Sudha Murty: రాజ్యసభకు ‘ఇన్ఫోసిస్’ సుధా మూర్తి; నామినేట్ చేసిన రాష్ట్రపతి
Sudha Murty: ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య, రచయిత్రి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజ్యసభకు నామినేట్ చేశారు. నారాయణ మూర్తి భార్య గానే కాకుండా, సుధా మూర్తి రచయిత్రిగా, మోటివేషనల్ స్పీకర్ గా, సోషల్ యాక్టివిస్ట్ గా ప్రఖ్యాతి గాంచారు.
రచయిత్రి సుధామూర్తి (Sudha Murty) ని రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ప్రకటించారు. సుధామూర్తిని అభినందించిన ప్రధాని మోదీ వివిధ రంగాలకు ఆమె చేసిన కృషి ఎనలేనిదని, స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
ప్రధాని శుభాకాంక్షలు
రాజ్యసభకు నామినేట్ అయిన సుధామూర్తి కి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘రాష్ట్రపతి @SmtSudhaMurtyJi ని రాజ్యసభకు నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా వివిధ రంగాలకు సుధామూర్తి గారు చేసిన కృషి ఎనలేనిది, స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ఉనికి మన 'నారీ శక్తి'కి బలమైన నిదర్శనం, మన దేశ భవితవ్యాన్ని రూపొందించడంలో మహిళల శక్తి సామర్థ్యాలకు నిదర్శనం. ఆమెకు ఫలవంతమైన పార్లమెంట్ పదవీకాలం ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ప్రధాని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు.
వివిధ రంగాల్లో సేవలు
సుధా మూర్తి (Sudha Murty) భారతీయ విద్యావేత్త, రచయిత్రి, దాత, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్ పర్సన్. గేట్స్ ఫౌండేషన్ కు చెందిన పబ్లిక్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్స్ లో సభ్యురాలు. సుధామూర్తి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాను స్థాపించారు. 2006 లో సుధా మూర్తికి భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ లభించింది. తరువాత 2023 లో, ఆమెకు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించింది. 'డాలర్ బహు' నవలను సుధామూర్తి మొదట కన్నడంలో రచించారు. ఆ తర్వాత ఆంగ్లంలోకి కూడా అనువదించారు. ఈ నవల 2001లో జీ టీవీలో ధారావాహికగా ప్రసారం అయింది. 'రూనా' అనే ప్రఖ్యాత కథను కూడా ఆమె రాశారు. ఆ కథను మరాఠీలో సినిమాగా కూడా తీశారు.
సుధామూర్తి కుటుంబం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని సుధామూర్తి (Sudha Murty) వివాహం చేసుకున్నారు - వీరికి ఇద్దరు పిల్లలు. వారు అక్షత మరియు రోహన్. అక్షత మూర్తి యూకే ప్రధాని రిషి సునక్ (Rishi Sunak) ను వివాహం చేసుకున్నారు.