NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..
NEET UG: దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ యూజీ 2024 పరీక్ష మే 5వ తేదీన జరుగుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు పాటించాల్సిన నియమ, నిబంధనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. పరీక్ష హాల్ లోకి తీసుకువెళ్లకూడని వస్తువుల జాబితాను ప్రకటించింది.
NEET UG 2024: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024) ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 5, 2024, ఆదివారం రోజు నిర్వహిస్తోంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలను శనివారం ఎన్టీఏ విడుదల చేసింది.
షూస్ వేసుకోవద్దు..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో పేర్కొన్న డ్రెస్ కోడ్ ను కూడా నీట్ యూజీ 2024 (NEET UG 2024) రాస్తున్న అభ్యర్థులు పరిశీలించాల్సి ఉంటుంది. పరీక్ష సజావుగా నిర్వహించడంలో ఏజెన్సీకి సహాయపడేందుకు డ్రెస్ కోడ్ ఆదేశాలను విడుదల చేశారు. ఎన్టీఏ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం..
- విద్యార్థుల డ్రెసింగ్ సింపుల్ గా ఉండాలి.
- భారీ దుస్తులు ధరించకూడదు.
- పొడవాటి స్లీవ్స్ ఉన్న షర్ట్స్ లేదా టీ షర్ట్స్ ధరించకూడదు.
- అయితే అభ్యర్థులు సంప్రదాయ దుస్తులు ధరించాల్సి వస్తే, వారు చివరి రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. దానివల్ల, అభ్యర్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన తనిఖీలకు తగినంత సమయం లభిస్తుంది.
- అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి బూట్లు ధరించి రాకూడదు. తక్కువ మడమలతో సాండల్స్, చెప్పులు లేదా స్లిప్పర్స్ ధరించవచ్చు.
- ఏదైనా అనివార్య వైద్య లేదా ఇతర అవసరాల కోసం ఏవైనా డివైజెస్ లేదా మెడిసిన్స్ హాల్లోకి తీసుకువెళ్లాలనుకుంటే, అడ్మిట్ కార్డ్ ను జారీ చేసే ముందే ఎన్టీఏ అనుమతి తీసుకోవాలి.
- పరీక్ష హాళ్లోకి తీసుకువెళ్లకూడని వస్తువుల జాబితాను ఎన్టీఏ వెబ్ సైట్ లో గమనించవచ్చు.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చేసుకుని ఫొటో, సంతకం, రోల్ నంబర్ బార్ కోడ్ లను చెక్ చేసుకోవాలి. పరీక్ష సమయంలో గుర్తింపు, ధృవీకరణ ప్రయోజనాల కోసం ఈ వివరాలు కీలకం.
- అభ్యర్థి అడ్మిట్ కార్డులో సూచించిన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.
- అభ్యర్థులు ఇన్విజిలేటర్ సూచనల కోసం వేచి చూడాలి. వారు చెప్పే వరకు సీటు నుంచి లేవొద్దు.
- పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభ్యర్థులు ఒక రోజు ముందుగానే పరీక్షా కేంద్రం వద్దకు వెళ్లి రావడం మంచిది.
- అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఐడీ ప్రూఫ్, సరైన తనిఖీ లేకుండా ఏ అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు వ్యక్తిగత పారదర్శక వాటర్ బాటిల్, దరఖాస్తు ఫారంలో అప్ లోడ్ చేసిన అదనపు ఫొటో, అడ్మిట్ కార్డుతో పాటు పోస్ట్ కార్డు సైజు ఫొటోతో కూడిన సెల్ఫ్ డిక్లరేషన్ ను పరీక్ష హాల్ కు తీసుకెళ్లాలి.
- అభ్యర్థి చెల్లుబాటు అయ్యే గుర్తింపు రుజువుగా ఆధార్ కార్డు (ఫోటోతో)/ ఇ-ఆధార్ / రేషన్ కార్డు / ఆధార్ లేకపోతే.. ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబరును ఫోటోతో సహా కేంద్రానికి తీసుకెళ్లాలి.
- అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో పేర్కొన్న ఇతర నిషేధిత వస్తువులతో సహా ఎటువంటి వ్యక్తిగత వస్తువులను పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లడానికి వీలు లేదు.
- పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ (ఒరిజినల్, ఆఫీస్ కాపీ రెండూ) ఇచ్చి, టెస్ట్ బుక్ లెట్ ను మాత్రమే తమ వెంట తీసుకెళ్లాలి.
- పరీక్ష ప్రారంభమైన మొదటి గంట, చివరి అరగంటలో అభ్యర్థులకు బయో విరామం లభించదు.
ఒకే షిఫ్ట్ లో పరీక్ష
నీట్ యూజీ 2024 (NEET UG 2024) పరీక్షను మే 5వ తేదీ ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు సింగిల్ షిఫ్ట్ లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 557 నగరాల్లోని వివిధ కేంద్రాల్లో 24 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. విదేశాల్లోని 14 నగరాల్లో కూడా ఈ పరీక్ష (NEET UG 2024) ను నిర్వహిస్తున్నారు.