Infosys: ఆ క్యాంపస్ కు మారితే రూ. 8 లక్షల ఇన్సెంటివ్: ఉద్యోగులకు ఇన్ఫోసిస్ ఆఫర్
Infosys offer: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. కర్నాటకలో కొత్తగా ఏర్పాటు చేసిన హుబ్బళి క్యాంపస్ లో విధులు నిర్వర్తిస్తే, ఆ ఉద్యోగులకు గరిష్టంగా రూ. 8 లక్షలు ఇన్సెంటివ్ గా ఇస్తామని ప్రకటించింది.
Infosys offer: తమ ఉద్యోగులకు ఇన్ఫోసిస్ ఒక మంచి ఆఫర్ ను ఇచ్చింది. కర్నాటకలోని హుబ్బళ్లి డెవలప్మెంట్ సెంటర్ కు బదిలీపై వెళ్లేందుకు అంగీకరించిన ఉద్యోగులకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. హుబ్బళ్లి క్యాంపస్ చుట్టుపక్కల స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది.
రాజకీయ విమర్శలు
హుబ్బళి ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ చుట్టూ స్థానికంగా ఉద్యోగాలను సృష్టించడంలో ఇన్ఫోసిస్ సంస్థ విఫలమైందని హుబ్బళి - ధార్వాడ్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ ఇటీవల పలు సందర్భాలలో విమర్శలు గుప్పించారు. ఇన్ఫోసిస్ హుబ్బళి సెంటర్ కు కేంద్రం చవకగా ఇచ్చిన 58 ఎకరాల భూమిని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ (Infosys) ఈ ఇన్సెంటివ్స్ ను ప్రకటించింది.
కారు చవకగా భూమి
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఇన్ఫోసిస్ సంస్థకు హుబ్బళిలో ఎకరాకు రూ.35 లక్షల సబ్సిడీ ధరకు 58 ఎకరాల భూమిని ప్రభుత్వం మంజూరు చేసింది. దాని వాస్తవ విలువ ఎకరాకు రూ.1.5 కోట్లు ఉంటుంది. ఇన్ఫోసిస్ స్థానికంగా ఉద్యోగాలు కల్పిస్తుందనే ఆశతో తన నియోజకవర్గంలోని చాలా మంది రైతులు తమ భూములను వదులుకున్నారని ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ పేర్కొన్నారు.
ఇన్ఫోసిస్ ప్రకటించిన తాయిలాలు ఇవే..
హుబ్బళి క్యాంపస్ కు వెళ్లేందుకు అంగీకరించినవారిలో బ్యాండ్ కేటగిరీల వారీగా ఇన్ఫోసిస్ ఇన్సెంటివ్స్ ప్రకటించింది.
- బ్యాండ్ 3 అంతకన్నా తక్కువ: రూ. 25 వేల ప్రారంభ ప్రోత్సాహకం. రెండేళ్ల పాటు ప్రతి ఆరు నెలలకు అదనంగా రూ .25,000 ప్రోత్సాహకం. మొత్తంగా 24 నెలల తర్వాత వారికి రూ.1.25 లక్షలు అందనున్నాయి.
- బ్యాండ్ 4: మొత్తంగా 24 నెలల తర్వాత వారికి రూ.2.50 లక్షలు అందుతాయి.
- బ్యాండ్ 5: మొత్తంగా 24 నెలల తర్వాత వారికి రూ. 5 లక్షలు అందుతాయి.
- బ్యాండ్ 6: మొత్తంగా 24 నెలల తర్వాత వారికి రూ. 6 లక్షలు అందుతాయి.
- బ్యాండ్ 7: మొత్తంగా 24 నెలల తర్వాత వారికి రూ. 8 లక్షలు అందుతాయి.
ఇన్ఫోసిస్ ట్రాన్స్ ఫర్ పాలసీ లక్ష్యం ఏమిటి?
ముంబై-కర్ణాటక ప్రాంతానికి చెందిన ఉద్యోగులను హుబ్బళ్లిలోని అవకాశాలను పరిగణనలోకి తీసుకోవడానికి ఆకర్షించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇది ఉద్యోగులు హుబ్బళ్ళి నుండి వారి ప్రస్తుత ప్రాజెక్టులలో పనిచేయడాన్ని కొనసాగించడానికి అనుమతిస్తుంది, తద్వారా ఫెసిలిటీ యొక్క ఆధునిక మౌలిక సదుపాయాల వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది.