Ugadi Rasi Phalalu 2024: కర్కాటక రాశి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు-karkataka rasi 2024 25 sri krodhi nama samvatsara ugadi rasi phalalu cancer moon sign yearly horoscope in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ugadi Rasi Phalalu 2024: కర్కాటక రాశి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు

Ugadi Rasi Phalalu 2024: కర్కాటక రాశి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు

HT Telugu Desk HT Telugu

Ugadi Rasi Phalalu 2024: కర్కాటక రాశి జాతకులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని హిందుస్తాన్ టైమ్స్ పాఠకులకు ప్రత్యేకంగా అందించారు.

కర్కాటక రాశి వారి ఉగాది 2024 రాశి ఫలాలు (Pixabay)

కర్కాటక రాశి, పునర్వసు: 4వ పాదము,

పుష్యమి 1, 2, 3, 4 పాదములు,

ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు.. ఆయా నక్షత్రాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందిన జాతకులు అవుతారు. క్రోధి నామ సంవత్సరంలో వీరికి ఆదాయం 14 పాళ్లు, వ్యయం 2 పాళ్లు, రాజపూజ్యం 3 పాళ్లు, అవమానం 3 పాళ్లు ఉన్నాయి.

కర్కాటక రాశి ఉగాది రాశి ఫలాలు

శ్రీ కోధి నామ సంవత్సరం నందు కర్కాటక రాశి వారికి చిలకమర్తి పంచాంగ గణనం ఆధారంగా ఈ సంవత్సరం మధ్యస్త ఫలితాలు ఉన్నాయని పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.

బృహస్పతి లాభ స్థానమునందు సంచరించుట చేత, శని అష్టమ స్థానము నందు సంచరించుట చేత, రాహువు భాగ్య స్థానముయందు సంచరించుట చేత మరియు కేతువు తృతీయ స్థానమునందు సంచరించుట చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలున్నాయి.

ఈ రాశివారు అష్టమశని ప్రభావం ఉన్నప్పటికి లాభములో గురుడు, తృతీయంలో కేతువు, భాగ్యములో రాహువు అనుకూల ప్రభావంచేత ఈ సంవత్సరం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు పొందుతారు.

బృహస్పతి అనుకూల ప్రభావంచేత కర్మాటక రాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో అనుకూల ఫలితములు కలుగును. గత కొంతకాలముగా ప్రమోషన్లు వంటి వాటిలో ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు తొలగి ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగును.

వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వ్యాపారంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులు ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ శని ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అనారోగ్య సమస్యలు, ఒత్తిళ్ళు మరియు కుటుంబసమస్యలు కొంత వేధించును.

స్త్రీలు ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. అరోగ్యవిషయాల్లో శ్రద్ధ వహించాలి. స్త్రీలకు కుటుంబ సమస్యలు, అనారోగ్యం వేధించును. విద్యార్థులకు మధ్యస్థ సమయం. కష్టపడాల్సినటువంటి సమయం. విదేశీ ప్రయత్నాలలో సమస్యలు ఇబ్బందిపెట్టును.

రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. సినీరంగం, మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కలుగుతున్నాయి. మొత్తంమీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు అధికముగా ఉన్నాయి.

కర్కాటక రాశి వారి ప్రేమ జీవితం 2024-25

కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం పేమపరమైనటువంటి విషయాల్లో చిక్కులు అధికముగా ఉండును. జీవిత భాగస్వామితో ఘర్షణలు పేమపరమైనటువంటి విషయాలలో ఈ సంవత్సరం అచితూచి వ్యవహరించండి.

కర్కాటక రాశి వారి ఆర్థిక విషయాలు 2024-25

కర్కాటక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆర్థిక విషయాల్లో మార్పు ఏర్పడును. ఆర్థిక పురోగతి కలుగును. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు సూత్రాలు పాటించాలని సూచన.

కర్కాటక రాశి వారి కెరీర్ 2024-25

కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం వలన కెరీర్‌లో ఒడిదుడుకులు ఏర్పడును. అయినప్పటికి లాభస్థానములో గురు గ్రహ అనుకూలత వలన కెరీర్‌లో అనుకున్న ఫలితాలను పొందగలరు.

కర్కాటక రాశి వారి ఆరోగ్యం 2024-25

కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శని ప్రభావం వలన ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య సమస్యలు కొంత వేధించేటటువంటి స్ధితి ఏర్పడుతుంది. బృహస్పతి అనుకూలత వలన అనారోగ్య సమస్యలనుండి బయటపడే ప్రయత్నాలు చేసెదరు.

ధరించాల్సిన నవరత్నం: కర్కాటక రాశి వారు ధరించవలసిన నవరత్నం ముత్యం.

ప్రార్థించాల్సిన దైవం: కర్కాటక రాశి వారు ఆరాధించవలసిన దైవం శివుడు.

