CM Chandrababu: రెండున్నరేళ్ల తర్వాత శాసనసభకు చంద్రబాబు, నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…
CM Chandrababu: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రెండున్నరేళ్ల తర్వాత శాసనసభలో అడుగుపెడుతున్నారు. నిండుసభలో దారుణ అవమానంతో కౌరవ సభ నుంచి నిష్క్రమిస్తున్నానని మళ్లీ గౌరవ సభలో అడుగుపెడతానంటూ చేసిన సవాలును నిలబెట్టుకున్నారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబునాయుడు సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత ఏపీ అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. 2021 నవంబర్ 19న నిండు సభలో సవాలు చేసి సభ నుంచి నిష్క్రమించిన చంద్రబాబు ఎన్నికల్లో ఘన విజయం సాధించి తిరిగి శాసన సభలోకి అడుగుపెట్టారు. అసెంబ్లీలో ప్రత్యర్థులు చేసిన రాజకీయ విమర్శలతో కలత చెంది సభను విడిచిపెట్టారు. శాసనసభలో వ్యక్తిగత దూషణలు, హేళనలు, వ్యక్తిత్వ హననం, కుటుంబ సభ్యులపై నిందలు, విమర్శలతో నలిగిపోయిన చంద్రబాబు అసెంబ్లీలో అడుగుపెట్టనని శపథం చేశారు.
శాసనసభను కౌరవ సభగా మార్చేశారని, మళ్లీ గౌరవ సభలోనే అడుగుపెడతానని నాడు సభలో సవాలు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున 23మంది సభ్యులు గెలిచిన తర్వాత శాసనసభలో తెలుగుదేశం పార్టీని టార్గెట్‌గా చేసుకుని సభా కార్యక్రమాలు నడిపారనే విమర్శలు ఉన్నాయి.
శాసనసభలో టీడీపీ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని మాట్లాడే వారికి ఎక్కువగా అవకాశం ఇవ్వడానికి ప్రాధాన్యమిచ్చేవారు. ప్రభుత్వ పాలనపై విమర్శలు చేస్తే వ్యక్తిగత విమర్శలతో దాడి చేసేవారు. ఈ క్రమంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడును అధికార పార్టీ నేతలు అవమానించడంతో మనస్తాపం చెందిన చంద్రబాబు సభలో అడుగుపెట్టనని సవాలు చేశారు.
2024 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని స్థాయిలో సీట్లను కట్టబెట్టారు. నాటి అధికార పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించలేదు.
నేడు సిఎం హోదాలో గౌరవంగా శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టనున్నారు. మళ్లీ సిఎంగానే సభకు వస్తాను అని 2021 నవంబర్ 19న సభలో శపథం చేసిన చంద్రబాబు అన్న ప్రకారమే మూడేళ్లుగా సభకు దూరంగా ఉన్నారు.
వైసీపీ నాయకులు చంద్రబాబు కుటుంబ సభ్యులపై దారుణ వ్యాఖ్యలు చేయడంతో సభనుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత చంద్రబాబు ఆవేదనతో మాట్లాడిన మాటల్ని కూడా వైసీపీ నేతలు హేళన చేశారు.ఇది శాసన సభ కాదు....ఇది కౌరవ సభ...తిరిగి గౌరవ సభగానే వస్తాను అంటూ నాడు బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు 4 సారి ముఖ్యమంత్రిగా సగర్వంగా సభలో అడుగుపెట్టనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో 163ఎమ్మెల్యేలతో కలిసి శాసన సభలోకి చంద్రబాబు అడుగుపెట్టనున్నారు.
నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు…
ఏపీ శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదట ప్రొటెం స్పీకర్ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేస్తారు.
ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇప్పటికే ఆయన గవర్నర్ సమక్షంలో ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుస క్రమంలో మిగిలిన సభ్యులను పిలు స్తారు. మాజీ సిఎం జగన్ కూడా సాధారణ సభ్యులతో పాటే ప్రమాణం చేస్తారు.
సందర్శకులకు నో ఎంట్రీ….
కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్బంగా సందర్శకులకు ప్రవేశాన్ని నిషేధించారు. స్థలాభావంతో పాటు భద్రతా కారణాలతో ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో పాటు ఇతరులు ఎవరిని సభా ప్రాంగణంలోకి అనుమతించరు. ప్రస్తుత సమావేశాలకు విజిటింగ్ పాస్ సదుపాయాన్ని రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు.