Sri rama navami 2024: శ్రీరాముడి కోసం 14 ఏళ్లు నిద్రాహారాలు లేకుండా గడిపిన లక్ష్మణుడు.. ఎందుకో తెలుసా?-lakshmana who spent 14 years without food and sleep for lord rama do you know why ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Sri Rama Navami 2024: శ్రీరాముడి కోసం 14 ఏళ్లు నిద్రాహారాలు లేకుండా గడిపిన లక్ష్మణుడు.. ఎందుకో తెలుసా?

Sri rama navami 2024: శ్రీరాముడి కోసం 14 ఏళ్లు నిద్రాహారాలు లేకుండా గడిపిన లక్ష్మణుడు.. ఎందుకో తెలుసా?

Gunti Soundarya HT Telugu
Apr 15, 2024 04:12 PM IST

Sri rama navami 2024: తన అన్న శ్రీరాముడి కోసం లక్ష్మణుడు పద్నాలుగేళ్ళు నిద్రహారాలు లేకుండా గడిపాడు. అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అది ఏంటో తెలుసా?

శ్రీరాముడి కోసం 14 ఏళ్లు నిద్రాహారాలు మానేసిన లక్ష్మణుడు
శ్రీరాముడి కోసం 14 ఏళ్లు నిద్రాహారాలు మానేసిన లక్ష్మణుడు (pinterest)

Sri rama navami 2024: ఎంత చదివినా చదవాలని అనిపించే మహా గొప్ప కావ్యం రామాయణం. ఇందులోని ప్రతి విషయం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. రామాయణం అనగానే శ్రీరాముడి పుట్టుక, సీతారాముల కళ్యాణం, రావణ సంహారం, పట్టాభిషేకం గురించి మాట్లాడతారు. ఇందులో మాట్లాడుకోవాల్సిన మరొక వ్యక్తి ఉన్నారు. ఆమె ఊర్మిళా దేవి... లక్ష్మణుడి ధర్మపత్ని. భర్త బాధ్యతను తన భుజాలపై వేసుకుని పద్నాలుగు సంవత్సరాలు నిద్రలోనే జీవితం గడిపింది. అలా చేయడం వెనుక ఒక కారణం ఉంది. అది ఏమిటంటే..

అయోధ్య మొత్తం శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడని సంబరాలు జరుగుతున్నాయి. అంతా సంతోషంగా ఉన్న సమయంలో దశరథ మహా రాజు భార్య కైకేయి చేసిన పనివల్ల అంతా తారుమారు అయ్యింది. తన కొడుకుని పట్టాభిషిక్తుడిని చేయాలని శ్రీరాముడిని అడవులకు పంపించాలని కోరుతుంది.

అన్న వెంటే లక్ష్మణుడు

అలా తండ్రికి ఇచ్చిన మాటను జవదాటకుండా శ్రీరాముడు 14 ఏళ్ల పాటు వనవాసం చేశాడు. అన్న వెనకే తాను అన్నట్టు శ్రీరాముడి వెంట లక్ష్మణుడు కూడా అరణ్యవాసానికి బయలుదేరాడు. శ్రీరాముడు అంటే విపరీతమైన ప్రేమ, భక్తి భావం వల్ల లక్ష్మణుడు సదా అన్నను అనుసరించాడు. అందుకే అన్నదమ్ములు అంటే రామలక్ష్మణుల్లాగా ఉండాలని చెబుతారు.

రాముడు వెంట అరణ్యవాసానికి వెళ్ళి నిత్యం తన అన్నని కంటికి రెప్పలా కాపాడుకోవాలని లక్ష్మణుడు అనుకుంటాడు. అయితే భర్త వెనకే భార్య అన్నట్టు లక్ష్మణుడి సతీమణి ఊర్మిళా దేవి కూడా అడవికి వస్తానని చెప్తుంది. అయితే అన్నా వదినలని సంరక్షించుకోవడం కోసం తాను అడవులకు వెళుతున్నాను చెప్తాడు. భార్య పక్కన ఉంటే తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేనని ఊర్మిళా దేవిని అడవికి రాకుండా అయోధ్యలోనే ఉండిపొమ్మని అంటాడు. అలా ఆమె అడవులకు వెళ్ళకుండా ఆగిపోతుంది. కానీ భర్తతో సమానంగా సీతారాములను సేవించుకుంది.

