NEET UG 2023: నీట్ యూజీ 2023 మహిళల విభాగంలో టాపర్ ప్రాంజల్ అగర్వాల్
NEET UG 2023: నీట్ యూజీ 2023 ఫలితాలు జూన్ 13న వెలువడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విద్యార్థి వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన విద్యార్థి ప్రభంజన్ సంయుక్తంగా తొలి ర్యాంక్ సాధించారు.
నీట్ యూజీ 2023 ఫలితాలు జూన్ 13న వెలువడ్డాయి. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విద్యార్థి వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన విద్యార్థి ప్రభంజన్ సంయుక్తంగా తొలి ర్యాంక్ సాధించారు. కాగా, మహిళల కేటగిరీ (female category)లో నీట్ యూజీలో టాపర్ గా ప్రాంజల్ అగర్వాల్ (Pranjal Aggarwa) నిలిచారు. ఆమె 720 మార్కులకు గానూ, 715 మార్కులు సాధించారు. నీట్ యూజీలో టాప్ ర్యాంక్ సాధించిన ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విద్యార్థి వరుణ్ చక్రవర్తి, తమిళనాడుకు చెందిన విద్యార్థి ప్రభంజన్.. ఇద్దరూ 720 మార్కులకు గానూ, 720 మార్కులు సాధించారు.
పంజాబ్ నుంచి..
ప్రాంజల్ అగర్వాల్ వయస్సు 18 సంవత్సరాలు. ఆమె పంజాబ్ లోని మలేర్కోట్ల జిల్లాకు చెందిన వారు. ఆమె తండ్రి వికాస్ అగర్వాల్ వస్త్ర వ్యాపారి. తల్లి మోనిక అగర్వాల్ గృహిణి. నీట్ యూజీ 2023లో మహిళల కేటగిరీ (female category)లో ప్రాంజల్ అగర్వాల్ ది తొలి ర్యాంక్ కాగా, ఆల్ ఇండియా ర్యాంక్ ల్లో నాలుగో ర్యాంక్. సంగ్రూర్ లోని ఒక ప్రైవేటు పాఠశాలలో ప్రాంజల్ పాఠశాల విద్య పూర్తి చేశారు.
రోజుకు 12 గంటల చదువు.. కార్డియాలజిస్ట్ లక్ష్యం
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఎంబీబీఎస్ లో చేరుతానని ప్రాంజల్ అగర్వాల్ వెల్లడించారు. భవిష్యత్తులో కార్డియాలజిస్ట్ కానీ, న్యూరాలజిస్ట్ కానీ కావాలన్నది తన లక్ష్యమని ఆమె తెలిపారు. తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల శిక్షణలో, వారి స్ఫూర్తితో ఈ విజయం సాధించానని ఆమె తెలిపారు. డాక్టర్ కావాలన్నది తన స్వప్నమని, ఎంబీబీఎస్ లో అడ్మిషన్ అందించే నీట్ పరీక్ష కోసం గత రెండేళ్లుగా ప్రిపేర్ అవుతున్నానని వివరించారు. ఈ పరీక్ష కోసం రోజుకు కనీసం 12 గంటలు చదివేదాన్నని వెల్లడించారు. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోవద్దని, లక్ష్యాలను చేరుకోవడం కోసం నిరంతరం కృషి చేయాలని ఆమె తన సక్సెస్ మంత్ర ను వెల్లడించారు. నీట్ యూజీ 2023 పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది.