Sudha Murty about Infosys: దాదాపు 4 దశాబ్దాల క్రితం ఇన్ఫోసిస్ సంస్థను ప్రారంభించే సమయంలో తన భర్త ఎన్ ఆర్ నారాయణ మూర్తికి రూ. 10 వేలు అప్పుగా ఇచ్చానని సుధా మూర్తి(Sudha Murty) గుర్తు చేసుకున్నారు. తానిచ్చిన రూ. 10 వేల అప్పుతో ప్రారంభమైన సంస్థ(Infosys) ఇప్పుడు బిలియన్ డాలర్ల టెక్ దిగ్గజంగా రూపొందడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఆంగ్ల వార్తా చానెల్ ఎన్ డీ టీవీతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ఇన్ఫోసిస్ కు తానే తొలి పెట్టుబడిదారునని సుధామూర్తి(Sudha Murty) సరదాగా వ్యాఖ్యానించారు. నారాయణ మూర్తి సహా ఏడుగురు ఇంజినీర్లు ప్రారంభించిన ఇన్ఫోసిస్(Infosys) కు తాను అప్పుగా ఇచ్చిన రూ. 10 వేలే తొలి పెట్టుబడి అని Sudha Murty సరదాగా వ్యాఖ్యానించారు. ‘నా పెట్టుబడితో ప్రారంభమైన సంస్థ(Infosys) ఇప్పుడు బిలియన్ డాలర్ల సంస్థగా ఎదిగింది. అంటే, ప్రపంచంలోనే, కాదంటే కనీసం భారత్ లో నైనా నేను బెస్ట్ ఇన్వెస్టర్ ని అన్నమాట. ఫస్ట్ ఇన్వెస్టర్ ని. అలాగే బెస్ట్ ఇన్వెస్టర్ ని’ అని ఆమె నవ్వుతూ వ్యాఖ్యానించారు. తానిచ్చిన రూ. 10 వేలు ఇప్పుడిలా బిలియన్ డాలర్లుగా మారుతాయని తాను అస్సలు ఊహించలేదన్నారు.
ఈ సందర్భంగా యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సుధామూర్తి విలువైన సలహాలు, సూచనలను ఇచ్చారు. ఒక కంపెనీని ప్రారంభించి, విజయవంతం చేయాలంటే ముందుగా చాలా ఓపిక ఉండాలని ఆమె సూచించారు. ఇన్ఫోసిస్(Infosys) ను ప్రారంభించగానే లాభాలు రాలేదని, 7,8 సంవత్సరాలు కష్టపడ్డారని గుర్తు చేశారు. ‘ఒక్క రోజులో ఏమీ జరగదు. రోమ్ నగరాన్ని ఒక్క రోజులో నిర్మించలేదు అంటారు చూడండి. అలాగే. ఒక సక్సెస్ ఫుల్ కంపెనీని నిర్మించాలంటూ చాలా కష్టపడాలి. అన్నిటి కన్నా ముఖ్యంగా చాలా ఓపికగా ఉండాలి’ అని Sudha Murty వివరించారు. ‘‘డబ్బు వెంట పరిగెడితే.. మీ నుంచి డబ్బు పారిపోతుంది. మంచి ఉద్దేశంతో కష్టపడితే విజయం మీ వెంట వస్తుంది’’ అని విలువైన సలహాను ఇచ్చారు.
బ్రిటన్ ప్రధానిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తమ అల్లుడు రుషి సునక్ గురించి Sudha Murty మాట్లాడుతూ.. రుషి సునక్ సక్సెస్ పట్ల తాను సంతోషంగా ఉన్నానన్నారు. తమ మధ్య రాజకీయ సంభాషణలు జరగవని వెల్లడించారు. బ్రిటన్ లో రుషి సునక్ రాజకీయ పురోగతిని పరిశీలిస్తుంటారా? అన్న ప్రశ్నకు.. ‘నేను నా దేశం పురోగతి గురించి ఆలోచిస్తాను. తాను తన దేశం గురించి ఆలోచిస్తాడు’ అని సమాధానమిచ్చారు.
ఇన్ఫోసిస్ ను నారాయణ మూర్తి, నందన్ నీలేకని, ఎస్ గోపాల కృష్ణన్, ఎస్డీ శిబూలాల్, కే దినేశ్ సహా ఏడుగురు ఇంజినీర్లు 1981లో బెంగళూరులో ప్రారంభించారు. ఇప్పటికీ ఈ సంస్థ ప్రధాన కార్యాలయం బెంగళూరులోనే ఉంది. ప్రస్తుతం ఇన్ఫోసిస్(Infosys) మార్కెట్ విలువ 17.53 బిలియన్ డాలర్లు.