోజు శనికి పూజలు చేయడం వల్ల ఏలినాటి శని, అర్థాష్టమ శని, అష్టమ శని వంటి దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. ఆగస్ట్ 17న వచ్చిన శని త్రయోదశి రోజు ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం కూడా ఉన్నాయి. శనివారం త్రయోదశి కలిసి రావడం చాలా విశేషమైనదిగా చెప్తారు.
శని సంచరించే రాశికి అనుగుణంగా ఏలినాటి శని, అర్థాష్టమ శని ఉంటాయి. ప్రస్తుతం మకరం, కుంభం, మీన రాశుల మీద ఏలినాటి శని ప్రభావం కొనసాగుతోంది. అటు కర్కాటకం, వృశ్చిక రాశుల మీద అర్థాష్టమ శని ప్రభావం ఉంది. వీటి నుంచి బయట పడేందుకు ప్రదోష వేళలో పూజ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు. అలాగే శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్
ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్
అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి.
శని అనుగ్రహం కోసం చేయాల్సిన పనులు
ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించి శని ఆలయానికి వెళ్ళాలి. ఈరోజు ఉపవాసం ఉండటం మంచిది. శనికి శాంతి పూజలు నిర్వహించడం వల్ల కష్టాలు తొలగిపోతాయి. దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం జరిపించాలి. నల్లని వస్త్రాలు, నల్ల మినపప్పు, ఆవాలు వంటివి దానం చేయడం మంచిది. కాకులకు, కుక్కలకు ఆహారం పెట్టాలి. ఇలా చేయడం వల్ల శని అనంతమైన ఆశీర్వాదం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగి అఖండ ధనయోగం ఏర్పడుతుంది.
శనీశ్వరుడి అనుగ్రహం పొందేందుకు ఆవనూనె దీపం వెలిగించాలి. తర్వాత రావి చెట్టు కింద దీపం వెలిగించాలి. నిరుపేదలకు నల్లని దుస్తులు దానం చేయాలి. హనుమాన్ చాలీసా, శని చాలీసా, శివ చాలీసా పఠించడం వల్ల శని దోషాల వల్ల కలిగే దుష్ప్రభావాల నుంచి బయటపడతారు.
ఇవి కొనకూడదు
శనికి ఇనుముతో సంబంధం ఉందని చెబుతారు. ఈరోజు నూనె, గొడుగు, నవధాన్యాలు, ఇనుము వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయరాదు. కానీ వీటిని దానం చేయడం వల్ల శని ఆశీస్సులు లభిస్తాయి. అలాగే ఆకలి అంటూ మీ దగ్గరకు వచ్చిన వారిని ఖాళీ చేతులతో వెనక్కి అసలు పంపించకూడదు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.