Maha shivaratri 2024: మహా శివరాత్రి రోజు అభిషేకం చేయాలని అనుకుంటున్నారా? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి
Maha shivaratri 2024: మహా శివరాత్రి నాడు శివలింగానికి రుద్రాభిషేకం చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఇలా శివలింగాన్ని అభిషేకిస్తే మీరు చేసే పూజకు ఫలితం దక్కుతుంది.
Maha shivaratri 2024: దేశవ్యాపంగా మహా శివరాత్రి సంబరాలు మొదలయ్యాయి. అలయాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఏటా 12 శివరాత్రులు వచ్చినప్పటికీ మహా శివరాత్రికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ ఏడాది మార్చి 8న మహా శివరాత్రి వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి ఏడాది మాఘ మాసం కృష్ణపక్ష చతుర్దశి తిధిన మహాశివరాత్రి జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈరోజే పరమశివుడు, పార్వతి దేవి వివాహం జరిగినట్లు చెబుతారు.
పరమేశ్వరుడు పూజించడం వల్ల గొప్ప ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. శివరాత్రి రోజు తప్పనిసరిగా రుద్రాభిషేకం చేస్తారు. ఇప్పటికే అన్ని ప్రాంతాలలో శివరాత్రి సంబరాలు ప్రారంభమయ్యాయి. శివుడు అభిషేక ప్రియుడు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే శివుడిని అభిషేకించేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.
రుద్రాభిషేకం అంటే ఏంటి?
శివుడిని రుద్ర అవతారంలో అభిషేకిస్తారు. పవిత్రమైన జలాలు, పువ్వులు, బిల్వ దళాలు సమర్పించి 108 సార్లు శివుడి మంత్రాలు పఠిస్తూ అభిషేకం చేస్తారు. దుష్టశక్తులు తొలగించి ఇంటికి శ్రేయస్సును తీసుకు రమ్మని కోరుకుంటూ ఈ అభిషేకం జరిపిస్తారు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని దుష్టశక్తులు నశించిపోతాయి. ఆధ్యాత్మికంగా బలపడతారు. ఈ ఆచారంలో భాగంగా శివుడికి అనేక పూలు, ఇతర వస్తువులు సమర్పిస్తారు.
మహాశివరాత్రి రోజు చేసే రుద్రాభిషేకానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ అభిషేకం జరిపించేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేసేటప్పుడు శివలింగం ఏ దిశలో ఉంటుంది అనేది తప్పనిసరిగా గ్రహించాలి. తూర్పు లేదా ఉత్తర దిక్కు వైపు మాత్రమే పూజ చేయాలి.
రుద్రాభిషేకం జరిపించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..
రుద్రాభిషేకం జరిపించేటప్పుడు పొరపాటున కూడా శివలింగాన్ని మీ ఎడమ చేతితో తాకకూడదు. తప్పనిసరిగా కుడి చేతిని మాత్రమే ఉపయోగించి శివలింగాన్ని పూజించాలి. మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయాలని అనుకుంటే మీరు వెండి, ఇత్తడి, రాగి పాత్రలను ఉపయోగించి అందులోని గంగా జలంతో శివలింగానికి అభిషేకం చేయాలి.
రుద్రాభిషేకం చేసేటప్పుడు శివలింగం చుట్టూ ప్రదక్షణలు చేయకూడదు. ఎందుకంటే శివలింగానికి అర్పించే నీరు చాలా పవిత్రమైనది. అందువల్ల వాటిని దాటకూడదు. రుద్రాభిషేకం చేసేటప్పుడు “ఓం నమో భగవతే రుద్రాయ” అనే మంత్రాన్ని పఠించాలి. అప్పుడు మీరు చేసే అభిషేకానికి సార్ధకత ఉంటుంది. లింగం యోని భాగం ఉత్తర ముఖంగా ఉండి మీరు పడమర ముఖంగా ఉండి పూజించాలి.
రుద్రాభిషేకం ఎన్ని రకాలు
విశ్వాసాల ప్రకారం ఆరు రకాలుగా రుద్రాభిషేకాలు భక్తులు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రుద్రాభిషేకానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. ఒక్కో అభిషేకానికి ఒక్కో ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో ఎలాంటి రుద్రాభిషేకం చేసుకోవాలో తెలుసుకుందాం.
జలాభిషేకం
ఇందులో భాగంగా శివలింగాన్ని పవిత్రమైన గంగాజలంతో అభిషేకించాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
పాలాభిషేకం
ఆవు పాలు మాత్రమే ఉపయోగించి రుద్రాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు దీర్ఘాయువు లభిస్తుంది. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న అనేక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తేనెతో అభిషేకం
తేనెతో అభిషేకించడం వల్ల మీ అదృష్టం పెరుగుతుంది. మీ జీవితాన్ని సరళతరం చేస్తుంది. సంతోషంగా ఉండేలా భక్తులను ఆశీర్వదిస్తాడు.
పంచామృతంతో అభిషేకం
ఆవు పాలు, తేనె, స్వచ్చమైన నెయ్యి, ఆవు పెరుగు, పంచదారని కలిపి పంచామృతం అంటారు. వీటితో అభిషేకం చేయడం వల్ల సంపద, శ్రేయస్సు, విలాసం, సంతోషం, ఐశ్యర్యమ మీకు లభిస్తాయి.
నెయ్యితో అభిషేకం
నెయ్యితో అభిషేకించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు.
పెరుగుతో అభిషేకం
దాంపత్య జీవితంలో సమస్యలు, సంతాన లేమితో బాధపడుతున్న దంపతులు పెరుగుతో అభిషేకం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు.