వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ చేసిన సిఫార్సులకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ‘‘మన ప్రజాస్వామ్యాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు ఇది ముఖ్యమైన అడుగు" అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రయత్నానికి నాయకత్వం వహించినందుకు, విస్తృత శ్రేణి భాగస్వాములను సంప్రదించినందుకు కోవింద్ ను అభినందించారు. లోక్ సభ ఎన్నికల ప్రకటనకు ముందు కోవింద్ నేతృత్వంలోని కమిటీ మార్చిలో నివేదిక సమర్పించింది.
ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రణాళికను రెండు దశల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మొదటి దశ: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలి.
రెండో దశ: సార్వత్రిక ఎన్నికలు జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు (పంచాయతీ, మున్సిపాలిటీలు) నిర్వహించాలి.
- రాష్ట్ర ఎన్నికల అధికారుల సమన్వయంతో భారత ఎన్నికల సంఘం (election commission of india) రూపొందించిన ఓటరు గుర్తింపు కార్డులతో అన్ని ఎన్నికలకు ఉమ్మడి ఓటరు జాబితాను ఉపయోగిస్తారు.
- ఇందుకోసం దేశవ్యాప్తంగా సమగ్ర చర్చలను ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది.
మొదటి దశలో లోక్ సభకు, రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని రామ్ నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. రెండో దశలో మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలను నిర్వహిస్తారు. లోక్ సభ, రాష్ట్ర శాసనసభల ఎన్నికలు జరిగిన వంద రోజుల్లోనే మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు జరిగేలా సభ, రాష్ట్ర శాసనసభలతో సమన్వయం చేస్తారు.
టాపిక్