G20 Summit budget: జీ 20 సదస్సు ఖర్చు రూ. 4100 కోట్లా?.. ప్రధాని మోదీ సొంత ప్రచారానికే బడ్జెట్ పెంచారంటున్న విపక్షాలు-did modi govt spend 300 percent more than what was budgeted for g20 summit centre responds to oppositions allegations ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  G20 Summit Budget: జీ 20 సదస్సు ఖర్చు రూ. 4100 కోట్లా?.. ప్రధాని మోదీ సొంత ప్రచారానికే బడ్జెట్ పెంచారంటున్న విపక్షాలు

G20 Summit budget: జీ 20 సదస్సు ఖర్చు రూ. 4100 కోట్లా?.. ప్రధాని మోదీ సొంత ప్రచారానికే బడ్జెట్ పెంచారంటున్న విపక్షాలు

HT Telugu Desk HT Telugu
Sep 12, 2023 02:32 PM IST

G20 Summit budget: అధ్యక్ష హోదాలో భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ 20 సదస్సు (G20 Summit) సెప్టెంబర్ 10 న విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు, ఈ సదస్సు నిర్వహణకు ప్రభుత్వం చేసిన వ్యయం (G20 Summit expenditure) పై వివాదం ప్రారంభమైంది.

ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (ANI Photo/Ishant)

G20 Summit budget: సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ 20 సదస్సు (G20 Summit) జరిగింది. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, సౌదీ, టర్కీ తదితర ప్రపంచ దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సదస్సు నిర్వహణను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఖర్చుకు వెనకాడకుండా, భారీ వ్యయంతో, సదస్సును విజయవంతం చేసింది.

yearly horoscope entry point

బడ్జెట్ ఎంత?

G20 సదస్సు కోసం రూ. 990 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయి రూ. 4,100 కోట్లకు చేరింది. భారత్ లాంటి దేశం ఒక సదస్సు కోసం ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అనవసరం అన్న వాదన ప్రారంభమైంది. ముఖ్యంగా జీ 20 సదస్సు పేరుతో ప్రధాని నరేంద్ర మోడీ సొంత ప్రచారానికి ఈ మొత్తాన్ని వాడుకున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ప్రధాని నరేంద్ర మోడీ ఇమేజ్ ని పెంచడానికి రానున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల ముందస్తు ప్రచారం కోసం ఈ మొత్తాన్ని ఉపయోగించారని ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే ఈ ఆరోపణ చేశారు. ముందుగా నిర్ధారించిన రూ. 990 కోట్లు కాకుండా, జీ 20 సదస్సు నిర్వహణ వ్యయం రూ. 4100 కోట్లు కావడం దారుణమని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ సొంత ప్రచారానికి ఆ మొత్తాన్ని వినియోగించారని, అందువల్ల ముందు నిర్ధారించిన రూ. 990 కోట్లను మినహాయించి మిగతా రూ. 3110 కోట్లను బిజెపి నుంచి వసూలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రధాని ప్రచారం కోసమే..

జీ 20 సదస్సు పేరుతో ప్రధాని మోదీ వ్యక్తిగత ప్రచారానికి, ఆయన పోస్టర్లకు ప్రభుత్వ నిధులను ఉపయోగించారని కాంగ్రెస్ ఆరోపించింది. విదేశీ అతిథులకు ఖరీదైన బంగారు, వెండి పాత్రల్లో ఆహారం సర్వ్ చేసి, అనవరస ఆర్భాటాలతో ఖర్చు చేశారన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోన పేదలను, మురికి వాడలను విదేశీ అతిథులకు కనిపించకుండా చర్యలు తీసుకుని, భారతదేశ వాస్తవిక ముఖచిత్రాన్ని వారికి కనిపించకుండా చేశారని విపక్షాలు ఆరోపించాయి. జీ 20 సదస్సుకు చేసిన ఖర్చు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని ఆరోపించాయి.

అది మౌలిక వసతుల కోసం చేసిన ఖర్చు

అయితే, ఈ ఆరోపణలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ టీం ఖండించింది. జీ 20 సదస్సుకు అంచనాకు మించి ఖర్చు చేశారన్న ఆరోపణలను కొట్టివేసింది. కేవలం సదస్సు నిర్వహణకే కాకుండా మౌలిక వసతుల కల్పనకు కూడా ఆ మొత్తాన్ని వినియోగించారని వివరించింది. ఆ మౌలిక వసతులు భవిష్యత్తులో కూడా ఉపయోగపడతాయని పిఐబి తెలిపింది. సదస్సు ముగిసిన రోజు ఢిల్లీలో భారీ వర్షం పడడంతో, సదస్సు జరిగిన భారత్ మండపం వర్షపు నీటిలో మునిగిపోయిందన్న వార్తలను కూడా పీఐబీ ఫాక్ట్ చెకింగ్ టీమ్ ఖండించింది. కొన్ని ప్రదేశాల్లో నీరు నిలిచింది కానీ, విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా నీట మునిగిన పరిస్థితి లేదని వివరించింది.

Whats_app_banner