Dividend income: వయస్సు 5 నెలలు.. ఇన్ఫోసిస్ డివిడెండ్ ఆదాయం రూ.4 కోట్లు.. ఎవరికో తెలుసా?
Infosys dividend: దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ గురువారం క్యూ 4 ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. క్యూ 4 ఫలితాలతో పాటు ఒక్కో ఈక్విటీ షేర్ పై రూ. 28 డివిడెండ్ ను కూడా ఇన్ఫోసిస్ ప్రకటించింది. ఒక 5 నెలల వయస్సున్న పిల్లాడు ఆ డివిడెండ్ ద్వారా 4.2 కోట్లు సంపాదించాడు.
Infosys Narayana Murthy: ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి తన ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి కి గత నెలలో 15 లక్షల ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చాడు. దాంతో ఆ చిన్నారి 5 నెలల వయస్సులోనే కోటీశ్వరుడయ్యాడు. తాజాగా, గురువారం ఇన్ఫోసిస్ (Infosys) 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం క్యూ4 ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ 4 ఫలితాలతో పాటు రూ.20 తుది డివిడెండ్, రూ.8 ప్రత్యేక డివిడెండ్ తో కలిపి మొత్తం రూ.28 డివిడెండ్ ను ప్రకటించింది. దీంతో, తన 15 లక్షల ఈక్విటీ షేర్లకు గానూ డివిడెండ్ రూపంలో ఏకాగ్రహ రోహన్ మూర్తి మరో రూ.4.2 కోట్లు ఆర్జించారు .
డివిడెండ్ కు రికార్డు డేట్..
తుది డివిడెండ్, ప్రత్యేక డివిడెండ్ చెల్లింపునకు రికార్డు డేట్ ను మే 31గా నిర్ణయించినట్లు ఇన్ఫోసిస్ వెల్లడించింది. అర్హులైన షేర్ హోల్డర్ల ఖాతాలకు జూలై 1న చెల్లింపులు జరుగుతాయని తెలిపింది. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి కంపెనీలో 15 లక్షల షేర్లు ఉన్నాయి. అవి మొత్తం ఈక్విటీ షేర్లలో 0.4%. ఈ రోజు ఇన్ఫోసిస్ షేర్ మార్కెట్ ధర సుమారు రూ.1,400 గా ఉంది. అంటే, ఏకాగ్రహ్ రోహన్ మూర్తికి ఇన్ఫోసిస్ లో ఉన్న షేర్ల విలువ సుమారు రూ.210 కోట్లు. అదనంగా, ఆయనకు రూ.4.2 కోట్ల డివిడెండ్ లభించనుంది.
ఏకాగ్రహ్ రోహన్ మూర్తి గురించి మరిన్ని వివరాలు..
ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్ ఆర్ నారాయణమూర్తి (Narayana Murthy) కుమారుడు రోహన్ మూర్తి, కోడలు అపర్ణ కృష్ణన్ కుమారుడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి. గత ఏడాది నవంబర్ 10న బెంగళూరులో జన్మించాడు. రోహన్ మూర్తి హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్ డీ చేసి సోరోకో అనే సాఫ్ట్ వేర్ సంస్థను నడుపుతున్నారు. మూర్తి మీడియాను అపర్ణ కృష్ణన్ నిర్వహిస్తున్నారు. నారాయణమూర్తి, సుధా మూర్తి దంపతులకు మూడో మనవడు ఏకాగ్రహ్ రోహన్ మూర్తి. నారాయణ మూర్తి, సుధా మూర్తి (Sudha Murthy) ల కుమార్తె అక్షత మూర్తి, యూకే ప్రధాని రిషి సునక్ (Rishi Sunak) దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వారు కృష్ణ, అనౌష్క. డిసెంబర్ త్రైమాసికం ముగిసే సమయానికి ఇన్ఫోసిస్ లో అక్షత మూర్తికి 1.05 శాతం, సుధామూర్తికి 0.93 శాతం, రోహన్ మూర్తికి 1.64 శాతం వాటా ఉంది.
టాపిక్