Infosys Q4 result: ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాలు; గత ఏడాదితో పోలిస్తే నికర లాభాల్లో 30% వృద్ధి; భారీగా డివిడెండ్ కూడా..-infosys q4 result top 5 highlights of infosys q4 earnings final dividend too ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Infosys Q4 Result: ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాలు; గత ఏడాదితో పోలిస్తే నికర లాభాల్లో 30% వృద్ధి; భారీగా డివిడెండ్ కూడా..

Infosys Q4 result: ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాలు; గత ఏడాదితో పోలిస్తే నికర లాభాల్లో 30% వృద్ధి; భారీగా డివిడెండ్ కూడా..

HT Telugu Desk HT Telugu
Apr 18, 2024 06:20 PM IST

Infosys Q4 result: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ గురువారం గత ఆర్థిక సంవత్సరం చివరి, నాలుగో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్యూ 4 లో ఇన్ఫోసిస్ ఆదాయం, అంతకుముందు సంవత్సరం క్యూ 4 తో పోలిస్తే 1.3 శాతం పెరిగి రూ.37,923 కోట్లకు చేరుకుంది.

ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాలు, రూ. 28 డివిడెండ్
ఇన్ఫోసిస్ క్యూ 4 ఫలితాలు, రూ. 28 డివిడెండ్ (PIxabay)

Infosys Q4 result: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.7,975 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఇన్ఫోసిస్ (Infosys) నికర లాభం రూ.6,134 కోట్లుగా ఉంది. అంటే, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, నికర లాభంలో ఇన్ఫోసిస్ 30 శాతం వృద్ధి నమోదు చేసింది.

ఈ క్యూ 4 లో ఇన్ఫోసిస్ ఆదాయం 1.3 శాతం పెరిగి రూ.37,923 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ (CC) పరంగా తమ ఆదాయం ఫ్లాట్ గా ఉందని, క్యూఓక్యూ 2.2 శాతం క్షీణించిందని కంపెనీ తెలిపింది. కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 20.1 శాతంగా నమోదైంది. ఇది గత సంవత్సరం క్యూ 4 తో పోలిస్తే 0.9 శాతం, క్యూ 3 తో పోలిస్తే 0.4 శాతం క్షీణించింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో తమ సామర్థ్యాలు విస్తరిస్తూనే ఉన్నాయని, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ప్రాసెస్ ఆప్టిమైజేషన్, కస్టమర్ సపోర్ట్ పై ప్రభావం చూపే పెద్ద క్లయింట్ ప్రోగ్రామ్ లపై పనిచేస్తున్నామని ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ సలీల్ పరేఖ్ తెలిపారు.

విభాగాల వారీగా ఆదాయం

విభాగాల వారీగా చూస్తే, ఇన్ఫోసిస్ లో హైటెక్, మాన్యుఫాక్చరింగ్ 9 శాతం వృద్ధిని నమోదు చేసింది. కమ్యూనికేషన్, ఎనర్జీ, యుటిలిటీస్, రిసోర్సెస్ అండ్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్ విభాగాలు కూడా క్యూ4లో వృద్ధి చెందాయి. ఆర్థిక సేవలు, రిటైల్ విభాగాల్లో క్షీణత నమోదైంది.

భౌగోళికంగా చూస్తే

భౌగోళికంగా చూస్తే ఇన్ఫోసిస్ దేశీయ మార్కెట్ ఆదాయం 16.1 శాతం క్షీణించిందని కంపెనీ తెలిపింది. ఉత్తర అమెరికా మార్కెట్ ఆదాయం 2.1 శాతం క్షీణించింది. యూరప్, ఇతర ప్రపంచ మార్కెట్లు వరుసగా 6.5 శాతం, 1.6 శాతం వృద్ధిని సాధించాయి. ఉద్యోగుల విషయానికి వస్తే ఇన్ఫోసిస్ లో గత ఏడాది కాలంలో అట్రిషన్ రేట్ తగ్గింది.

డివిడెండ్

2024 ఆర్థిక సంవత్సరానికి గాను ఇన్ఫోసిస్ కంపెనీ బోర్డు ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.20 తుది డివిడెండ్ ను ప్రకటించింది. దీంతోపాటు ఒక్కో షేరుకు రూ.8 చొప్పున ప్రత్యేక డివిడెండ్ ను కంపెనీ ప్రకటించింది. అంటే, ఒక్కో ఈక్విటీ షేర్ పై మదుపర్లకు రూ. 28 డివిడెండ్ (Infosys dividend) గా లభిస్తుంది. తుది డివిడెండ్, స్పెషల్ డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీని మే 31, 2024గా నిర్ణయించారు. అర్హులైన వాటాదారులకు డివిడెండ్ చెల్లింపు జూలై 1, 2024న జరుగుతుంది. ఇన్ఫోసిస్ సభ్యుల 43వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ నెల 26న జరగనుంది.