India-China : బ్రిక్స్ సమ్మిట్‌కు ముందు ఎల్ఏసీ‌ పెట్రోలింగ్‌పై భారత్, చైనా ఒప్పందం-india china lac patrolling new agreement before brics summit ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India-china : బ్రిక్స్ సమ్మిట్‌కు ముందు ఎల్ఏసీ‌ పెట్రోలింగ్‌పై భారత్, చైనా ఒప్పందం

India-China : బ్రిక్స్ సమ్మిట్‌కు ముందు ఎల్ఏసీ‌ పెట్రోలింగ్‌పై భారత్, చైనా ఒప్పందం

Anand Sai HT Telugu
Oct 21, 2024 07:43 PM IST

India-China : లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఏసీ)పై పెట్రోలింగ్‌కు సంబంధించి భారత్-చైనా మధ్య కొత్త ఒప్పందం కుదిరింది. అక్టోబర్ 22-23 తేదీల్లో జరగనున్న 16వ బ్రిక్స్ సదస్సు కోసం ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు ముందు ఈ ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది.

విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ

తూర్పు లడఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్(ఎల్‌ఏసీ) వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై భారతదేశం, చైనాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ హాజరయ్యే బ్రిక్స్‌ సదస్సుకు ముందు ఈ ఒప్పందం కుదిరింది.

బ్రిక్స్ సదస్సు కోసం ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ముందు ప్రత్యేక మీడియా సమావేశంలో ప్రసంగించారు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ. చైనా మధ్యవర్తులతో చర్చల ఫలితంగా వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక ఒప్పందం కుదిరిందని చెప్పారు.

'ఇప్పుడు గత కొన్ని వారాలుగా జరిగిన చర్చల ఫలితంగా భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతాల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒక ఒప్పందం కుదిరింది. 2020లో ఈ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలకు పరిష్కారం దిశగా వెళ్తుంది. బ్రిక్స్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలపై ఇంకా సమాచారం అందుబాటులో లేనప్పటికీ, పెట్రోలింగ్ ఏర్పాట్లపై ఒప్పందం భారత్-చైనా మధ్య సమావేశానికి మార్గం సుగమం చేస్తుంది.' అని విక్రమ్ మిస్రీ చెప్పారు.

జూలై 2024లో రెండు దేశాల విదేశాంగ మంత్రుల సమావేశాలు అందించిన మార్గదర్శకానికి అనుగుణంగా ముందుకు వెళ్తున్నట్టుగా విదేశాంగ శాఖ చెప్పింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి ఉన్న పరిస్థితిపై విభేదాలను తగ్గించడానికి, సమస్యలకు ముందస్తు పరిష్కారాన్ని కనుగొనడానికి అంగీకరించారని ఒక ప్రకటనలో తెలిపింది. ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌లు, రెండు దేశాల మధ్య కుదిరిన అవగాహనలకు అనుగుణంగా సరిహద్దు ప్రాంతాలలో శాంతి కొనసాగించాలని ఇరుపక్షాలు నిర్ణయించుకున్నట్టుగా విదేశాంగ శాఖ పేర్కొంది

తూర్పు లడఖ్ సరిహద్దులో 2020లో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 20 మంది సైనికులు మరణించారు. చైనా సైనికులు కూడా మృతి చెందారు. ఆ తర్వాత రెండు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

మరోవైపు రష్యా అధ్యక్షతన కజాన్‌లో జరుగుతున్న 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్టోబర్ 22, 23 తేదీల్లో రష్యాలో పర్యటించనున్నారు. దానికి ముందు ఈ ఒప్పందం జరిగింది. దీంతో ఇరు దేశాల నేతలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును మెుదలుపెట్టాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో బ్రిక్స్‌గా మార్చారు. తర్వాత ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌది అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా చేరాయి. ఈ గ్రూపులో మెుత్తం పది దేశాలు ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు తదితర అంశాలపై ఇందులో చర్చిస్తారు.

Whats_app_banner