Narayana Murthy: ‘పేరెంటింగ్ సలహా’తో వివాదంలో ఇన్ఫోసిస్ నారాయణమూర్తి; మండిపడ్తున్న నెటిజనులు
Narayana Murthy: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహ ఫౌండర్ గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన నారాయణ మూర్తి ఇటీవల తన సలహాలతో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. తాజాగా, పిల్లల పెంపకానికిి సంబంధించి నారాయణ మూర్తి ఇచ్చిన సలహాపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Narayana Murthy: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పిల్లల పెంపకంపై తన ఆలోచనలను పంచుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. యువత వారానికి 70 గంటలు పని చేయాలని గతంలో ఈ టెక్ బాస్ ఇచ్చిన సలహా పెద్ద వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ పేరెంటింగ్ సలహా కూడా అదే స్థాయిలో వివాదాస్పదమవుతోంది.
నారాయణమూర్తి పేరెంటింగ్ సలహా
బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్ఫోసిస్ (infosys) నారాయణమూర్తి మాట్లాడుతూ పిల్లలు చదువుకోవడానికి ఇంట్లో క్రమశిక్షణతో కూడిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుందన్నారు. ఇంట్లో పిల్లలను చదువుకోవాలని చెప్పి, తల్లిదండ్రులు మాత్రం సినిమాలు చూస్తూ కూర్చోవడం సరికాదన్నారు. ‘‘తల్లిదండ్రులు సినిమాలు చూస్తూ, పిల్లలను మాత్రం మీరు చదువుకోండి అని చెప్తే కుదరదు. అది పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’’ అని నారాయణ మూర్తి అన్నారు.
మేం అలాగే చేసేవాళ్లం
ఈ సందర్భంగా తమ పిల్లలు స్కూళ్లకు వెళ్లే వయస్సులో తాము ఎలా వారితో సమయం గడిపేవారమో నారాయణ మూర్తి వివరించారు. తను, తన భార్య సుధా మూర్తి తమ పిల్లలు అక్షత, రోహన్ లతో రోజుకు కనీసం మూడున్నర గంటలు గడిపేవారమని, వారితో పాటు తాము చదివేవాళ్లమని వివరించారు. అయితే, నారాయణ మూర్తి ఇచ్చిన ఈ పేరెంటింగ్ సలహాపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు ఇన్ఫోసిస్ మూర్తి సలహాను ప్రశంసిస్తుండగా, చాలామంది విమర్శలు కూడా చేస్తున్నారు.
వారానికి 70 గంటల పని ఎలా సాధ్యం?
‘‘మీరు సిఫారసు చేసిన విధంగా తల్లిదండ్రులు 72 గంటలు పనిచేస్తే, వారు పిల్లల కోసం ఎప్పుడు సమయం కేటాయిస్తారు?’’ అని సోషల్ మీడియా (social media) యూజర్లు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. ‘‘అవునండీ! మీరు చెప్పినట్లు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా తమ 30, 40 ఏళ్ల వయస్సులో ట్రిగనామెట్రీ, కాల్కులాస్, ఆర్గానిక్ కెమిస్ట్రీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. నారాయణమూర్తి కూడా ఈ వయసులో గో లాంగ్ నేర్చుకోవాలి. వారానికి 70 గంటల పాటు కోడ్ నేర్చుకోవాలి’’ అని మరో యూజర్ వ్యంగ్యంగా సూచించారు. ‘‘తల్లిదండ్రులు, పిల్లలు సినిమాలు చూడటం మానేసి, తక్కువ జీతంతో నైట్ షిఫ్టులో వారానికి 70 గంటలు పని చేస్తూ సపోర్ట్ టికెట్లు ఇవ్వాలి’’ అని మూడో వ్యక్తి వ్యంగ్యంగా రాశారు. ‘‘ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో చదవడానికి గంటలు గంటలు కేటాయించడం అసాధ్యం. ముఖ్యంగా చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఇంటి బాధ్యతలు, మరెన్నో చేస్తున్న నేటి ప్రపంచంలో, అందరికీ సమయం ఉండదు. ఈ ఆదర్శాన్ని ప్రతి ఒక్కరిపై రుద్దడం సరికాదు’’ అని మరో యూజర్ వివరించారు.
వారానికి 70 గంటల వర్క్
భారత వర్క్ కల్చర్ ను మెరుగుపరచడానికి యువత వారానికి 70 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని నారాయణ మూర్తి (nr narayana murthy) గతంలో వివాదాస్పద సూచన చేశారు. తాను ఉదయం 6.20 గంటలకు ఆఫీసుకు వెళ్లి రాత్రి 8.30 గంటలకు ఆఫీసు నుంచి బయటకు వచ్చేవాడినని, వారంలో ఆరు రోజులు పని చేసేవాడినని చెప్పారు. ‘‘నా 40 ఏళ్ల ప్రొఫెషనల్ లైఫ్ లో వారానికి 70 గంటలు పనిచేశాను. మాకు వారానికి ఆరు రోజులు ఉన్నప్పుడు 1994 వరకు, నేను వారానికి కనీసం 85 నుండి 90 గంటలు పనిచేసేవాడిని’’ అన్నారు.