జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. భారీ భద్రత మధ్య మొదటి దశ పోలింగ్-jammu and kashmir assembly election 2024 phase 1 polling for 24 seats know 10 facts here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. భారీ భద్రత మధ్య మొదటి దశ పోలింగ్

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. భారీ భద్రత మధ్య మొదటి దశ పోలింగ్

Anand Sai HT Telugu
Sep 18, 2024 11:12 AM IST

Jammu and Kashmir Assembly Election 2024 : దశాబ్దం తర్వాత మొదటిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మెుదటి దశ పోలింగ్ మెుదలైంది.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు

జమ్మూ కాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు మెుదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకారం జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాల్లో 8 స్థానాలకు, కాశ్మీర్ లోయలోని నాలుగు జిల్లాల్లో 16 స్థానాలకు మెుదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు 90 మంది స్వతంత్రులతో సహా 219 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు. 23 లక్షల మంది ఓటర్లు భవితవ్యాన్ని నిర్ణయిస్తారు.

కేంద్ర సాయుధ పారామిలిటరీ బలగాలు (CAPF), జమ్మూ కాశ్మీర్ సాయుధ పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులతో కూడిన భారీ భద్రతా ఏర్పాట్లను ప్రభుత్వం అమలు చేసింది.

ఆగస్టు 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో జరుగుతున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇది. 3,276 పోలింగ్ స్టేషన్‌లలో ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఎన్నికల సంఘం 14,000 మంది పోలింగ్ సిబ్బందిని మోహరించింది.

ఫేజ్ 1లో 18 నుండి 19 సంవత్సరాల వయస్సు గల 1.23 లక్షల మంది యువకులు, 28,309 మంది దివ్యాంగులు, 85 ఏళ్లు పైబడిన 15,774 మంది వృద్ధ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అర్హులు.

మొదటి దశలో పోటీ చేస్తున్న వారిలో కాశ్మీర్ ప్రాంతం నుండి ప్రముఖ అభ్యర్థులలో పీడీపీకి చెందిన ఇల్తిజా ముఫ్తీ, సీపీఐ(ఎం) మొహమ్మద్ యూసుఫ్ తరిగామి, కాంగ్రెస్ నుండి గులాం అహ్మద్ మీర్ ఉన్నారు.

ఎన్‌సీ, కాంగ్రెస్ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ బనిహాల్, భదర్వా, దోడాలో వేర్వేరు అభ్యర్థులను నిలబెట్టాయి. ఎన్‌సీ తిరుగుబాటు నాయకుడు ప్యారే లాల్ శర్మ ఇందర్వాల్‌లో స్వతంత్రంగా పోటీ చేయగా, బీజేపీ తిరుగుబాటుదారులు రాకేష్ గోస్వామి, సూరజ్ సింగ్ పరిహార్ రాంబన్ మరియు పద్దర్-నాగ్సేని నుండి పోటీ చేస్తున్నారు.

జమ్మూ ప్రాంతంలో మాజీ మంత్రులు సజ్జాద్ కిచ్లూ (ఎన్‌సీ), వికార్ రసూల్ వానీ (కాంగ్రెస్), సునీల్ శర్మ (బీజేపీ), గులాం మహ్మద్ సరూరి (స్వతంత్ర) కీలక అభ్యర్థులుగా ఉన్నారు.

302 అర్బన్, 2,974 గ్రామీణ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ప్రిసైడింగ్ అధికారితో సహా నలుగురు ఎన్నికల అధికారులు ఉన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో మొదటి దశ ఎన్నికలకు 35,000 మంది కాశ్మీరీ పండిట్లు ఓటు వేయనున్నారు. తొంభైలలో కాశ్మీర్ నుండి జమ్మూ, ఉదంపూర్‌లకు మారిన వ్యక్తులు ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలుగా ఓట్లు వేయడానికి పేపర్‌వర్క్‌ను సులభతరం చేసినట్లు ఈసీఐ తెలిపింది.

మెహబూబా ముఫ్తీని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందిగా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)తో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన పొత్తును 2018 జూన్‌లో తెంచుకుంది. అప్పటి నుండి జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేదు.

జమ్మూ కాశ్మీర్‌లోని మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 74 జనరల్‌కు, తొమ్మిది షెడ్యూల్డ్ తెగలకు, ఏడు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వు అయ్యాయి.

సెప్టెంబర్ 25న రెండో విడత ఎన్నికలు జరుగుతాయి. అక్టోబర్ 1న మూడో విడత పోలింగ్‌తో ఎన్నికలు ముగుస్తాయి. ఎలత్రన్ రిజల్ట్ అక్టోబర్ 8న వెల్లడిస్తారు.