NEET UG 2024 grace marks: ఆ 1500 మందికి మళ్లీ పరీక్ష; నీట్ యూజీ 2024 పై కేంద్రం నిర్ణయం
NEET UG 2024 grace marks: వివాదాస్పదంగా మారిన నీట్ యూజీ 2024 పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేస్ మార్కులు పొందిన ఆ 1500లకు పైగా ఉన్న విద్యార్థులకు మళ్లీ పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వారి గ్రేస్ మార్క్ లను తొలగిస్తున్నామని వెల్లడించింది.
NEET UG 2024 grace marks: నీట్-యూజీ 2024 కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షాకేంద్రంలో సమయం వృధా కావడం వల్ల గ్రేస్ మార్కులు పొందిన 1500 లకు పైగా విద్యార్థులకు.. ఆ గ్రేస్ మార్కులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ఆ విద్యార్థులకు రెండు ఆప్షన్స్ ఇచ్చింది. అందులో ఒకటి, మళ్లీ పరీక్ష రాయడం. రెండవది, గ్రేస్ మార్కుల తొలగింపు అనంతరం, వచ్చిన మార్కులతోనే కౌన్సెలింగ్ కు హాజరుకావడం. ఈ రెండు ఆప్షన్స్ లో దేనినైనా విద్యార్థులు ఎంపిక చేసుకోవచ్చు.
గ్రేస్ మార్కులు తొలగిస్తాం..
పరీక్షాకేంద్రంలో సమయం వృధా కావడం వల్ల గ్రేస్ మార్కులు పొందిన 1500 లకు పైగా విద్యార్థులకు.. ఆ గ్రేస్ మార్కులను తొలగించాలని నిర్ణయించినట్లు కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. దాంతో, విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) గ్రేస్ మార్కులు ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియపై స్టే ఇవ్వబోమని కోర్టు తెలిపింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు తిరిగి పరీక్ష రాసే అవకాశం కల్పిస్తామని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన వెకేషన్ బెంచ్ కు కేంద్రం, ఎన్టీఏ తరఫు న్యాయవాది తెలిపారు.
జూన్ 23 న రీ టెస్ట్
నీట్ యూజీ 2024 (NEET UG 2024) లో గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థుల గ్రేస్ మార్కులను తొలగించి, వారికి తిరిగి ఈ నెల 23న రీ టెస్ట్ నిర్వహించనున్నారు. ఆ విద్యార్థుల స్కోర్ కార్డులను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు ఎన్టీఏకు అనుమతి ఇచ్చింది. మళ్లీ పరీక్షకు హాజరు కావడానికి ఇష్టపడని వారి ఒరిజినల్ స్కోర్ కార్డులను (గ్రేస్ మార్కులు లేకుండా) పరిగణనలోకి తీసుకుంటారు.
జులై 6 నుంచి కౌన్సెలింగ్
జూలై 6 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ ప్రక్రియను సులభతరం చేయడానికి జూన్ 30 లోపు రీ-టెస్ట్ ఫలితాలను ప్రకటిస్తామని ఎన్టీఏ సుప్రీంకోర్టుకు నివేదించారు. నీట్ పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్లలో ఫిజిక్స్ వాలా సీఈఓ అలఖ్ పాండే దాఖలు చేసిన పిటిషన్ కూడా ఉంది.
24 లక్షల మంది విద్యార్థుల హాజరు
మే 5న 4,750 కేంద్రాల్లో ఎన్టీఏ నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్షకు దేశ, విదేశాల్లో 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫలితాలను జూన్ 14న విడుదల చేయాలని భావించినప్పటికీ ముందుగానే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయినందున జూన్ 4న ప్రకటించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, 1,500 మందికి పైగా వైద్య అభ్యర్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వడం వంటి ఆరోపణలతో ఏడు హైకోర్టులు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
67 మంది విద్యార్థులకు టాప్ స్కోర్
ఎన్టీఏ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 67 మంది విద్యార్థులు 720 మార్కులు సాధించగా, వారిలో హర్యానాలోని ఫరీదాబాద్ లోని ఓ పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు కూడా ఉన్నారు. అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ జూన్ 10న ఢిల్లీలో పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రేస్ మార్కుల వల్ల 67 మంది విద్యార్థులు టాప్ ర్యాంక్ ను పొందారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్-యూజీ పరీక్షను ఎన్టీఏ నిర్వహిస్తుంది.