Chanakya Niti Telugu : పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే మంచి భర్త అవుతారు
Chanakya Niti On Husband Qualities : ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మంచి భర్తకు ఉండాల్సిన లక్షణాలను వివరించాడు. మంచి భర్త కావాలంటే ఏం చేయాలో చెప్పాడు.
జీవితానికి ఎన్నో విధానాలు అందించిన గొప్ప గురువు ఆచార్య చాణక్యుడు. తన చాణక్య నీతి పెళ్లి బంధం గురించి చాలా విషయాలను వివరించాడు. పురుషుల కోసం ప్రత్యేకంగా విధానాలను కూడా రూపొందించాడు. వైవాహిక జీవితంలోని కొన్ని రహస్యాలను స్వేచ్ఛగా పంచుకున్నాడు చాణక్యుడు. పెళ్లయ్యాక మీ భార్యను ఎలా చూసుకోవాలి? మీ భార్య ఎలాంటి ప్రవర్తనను ఇష్టపడుతుందో కూడా వివరించాడు.
పెళ్లికి ముందు ఇష్టంవచ్చినట్టుగా తిరిగే అబ్బాయిలంతా పెళ్లి తర్వాత బాధ్యతగా ప్రవర్తించడం చూస్తుంటాం. దీనంతటికీ కారణం భార్య అనడంలో తప్పులేదు. వైవాహిక జీవితంలో మీ భార్యను సంతోషంగా ఉంచడం కూడా చాలా ముఖ్యమైనది. మంచి భర్తగా ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి.
మోసం చేయకూడదు
చాణక్యుడు ప్రకారం వివాహితుడు తన భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ మోసం చేయకూడదు. అదే సంబంధాన్ని చివరి వరకు కొనసాగించి విశ్వాసంగా ఉండాలి. ఇంటి బయట పర స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడం పురుషుడికి కచ్చితంగా మంచిది కాదు. మనిషి ఒక సంబంధానికి పరిమితం కావాలి. ఒక వ్యక్తిని ప్రేమించాక మరో వ్యక్తి దగ్గరకు వెళ్లకూడదు. మంచి భర్త.. తన భార్యతో మాత్రమే సంతోషంగా ఉంటాడు. ఇతరుల గురించి ఆలోచించడు.
భార్యను గౌరవించాలి
చాణక్యుడు ప్రకారం భర్త తన భార్యను గౌరవించాలి. ఆమెను ఎప్పుడూ చిన్నచూపు చూడకండి. ఇతరుల ముందు ఆమెను అవమానించకండి. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకునే కుటుంబం నిజంగా సంతోషంగా ఉంటుంది. భార్య చేసే చిన్న చిన్న తప్పులను ఎత్తి చూపి ఆమె మనసును గాయపరచకూడదు. అలా చేస్తే ఆమె చాలా బాధపడుతుంది. మీపై కోపం పెరిగిపోతూ ఉంటుంది.
కుటుంబానికి సమయం ఇవ్వాలి
చాణక్యుడి ప్రకారం పురుషులు కష్టపడి పనిచేస్తారు. ఆ పని ద్వారా ఎంత సంపాదిస్తే అంత ఆనందించండి. ఎక్కువ సంపాదించాలనుకోవడం కూడా మంచిది కాదు. మిగిలిన కాలాన్ని వేరే చోట డబ్బు సంపాదిస్తూ గడిపితే కుటుంబానికి సమయం కేటాయించలేకపోతారు. కుటుంబంతో ఆనందంగా గడపలేకపోతారు. డబ్బు ముఖ్యమే కానీ అంతకంటే ముఖ్యమైనది మీ కుటుంబం. భార్య, పిల్లలకు సమయం కేటాయించాలి. అప్పుడే మీపై అందరికీ గౌరవం ఉంటుంది.
బాధ్యత కూడా చాలా ముఖ్యం
చాణక్యుడు ప్రకారం, గృహస్థునికి బాధ్యత చాలా ముఖ్యం. మీరు మీ కుటుంబాన్ని బాగా చూసుకోవాలంటే మీరు పని చేయాలి. పని చేయడం మాత్రమే కాదు, మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలుసుకోవాలి. ఆనందం కోసం విచ్చలవిడిగా ఖర్చు చేయడానికి వెళ్లవద్దు. కుటుంబాన్ని పోషిస్తూనే మిగిలిన డబ్బు భవిష్యత్తు కోసం పొదుపు చేయాలి. పిల్లల కోసం దాచిపెట్టాలి.
కోట్ల రూపాయలు ఉంటేనే భార్యను సంతోషంగా చూసుకోగలం అనే మీ ఆలోచన తప్పు. చాణక్యుడు చెప్పినట్లు పైన చెప్పిన లక్షణాలు ఉంటే చాలు. మీ భార్యను బాగా చూసుకుంటారు, కుటుంబం సంతోషంగా ఉంటుంది. చాణక్య నీతి ప్రకారం మంచి భర్త అనేవాడు భార్యకు సమయం ఇవ్వాలి. ప్రేమ ఇవ్వాలి. ఆమెపై ప్రతీ విషయానికి చిరాకు పడకూడదు. మీ జీవితాంతం ఆమెకు తోడు ఉంటానని మాట ఇవ్వాలి. అప్పుడే బంధం బలంగా ఉంటుంది.