ఊర్మిళా దేవి భర్త వెంట వెళ్లకపోయినప్పటికీ సీతారాముల కోసం బాధ్యతను మోసింది. 14 ఏళ్ల పాటు వారికోసం నిద్రలోనే గడిపింది. ఎటువంటి ఆహారం తీసుకోకుండా 14 సంవత్సరాల పాటు నిద్రపోతూనే ఉంది. ఊర్మిళ అన్ని సంవత్సరాల పాటు నిద్రపోవడం వెనుక కారణం ఉంది. అదేమిటంటే..

లక్ష్మణుడి నిద్ర పంచుకున్న ఊర్మిళా దేవి

ఒకనాడు సీతారాములు కుటీరంలో ఉన్న సమయంలో లక్ష్మణుడు బయట వారికి కాపలాగా ఉంటాడు. అయితే కొద్దిసేపటికి లక్ష్మణుడిని నిద్రాదేవి సమీపిస్తుంది. తన కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఎటువంటి ఆటంకం కలిగించొద్దని కోరుకుంటాడు. తన అన్నావదినను సంరక్షించుకోవాలని వారిని చూసుకోవడం కోసమే తాను అన్న వెంట అరణ్యానికి వచ్చినట్లు లక్ష్మణుడు నిద్రాదేవికి చెప్తాడు. ఈ 14 సంవత్సరాలు తనని విడిచి పెట్టమని కోరుకుంటాడు.

అయితే ప్రకృతి ధర్మం తప్పకూడదని నిద్రనే ఎవరికైనా పంచాలని నిద్రాదేవత లక్ష్మణుడికి చెప్తుంది. దీంతో వెంటనే లక్ష్మణుడు తన నిద్రని తన భార్య ఊర్మిళా దేవికి ఇవ్వమని చెప్తాడు. ఆమెకి తన అభిప్రాయం తెలియజేస్తే తప్పక అంగీకరిస్తుందని అంటాడు. అలా ఊర్మిళా దేవి భర్త బాధ్యతను తన భుజాన వేసుకుని 14 ఏళ్ల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా తన జీవితం నిద్రలోనే గడిపింది.

ఈ 14 సంవత్సరాలు లక్ష్మణుడు నిద్రాహారాలు మానేసి అన్నా వదినలకు సేవ చేస్తూ వారిని రక్షించుకున్నాడు. లక్ష్మణుడు 14 సంవత్సరాల పాటు నిద్రాహారాలు మారడం వెనక మరొక కారణం కూడా ఉందని అంటారు. రావణాసురుడి కుమారుడు మేఘనాథుడు 14 ఏళ్ళు నిద్రాహారాలు లేని వ్యక్తి చేతిలోనే మరణించేలాగా వరం పొందుతాడు. అలా లక్ష్మణుడి నిద్రను ఊర్మిళాదేవి పంచుకుంది. మేఘనాథుడిని సంహరించే అవకాశం లక్ష్మణుడికి దక్కింది. అడవులకు రాకపోయినా కూడా ఊర్మిళా దేవి సీతారాములకు అండగా భర్త బాధ్యతను నెరవేర్చి ఉత్తమ భార్యగా తన ధర్మాన్ని నెరవేర్చింది.

శ్రీరామనవమిని శ్రీరాముడు జన్మించిన రోజుగా మాత్రమే కాకుండా పట్టాభిషిక్తుడైన రోజు కూడా పరిగణిస్తారు. ఇదే నవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.

 

 

 

 

Whats_app_banner