NPS మెచ్యూరిటీ కాలపరిమితిని పొడగించుకోవడం మంచిదేనా? నిపుణుల సలహా!-nps maturity period extension ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Nps మెచ్యూరిటీ కాలపరిమితిని పొడగించుకోవడం మంచిదేనా? నిపుణుల సలహా!

NPS మెచ్యూరిటీ కాలపరిమితిని పొడగించుకోవడం మంచిదేనా? నిపుణుల సలహా!

Manda Vikas HT Telugu
Mar 01, 2022 09:24 AM IST

NPSలో సభ్యులుగా ఉన్న దాదాపు 80 శాతానికి పైగా చందాదారులు మెచ్యూరిటీ దాటిన తర్వాత కూడా పొదుపు మార్గాన్నే ఎంచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా పెన్షన్‌ తీసుకోవడమో లేదా జమ అయిన మొత్తం నిధిలో (NPS కార్పస్‌) కొంత భాగం ఉపసంహరించుకోవడమో చేయడం లేదు.

<p>NPS&nbsp;</p>
NPS (iStock)

జాతీయ పెన్షన్ పథకం (National Pension Scheme- NPS)ను 2004లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ తర్వాత కూడా పౌరులకు ఆర్థిక భద్రత కల్పించే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని తీసుకువచ్చారు. ఇది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఎఫ్‌ఆర్‌డిఎ) నియంత్రణలో పనిచేస్తుంది. తొలుత ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ఈ పథకంలో సభ్యులుగా చేరే అవకాశం ఉండగా, ప్రస్తుతం 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయ పౌరుడు సభ్యులుగా చేరే అవకాశాన్ని కల్పించారు.

ఈ పథకం ద్వారా ఇన్‌కమ్ టాక్స్ ప్రయోజనాలు ఉండటం, రాబడి కూడా బాగానే ఉండటంతో చాలా మంది ఉద్యోగులు ఈ పథకానికి ఆకర్షితులవుతున్నారు. 

అయితే NPSలో సభ్యులుగా ఉన్న దాదాపు 80 శాతానికి పైగా చందాదారులు మెచ్యూరిటీ దాటిన తర్వాత కూడా పొదుపు మార్గాన్నే ఎంచుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా పెన్షన్‌ తీసుకోవడమో లేదా జమ అయిన మొత్తం నిధిలో (NPS కార్పస్‌) కొంత భాగం ఉపసంహరించుకోవడమో చేయడం లేదు. బదులుగా మరికొంత కాలం పాటు తమకు వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని జమచేసుకోడానే మొగ్గు చూపుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత NPS నుంచి వచ్చే నెలవారీ పెన్షన్ సరిపోవడం లేదని ఇందుకు కారణంగా చూపుతున్నారు. వారి నెలవారీ పెన్షన్ మొత్తాన్ని మరింత పెంచుకోవడానికి పొదుపే మార్గం అని చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు 75 సంవత్సరాల వయస్సు వరకు పెట్టుబడులు పెట్టడానికి NPS అనుమతిస్తుంది. మరి రిటైర్మెంట్ వయసు దాటిన తర్వాత కూడా ఇలా పెట్టుబడులు పెట్టడం మంచిదేనా? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

కాలపరిమితి పెంచడం కోసం ఈ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి

NPS నిబంధనల ప్రకారం NPS చందాదారులు ఎవరైనా మెచ్యూరిటీ దాటిన తర్వాత తమ ఖాతాలో నుంచి 60 శాతం నగదును ఉపసంహరించుకోవచ్చు. నెలవారీగా పెన్షన్ రూపంలో పొందాలంటే అందుకోసం ఖాతాలో కచ్చితంగా 40 శాతం వరకు నిల్వలు ఉండాలి. 

రిటైర్మెంట్ తర్వాత తక్షణ ఆర్థిక అవసరాలు లేనివారు కాలపరిమితిని పొడగించుకోవడం మంచిదేనని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న తక్కువ వడ్డీ రేట్ల కారణంగా వార్షిక రాబడి కూడా తక్కువగానే ఉంటుంది. రాబోయే సంవత్సరాలలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. మెరుగైన వడ్డీ రేట్లు ఉన్నప్పుడు నిధులు ఉపసంహరించుకుంటే రాబడి పెరుగుతుందనేది నిపుణుల అభిప్రాయం.

NPSలో ఎన్ని సంవత్సరాలుగా చందాదారులుగా ఉన్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు 2004 నుంచే సబ్‌స్క్రయిబ్ చేసుకోగా, 5 సంవత్సరాలు ఆలస్యంగా 2009 నుంచి మాత్రమే ప్రైవేట్ రంగంలోని వారికి NPSలో సభ్యులుగా చేరే అవకాశం వచ్చింది. తక్కువ కాలం పాటు చందదారులుగా ఉంటే పొదుపు కూడా తక్కువగానే ఉంటుంది. అలాంటపుడు పెన్షన్ కూడా తక్కువగానే వస్తుంది. సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఆన్యుటీ రేట్ల ఆధారంగా రూ. 25 లక్షల కార్పస్ కలిగినవారు నెలవారీగా సుమారు 17 వేల పెన్షన్ పొందుతున్నారు. అలాగే రూ.5 లక్షల కార్పస్‌ కలిగిన చందాదారు ప్రస్తుతం ఉన్న ఆన్యుటీ రేటు 6.31% ప్రకారం గరిష్టంగా రూ. 2,616 నెలవారీ పెన్షన్‌గా పొందుతారు. మరి ఈ లెక్క ప్రకారం మీ పొదుపు ఎంతవరకు ఉందో లెక్కేసుకోండి.

ఒకసారి NPSలో సభ్యుడిగా చేరిన ప్రైవేట్ సెక్టారుకు చెందిన వ్యక్తి కనీసం 10 ఏళ్ల పాటు చందాదారుడిగా కొనసాగాలి. అయితే 60 ఏళ్లు దాటిన తర్వాత NPS చందాదారులు 75 ఏళ్లలోపు ఎప్పుడైనా ఈ పథకం నుండి బయటకు వచ్చేయవచ్చు. కాబట్టి కాలపరిమితి పొడగించుకున్నా.. ఎలాంటి సమస్య ఉండదు.

NPS చందాదారులుగా ఉంటే రూ. 50,000 వరకు, సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు అదనపు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేసుకునే వీలుంది.

వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని.. టాక్స్ ప్రయోజనాలు కోరుకునే వారు, నెలవారీ పెన్షన్ ఎక్కువ పొందాలనుకునే వారు, రాబడి ఎక్కువ పొందాలనుకునేవారు, తక్షణ ఆర్థిక అవసరాలు లేనివారు కాలపరిమితి పెంచుకోవడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు.

Whats_app_banner