Heramba Sankashti Chaturthi: హేరంబ సంకష్ట చతుర్థి తేదీ, శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి
Heramba Sankashti Chaturthi: శ్రావణ మాసంలో వచ్చే చతుర్థిని హేరాంబ సంకష్ట చతుర్థి అంటారు. ఈనెల 22న జరుపుకోనున్నారు. తల్లులు సంతాన ప్రాప్తి కోసం, తమ బిడ్డ దీర్ఘాయుష్షు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. హేరాంబ సంకష్ట చతుర్థి పూజా విధానం, శుభ సమయం తెలుసుకుందాం.
Heramba Sankashti Chaturthi: ప్రతి నెల చతుర్థి తిథి రోజు వినాయకుడిని పూజిస్తారు. హిందూ మతంలో సంకష్ట చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు గణేశ ఆరాధనకు అంకితం చేశారు. సంకష్టి అనే కష్ట సమయాల నుంచి బయట పడేయడం అని అర్థం.
శ్రావణ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థిని హేరాంబ సంకష్ట చతుర్థి అంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రత్యేకంగా రక్షిత స్వభావానికి ప్రసిద్ధి చెందిన గణేశుడి ఐదు తలల రూపమైన హేరంబను పూజిస్తారు.
హేరంబ సింహంపై స్వారీ చేసే సంరక్షక దేవుడిగా కొలుస్తారు. ఈ రూపాన్ని పూజించడం వల్ల భక్తులకు ధైర్యం, జ్ఞానం, దుష్ట శక్తుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ చతుర్థిని పాటించడం వల్ల శాంతి, శ్రేయస్సు, జీవితంలో ఏవైన అడ్డంకులు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే విఘ్నాలు తొలగించే వాడిని వినాయకుడు అంటారు. ఏ పని తలపెట్టినా ముందు వినాయకుడు తొలి పూజ అందుకుంటాడు.
స్త్రీలు సంతానం, దీర్ఘాయువు కోసం ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. హేరంబ్ చతుర్థి రోజున గణేశుడు, చంద్ర దేవుడిని పూజిస్తారు. హేరంబ్ సంకష్టి చతుర్థి పూజ, పద్ధతి, మంత్రం, చంద్ర దర్శన శుభ సమయం తెలుసుకుందాం.
హేరంబ చతుర్థి శుభ సమయం
హేరంబ చతుర్థి తిథి ప్రారంభం – ఆగస్టు 22, 2024 మధ్యాహ్నం 01:46 గంటలకు
హేరంబ చతుర్థి తేదీ ముగుస్తుంది - ఆగస్టు 23, 2024 ఉదయం 10:38 గంటలకు
హేరంబ సంకష్టి చతుర్థి పూజా విధానం
ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించాలి. పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకుని వినాయకుడిని ప్రతిష్టించాలి. దేశీ నెయ్యితో వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించాలి . పసుపు రంగు పూల దండ సమర్పించాలి. మోదక్, లడ్డూలు నైవేద్యంగా పెట్టాలు. విగ్రహం దగ్గర కొన్ని అక్షింతలు, నీటితో నింపిన కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
దుర్వా గడ్డి, అరటిపండ్లు, సమర్పించాలి. వినాయక చవితికి సంబంధించిన కథను పారాయణం చేయాలి. అలాగే గణేశ మంత్రాలు, స్తోత్రాలు పఠించాలి. ఇలా చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సిద్ధిస్తుంది. సాయంత్రం గణేశ హారతిని భక్తిశ్రద్ధలతో ఇవ్వాలి. ఈ వ్రతంలో భాగంగా చంద్రుడికి నీటిని సమర్పించాలి. చంద్రుడికి అర్ఘ్యం సమర్పించే నీరు మీ పాదాల మీద పడకుండా చూసుకోవాలి. ఇలా చేయడంతో ఉపవాసం పూర్తవుతుంది. ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి.
చంద్రోదయం సమయం
దృక్ పంచాంగ్ ప్రకారం ఆగస్టు 22 రాత్రి 08:43 గంటలకు చంద్రోదయం జరుగుతుంది. అయితే వివిధ నగరాల్లో చంద్రోదయ సమయంలో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు. చంద్ర దర్శనం, పూజ తర్వాత మాత్రమే ఉపవాసం సంపూర్ణంగా చేసినట్టు అవుతుంది.
మంత్రం- ఓం గణేశాయ నమః
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.