DigiYatra Services : ప్రాంతీయ భాషల్లోనూ డిజియాత్ర సేవలు.. సామాన్యుడికి కనెక్ట్ అయ్యేలా ప్రణాళికలు
DigiYatra Services : విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశం సులభతరం చేసేందుకు మెుదలుపెట్టిన డిజియాత్ర స్థానిక, అంతర్జాతీయ భాషల్లోనూ రానుంది. ప్రస్తుతం డిజియాత్ర 24 విమానాశ్రయాల్లో అందుబాటులో ఉంది.
విమానాశ్రయాల్లో ప్రయాణికుల ప్రవేశం సులభతరం చేసేందుకు డిజియాత్రను గతంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ(FTR) ఆధారంగా దీనిని రూపొందించారు. అయితే ఇప్పుడు ప్రజలకు మరింత చేరువయ్యేలా డిజియాత్ర సేవలు స్థానిక, అంతర్జాతీయ భాషల్లో రానుంది.
దేశంలోని సీనియర్ సిటిజన్లు, గ్రామీణ ప్రజలకు చేరువ కావాలనే లక్ష్యంతో డిజియాత్ర త్వరలో అన్ని ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వస్తుందని డిజియాత్ర ఫౌండేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సురేష్ ఖడక్‌భావి తెలిపారు.
'సామాన్యుడిని చేరుకోవాలంటే.. ఆ సామాన్యుడితో స్వంత భాషలో కనెక్ట్ అవ్వాలి. దీనిపై మేం కృషి చేస్తున్నాం. డిజియాత్ర అన్ని భారతీయ భాషలలో అందుబాటులో ఉండనుంది. అంతర్జాతీయ భాషలను కూడా ప్లాన్ చేస్తున్నాం.' అని సురేశ్ చెప్పారు.
డిజియాత్ర అనేది ఎయిర్‌పోర్ట్ చెక్‌పోస్టుల వద్ద సులభతరమైన ప్రవేశం అందించడానికి ప్రయత్నిస్తున్న ఒక సదుపాయం. ప్రస్తుతం 24 విమానాశ్రయాలలో అందుబాటులో ఉంది. రానున్న నెలల్లో మరో నాలుగు విమానాశ్రయాల్లో దీన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. విదేశీ పౌరులకు కూడా ఈ సదుపాయాన్ని ప్రవేశపెడతామని, వచ్చే ఏడాది దీని ట్రయల్ రన్ ప్రారంభమవుతుందని సురేశ్ చెప్పారు.
'డిజియాత్రతో రెండు దేశాలను కలిపే పైలట్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జూన్ నుండి ప్రారంభం కానుంది. దీని కింద విదేశీ పౌరులు కూడా విమానాశ్రయాల్లో ప్రవేశం ఈజీగా ఉంటుంది. వారు కూడా డిజియాత్రను ఉపయోగించుకోగలరు.' అని సురేశ్ తెలిపారు.
డిజియాత్ర అనేది ప్రస్తుతం దేశీయ ప్రయాణికులకు విమానాశ్రయాలలో ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (FRT) ఆధారిత చెక్-ఇన్ సేవను అందిస్తోంది. దీనిని డిసెంబరు 2022లో మాజీ పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు.
హోం మంత్రి అమిత్ షా ఈ ఏడాది జూన్‌లో ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3లో ప్రత్యేక కౌంటర్లను ఆవిష్కరించారు. దీని ద్వారా ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ - ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రామ్ (FTI-TTP)ని ప్రారంభించారు.