DigiYatra : డిజియాత్ర అంటే ఏంటి.. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో స్టార్ట్ ఎప్పుడు?
టెక్నాలజీ పెరుగుతోంది. అంతా పేపర్ లేస్. ఏం చేయాలన్నా.. డిజిటల్ గానే. ఈ పద్ధతే విమానాశ్రయాల్లోకి వస్తోంది. కేవలం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ప్యాసింజర్ ప్రాసెసింగ్ చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
రోజురోజుకు సాంకేతికత అప్ డేట్ అవుతూ ఉంటుంది. కొత్త కొత్త మార్పులు మనల్ని కాస్త ఆశ్చర్యపరస్తూ ఉంటాయి. పని సులువు కావాలంటే వాటిని ఫాల్ అయిపోవాల్సిందే. తాజాగా విమానాశ్రయాల్లోనూ ఓ కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. అదే DigiYatra పాలసీ. హైదరాబాద్ లో ఈ నెల 18వ తేదీ నుంచి బీటా వర్షన్ స్టార్ట్ అవుతుంది. సుమారు 3 నెలలు దీనిని పరిశీలిస్తారు. దీనికోసం చేయాల్సిందల్లా.. మీరు DigiYatra యాప్ ని డౌన్ లోడ్ చేసుకోవడమే. పేపర్ లేస్ గా మీ ప్రయాణానికి సంబంధించిన ప్రాసెస్ జరిగిపోతుంది. ఎలా దీనిని వాడాలో తెలుసుకోవాలా?
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్ట్ 18 నుంచి మూడు నెలల పాటు డిజియాత్ర ప్లాట్‌ఫారమ్ ను తీసుకురానుంది. దీని ఆధారంగా ప్రయాణికుల జర్నీకి సంబంధించి ప్రాసెసింగ్ చేస్తారు. ఈ మేరకు GMR ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కొత్త డిజిటల్ పద్ధతి ప్రకారమే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో డిజియాత్ర కార్యక్రమానికి అనుగుణంగా అమలు చేస్తారు. ఇది పేపర్‌లెస్ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. విమానాశ్రయంలో ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు. తనిఖీలు ఎక్కువ ప్రదేశాల్లో లేకుండా సమయాన్ని ఆదా చేస్తుంది. ఇకపై డిజియాత్ర యాప్ ద్వారా విమానాశ్రయంలోని చెక్‌పోస్టుల వద్ద టిక్కెట్లు/బోర్డింగ్ పాస్‌లు, గుర్తింపు కార్డులను చూపించాల్సిన అవసరం లేదు.
డిజియాత్ర యాప్‌కు బోర్డింగ్ పాస్‌ను లింక్ చేయడం వలన.. విమానాశ్రయంలోకి ప్రవేశించడంతోపాటు ఎయిర్‌పోర్ట్‌లోని పలు చెకింగ్స్ జరిగిపోతాయి. ఎయిర్‌క్రాఫ్ట్ బోర్డింగ్ కూడా ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పేపర్‌లెస్, కాంటాక్ట్‌లెస్‌గా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది.
ప్రయాణికులు DigiYatra మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. DY-ID యాప్/ఎయిర్‌లైన్ లేదా OTA యాప్/ఎయిర్‌పోర్ట్ యాప్‌ని తెరవాలి. ఆధార్/డ్రైవింగ్ లైసెన్స్ (DL) నంబర్‌ను నమోదు చేయండి. ప్రయాణికుల నమోదిత మొబైల్ లేదా ఇమెయిల్‌కు OTP వస్తుంది. అది యాప్‌లో నమోదు చేయండి. DigiYatra యాప్ ఆధార్/DL డేటాబేస్ నుంచి e-KYC డేటాను తీసుకుంటుంది. పాస్‌పోర్ట్ మొదటి పేజీని స్కాన్ చేయండి. డిజియాత్ర యాప్.. ఆధార్ ఇ-కెవైసి/డీఎల్ డేటా/ఇ-పాస్‌పోర్ట్ నుండి రిఫరెన్స్ ఫేస్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది.
ప్రయాణికులు తమ బోర్డింగ్ పాస్ క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్‌తో స్కాన్ చేయాలి. ఈ ప్రాసెస్ పూర్తయిన తర్వాత విమానాశ్రయంలోకి ప్రవేశించాలి. ప్రయాణికుడు బోర్డింగ్ పాస్‌ను స్కాన్ చేసినప్పుడు లేదా టిక్కెట్‌ను అప్‌లోడ్ చేసినప్పుడు యాప్ ద్వారా ప్రయాణ డేటా వెళ్తుంది. Digiyatra యాప్ ప్రయాణం చేసే రోజున విమానాశ్రయం, ఎయిర్‌లైన్, ఇమ్మిగ్రేషన్ (అంతర్జాతీయ ప్రయాణం విషయంలో) కోసం ముందే క్యాప్చర్ చేసిన ప్రయాణికుల ముఖం, బుకింగ్ సమాచారాన్ని పంచుకుంటుంది.
ఎయిర్ పోర్ట్ లో ఏం జరుగుతుంది?
ఈ-గేట్ వద్ద తమ బోర్డింగ్ పాస్‌లను స్కాన్ చేయాలి. అక్కడ ఏర్పాటు చేసిన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాను చూడటం ద్వారా మీ సమాచారం అంతా చెక్ అయిపోతుంది. ఇతర చెక్‌పోస్టుల్లోకి ప్రవేశించేందుకు కూడా ఇదే పద్ధతి వర్తిస్తుంది. అయితే 'డిజియాత్ర' యాప్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఐవోఎస్ లో కూడా అందుబాటులోకి తీసుకువస్తారు.
డిజియాత్ర ప్రయోజనం
డిజిటల్ విధానాన్ని ఉపయోగించి విమానాశ్రయంలో సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. వ్యక్తుల ద్వారా చెకింగ్స్ చేసే ప్రదేశాలు ఉండవు. రద్దీ తగ్గే అవకాశం ఉంది. వెంటవెంటనే ప్యాసింజర్స్ వెళ్లొచ్చు. విమానాల సమయంతో కనెక్ట్ అయి ఉండటం, విమానంలో సేవలు, పలు ఆఫర్‌లను డిజిటల్‌గా బుక్ చేసుకోవచ్చు.