NEET UG 2024: నీట్ యూజీ ఫలితాలకు సంబంధించి విద్యార్థులకు ఎన్టీఏ సూచనలు
నీట్ యూజీ 2024 పరీక్ష ఫలితాలకు సంబంధించి గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, నీట్ యూజీ 2024 ను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చింది. పరీక్ష నిర్వహణ, మార్కుల విధానం, కంపన్సేటరీ మార్కులు తదితర అంశాలపై వారి అనుమానాలను నివృత్తి చేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET UG 2024)కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తరచుగా అడిగే ప్రశ్నల (FAQ) సెట్ ను విడుదల చేసింది. నీట్ యూజీ 2024 ఫలితాలు జూన్ 4, 2024 న విడుదలయ్యాయి. పరీక్ష నిర్వహణ, మార్కుల రివార్డులు, పరిహార మార్కులు తదితర అంశాలపై విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎఫ్ఏక్యూలను విడుదల చేశారు.
కాంపెన్సేటరీ మార్కుల లెక్కింపు
నీట్ యూజీ 2024 (NEET UG 2024) పరీక్షకు హాజరైన కొంతమంది విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో సమయం వృథా కావడంతో వారికి కంపన్సేటరీ మార్కులు ఇచ్చారు. 1563 మంది అభ్యర్థులకు ఇలా కంపన్సేటరీ మార్కులు ఇచ్చినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అయితే, అలా కంపన్సేటరీ మార్కులు ఇవ్వడం వల్లనే ఆయా పరీక్ష కేంద్రాల్లో నీట్ రాసిన విద్యార్థుల్లో చాలా మందికి టాప్ ర్యాంక్ లు వచ్చాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సహా వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులో కొన్ని రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి.
విద్యార్థుల అనుమానాలకు సమాధానాలు
ఎన్ఎంసీ అందించిన అర్హత ప్రమాణాల ఆధారంగా నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించి ఫలితాలను ప్రకటించాల్సిన బాధ్యత తమదేనని ఎన్టీఏ తెలిపింది. నేషనల్ కేటగిరీ లిస్ట్ ప్రకారం ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులకు ఆల్ ఇండియా ర్యాంక్ లను ప్రకటించారు. అలాగే, అడ్మిషన్ అథారిటీలు వారి పరిధిలోకి వచ్చే ఎంబిబిఎస్ / బిడిఎస్ మొదలైన సీట్లకు ఆల్ ఇండియా ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తాయి. అభ్యర్థులు తమ రాష్ట్రానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు, వారు స్టేట్ కేటగిరీ జాబితా ప్రకారం వారి కేటగిరీని సూచిస్తారు. దీనికి అనుగుణంగా రాష్ట్ర కౌన్సెలింగ్ అధికారులు వారి మెరిట్ జాబితాను రూపొందిస్తారు.
13 భాషల్లో నీట్ యూజీ 2024
నీట్ యూజీ 2024ను 13 భాషల్లో (అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ) నిర్వహించారు. అలాగే, ఈ పరీక్షను దేశం వెలుపల ఉన్న 14 నగరాలు అబుదాబి, దుబాయ్, బ్యాంకాక్, కొలంబో, దోహా, ఖాట్మండు, కౌలాలంపూర్, కువైట్ సిటీ, లాగోస్, మనామా, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్ సహా మొత్తం 571 నగరాల్లో నిర్వహించారు. ఈ పరీక్షకు 24 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.