కర్కాటక రాశి పరిహారాలు

కర్కాటక రాశి జాతకులు 2024 సంవత్సరంలో మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం, వేంకటేశ్వరస్వామిని పూజించుకోవడం, దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం శ్రేయస్కరం. అలాగే శివాలయంలో శివునికి అభిషేకం వంటివి చేసుకోవడం వల్ల మరింత శుభఫలితాలు కలుగుతాయని ప్రముఖ అధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

కర్కాటక రాశి జాతకుల నెలవారీ రాశి ఫలాలు

ఏప్రిల్‌ : ఈ మాసం అంత అనుకూలంగా లేదు. అకస్మిక ప్రయాణములు, ఆర్థికపరమైన ఇబ్బందులు కలుగును. ఖర్చులధికమగును. బంధువుల అనారోగ్యం సూచితం. కుటుంబ సౌఖ్యం. బంధువులతో అనందముగా గడుపుతారు.

మే: ఈ మాసం మీకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. శారీరక అలసట, ఇబ్బందులు. అకాల భోజనము. బంధువులతో విభేదాలేర్చడుట. తలకు సంబంధించిన బాధలు. శత్రువులు అధికమగును. జాగ్రత్త వహించవలెను. రాజకీయనాయకులు తమ పదవులను కాపాడుకొనుట మంచిది.

జూన్‌: ఈ మాసం అనుకూలంగా లేదు. చెడు స్నేహములు పెరుగును. చంచల స్వభావం. బంధువులతో గొడవలేర్పడును. మతిమరుపు సంభవించును. ఉద్యోగులకు బదిలీలేర్పడును. మతిమరుపు సంభవించును. బంధువులు దూరమగును. అకాలభోజనము. మిత్రలాభము. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కలుగును.

జూలై: ఈ మాసం కర్కాటక రాశి జాతకులకు అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు నెరవేరును. సంతానపరంగా సౌఖ్యం. విందుభోజనం. శారీరక శ్రమ తగ్గును. బంధుమిత్రులను కలుసుకుంటారు. అనందముగా, అహ్హాదముగా గడుపుతారు. గృహ సంబంధమైన పనులు చేస్తారు. ధనప్రాప్తి. శత్రుజయము. స్త్రీ మూలక సమస్యల వల్ల కొంత చికాకులు ఏర్పడును.

ఆగస్సు: ఈ మాసం మీకు మధ్యస్థముగా ఉన్నది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఉద్యోగములయందు ఉన్నతి. కుటుంబమునందు అభిప్రాయ భేదముల ఏర్పడు సూచన. ఆర్థికాభివృద్ధి కలుగును.

సెఫ్టెంబర్‌: ఈ మాసం అంత అనుకూలంగా లేదు. కోపావేశములు తగ్గించుకొనుట మంచిది. కలహములు ఏర్పడును. బంధుమిత్రులతో అచితూచి వ్యవహరించాలి. వృత్తి వ్యాపారపరంగా మధ్యస్థ సమయం.

అక్టోబర్‌: ఈ మాసం అనుకూలంగా లేదు. చెడు వ్యసనముల నుండి తప్పించుకొనుట మంచిది. భావోద్వేగాలకు గురవుతారు. దైవ సందర్శన తప్పనిసరి. అపనిందలు పడకుండా జాగ్రత్త అవసరం. ధనప్రాప్తి. అరోగ్యం అనుకూలం.

నవంబర్‌: ఈ మాసం కర్కాటక రాశి జాతకులకు అనుకూలంగా లేదు. పితృపరంగా అనారోగ్యం. గురు ప్రభావంచే కష్టములు దూరమగుట. ధనలాభం. భోజన సౌఖ్యం. ఆగిపోయిన పనులు పూర్తగును. దూరప్రయాణములు చేయవలసివచ్చును.

డిసెంబర్‌: ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. మృష్టాన్న భోజనము. స్త్రీ సౌఖ్యం. మీరు చేసే పనులు కలసివస్తాయి. దూరదేశ ప్రయాణము. మిత్రలాభం. సౌఖ్యము.

జనవరి: ఈ మాసం మధ్యస్థ ఫలితాలున్నాయి. ధనము సంప్రాప్తి. పాత బాకీలు వసూలగును. నూతన స్నేహితులు పరిచయం. వ్యాపారమునకై కృషి వేస్తారు. శారీరకంగా అలసట కలుగు సూచన. కళత్రమునకు అనారోగ్యము.

ఫిబ్రవరి: ఈ మాసం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో అనందముగా గడుపుతారు. మిత్రులతో సంభాషణచే సత్ఫలితాలు ఉన్నాయి. కళత్ర సుఖము. సంతానమునకు వివాహ ప్రయత్నములు ఫలించుట. కొంత ధనవ్యయము గోచరించుచున్నది.

మార్చి: ఈ మాసం కర్కాటక రాశి జాతకులకు అంత అనుకూలంగా లేదు. గృహ సంబంధ మార్పులు. శుభ కార్య జయం. మృష్టాన్న భోజనం. స్థానములో మార్పులు కలుగును.

- పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000