ఉత్తరాఖండ్ లో ట్రెక్కింగ్ కు వెళ్లిన కర్నాటకకు చెందిన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వారు చనిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలంలో సహాయ చర్యలు చేపడుతున్న రెస్క్యూ ఆపరేషన్స్ టీమ్ తో టచ్ లో ఉన్నామని, మృతుల కుటుంబాలకు సమాచారం అందిస్తున్నామని కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
మే 27న కర్నాటక, మహారాష్ట్రలకు చెందిన 19 మంది సభ్యుల బృందం, మరో ముగ్గురు స్థానిక గైడ్స్ తో కలిసి ఉత్తరకాశి నుంచి హిమాలయ పర్వతాల్లో 35 కిలోమీటర్ల పొడవైన ట్రెక్కింగ్ కు వెళ్లారు. హిమాలయన్ వ్యూ ట్రెక్కింగ్ ఏజెన్సీ అనే ట్రెక్కింగ్ సంస్థ వారిని తీసుకెళ్లింది. అయితే తిరిగి బేస్ క్యాంప్ కు వెళ్తుండగా ఎత్తైన ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా ప్రతికూలంగా మారింది. దాంతో, వారు హిమాలయ పర్వతంపై చిక్కుకుపోయారు. వారిలో 9 మంది చనిపోగా, 13 మందిని సహాయ సిబ్బంది రక్షించగలిగారు. సహాయక చర్యలను పర్యవేక్షించాలని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరె గౌడను కర్నాటక సీఎం సిద్దరామయ్య ఆదేశించారు. దాంతో, కృష్ణ బైరె గౌడ అత్యవసరంగా డెహ్రాడూన్ వెళ్లి అక్కడి అధికారులతో కలిసి సహాయ చర్యలను సమన్వయం చేస్తున్నారు.
స్థానికంగా అందుబాటులో ఉన్న హెలికాప్టర్ల సహాయంతో మంగళవారం సాయంత్రం అత్యవసర సహాయక చర్యలు ప్రారంభించినట్లు కర్నాటక మంత్రి కృష్ణ బైరె గౌడ తెలిపారు. ట్రెక్కింగ్ చేస్తున్న వారిని రక్షించేందుకు భారత వైమానిక దళ హెలికాప్టర్ బుధవారం ఉదయం 9 గంటలకు ఉత్తరకాశీకి చేరుకున్నాయి. మృతుల సంఖ్య తొమ్మిదికి చేరడం చాలా బాధాకరమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడ్తామన్నారు.
టాపిక్