Maha shivaratri 2024: రేపే మహా శివరాత్రి.. శివపూజకి కావాల్సిన సామాగ్రి ఇదే, ఈ తప్పులు మాత్రం చేయవద్దు
Maha shivaratri 2024: పరమేశ్వరుడిని స్మరించుకుంటూ జరుపుకునే అతిపెద్ద పండుగ మహా శివరాత్రి. మార్చి 8న జరుపుకోనున్నారు. శివరాత్రి పూజకి కావాల్సిన సామాగ్రి జాబితా తెలుసుకుందాం.
Maha shivaratri 2024: శివుడు బ్రహ్మ రూపం నుంచి లింగ రూపంలోకి అవతరించిన రోజుని మహాశివరాత్రి జరుపుకుంటారు. శివపురాణం ప్రకారం శివుడు, పార్వతి దేవి వివాహం జరిగింది కూడా మహాశివరాత్రి రోజున అని చెప్తారు. మాఘ మాసం శుక్ల పక్షం చతుర్ధశి రోజు మార్చి 8 మహాశివరాత్రి పండుగ జరుపుకోనున్నారు. ప్రత్యేక ఆరాధన, శివార్చన, శివాభిషేకంతో శివాలయాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి.
మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు. రాత్రంతా నిద్రపోకుండా శివనామ స్మరణతో గడుపుతారు. మొత్తం నాలుగు దశల్లో శివ పూజ చేస్తారు. ఇంట్లోనే శివలింగం ప్రతిష్టించి అభిషేకం చేసుకొని పూజ జరిపించుకోవచ్చు. లేదంటే శివాలయానికి వెళ్లి అభిషేకం చేయించుకోవచ్చు. రుద్రాభిషేకంలోనూ పాల్గొనవచ్చు. ఇంట్లో పూజ చేసుకోవాలని అనుకుంటే ఈ వస్తువులు తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి.
శివ పూజకు కావలసిన సామాగ్రి
శివలింగం, శివపార్వతుల చిత్రపటం, పసుపు రంగు పువ్వులు, తెలుపు రంగు పూలు, శమీ ఆకులు, రావి చెట్టు ఆకులు, బిల్వపత్రాలు, గులాబీ, మల్లె పూలు, అభిషేకం చేసేందుకు ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, గంధం, కర్పూరం, పంచామృతం, సుగంధం పరిమళించే అగరవత్తులు, రుద్రాక్ష, ఉమ్మెత్త పువ్వులు, చెరుకు రసం, తమలపాకులు, అక్షింతలు, దుర్వా గడ్డి, భస్మం ఉండాలి. అలాగే శివుడికి ఇష్టమైన నైవేద్యాలు మాల్పువా, తండై, లస్సీ, ఖీర్, శ్రీఖండ్ పెట్టాలి.
పూజ ముహూర్తం
ఈ ఏడాది శివ పూజ చేసేందుకు నిషిత కాల సమయం గంట కంటే తక్కువగా వచ్చింది. అది కూడా నిషిత కాల పూజ సమయం అర్థరాత్రి వచ్చింది. మార్చి 8 అర్థరాత్రి (తెల్లవారితే మార్చి 9) 12.07 గంటల నుంచి 12.56 గంటల వరకు ఉంది. శివరాత్రి పూజలు చేసేందుకు పండితులు తప్పనిసరిగా నిషిత కాల సమయం ఎంచుకుంటారు.
శివరాత్రి సమయంలో నిషిత సమయం అంటే శివుడు లింగ రూపంలో భూమిపై కనిపించిన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో అన్ని ఆలయాలలో లింగోద్భవ పూజ నిర్వహిస్తారు. ఈరోజు పార్వతీ పరమేశ్వరులని పూజించిన వారి వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉపవాసం ఉండి పూజ చేయాలి. పెళ్లి కానీ అమ్మాయిలు శివుడి వంటి భర్తను పొందాలని కోరుకుంటూ ఉపవాసం ఉంటారు. వివాహం చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
మహా శివరాత్రి పూజ విధి
శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి గంగా స్నానం ఆచరించాలి. శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఉపవాసం చేయాలని సంకల్ప బలంతో ఉండాలి. శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేయాలి. పంచామృతంతో అభిషేకం చేసి బిల్వ దళాలు సమర్పించాలి. శుభ సమయంలో పూజ ప్రారంభించాలి. పండ్లు, పూలు, ధూపం, దీపాలతో శివార్చన చేయాలి. శివుడికి బిల్వపత్రాలు, ఉమ్మెత్త పువ్వులు సమర్పించాలి. తర్వాత శివయ్యకు ఇష్టమైన ఖీర్ సమర్పించాలి. శివ మంత్రాలు, శివ చాలీసా పఠిస్తూ పూజ చేయాలి. పూజ చేసే సమయంలో ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.
ఇవి సమర్పించకూడదు
శివపూజలో పసుపు కుంకుమలు సమర్పించకూడదు. శివలింగానికి నామాలు పెట్టేందుకు తెలుపు రంగు గంధం ఉపయోగించవచ్చు. తులసి ఆకులు పూజకి ఉపయోగించకూడదు. అభిషేకం చేసేందుకు గంగా జలం రాగి పాత్రలో తీసుకోవాలి. శంఖం పెట్టకూడదు. పూజ చేసే సమయంలో నలుపు రంగు దుస్తులు ధరించకూడదు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు దుస్తులు ధరించవచ్చు.
దోష నివారణ
మీ జాతకంలో కాలసర్ప దోషం, రాహువు ప్రతికూల స్థితిని కలిగి ఉంటే మహాశివరాత్రి రోజు ఒక జత వెండి లేదా రాగి సర్పాలను సమర్పించాలి. రుద్రాభిషేకం కూడా చేయడం వల్ల దోషాల నుండి విముక్తి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు. గంగాజలం, చెరుకురసం తో అభిషేకం చేయాలి.