G20 summit live updates : దిల్లీలో ముగిసిన జీ20 సదస్సు..
- G20 summit live updates : దిల్లీలో జీ20 సదస్సు రెండో రోజుకు చేరుకుంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ హెచ్‌టీ తెలుగు లైవ్ పేజ్ని ఫాలో అవ్వండి..
Sun, 10 Sep 202308:36 AM IST
ప్రధాని మోదీ వ్యాఖ్యలు..
"'ఒక భూమి- ఒక కుటుంబం'లో భాగంగా.. నిన్న మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాము. ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తును సాకారం చేసుకునేందుకు ఈ జీ20 సదస్సు ఒక వేదికగా మారడం నాకు సంతోషంగా, సంతృప్తికరంగా ఉంది. నవంబర్ చివరిలో జీ20 వర్చ్యువల్ సమావేశాన్ని నిర్వహించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ రెండు రోజుల్లో జరిగిన చర్చలను అప్పుడు రివ్యూ చేద్దాము. ఇందుకు సంబంధించిన వివరాలను మా బృందం మీతో పంచుకుంటుంది. మీరందరు ఈ వర్చ్యువల్ సమావేశానికి హాజరవుతారని ఆశిస్తున్నాను. ఈ మాటలతో.. 2023 జీ20 సదస్సుకు ముగింపు పలుకుతున్నాను," అని ప్రధాని మోదీ వెల్లడించారు. అనంతరం ప్రపంచ శాంతి కోసం ఓ సంస్కృత శ్లోకాన్ని చదివారు.
Sun, 10 Sep 202308:12 AM IST
ముగిసిన జీ20 సదస్సు..
దేశ రాజధాని దిల్లీలో జీ20 సదస్సు ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ.. గావెల్‌ను బ్రెజిల్ అద్యక్షుడు లులా ద శిల్వ చేతికి అప్పగించారు. వచ్చే ఏడాది జీ20 సదస్సు బ్రెజిల్లో జరగనుంది.
Sun, 10 Sep 202306:43 AM IST
బిజీబిజీగా ప్రధాని మోదీ..
జీ20 సదస్సు నేపథ్యంలో గత కొన్ని రోజులుగా బిజీగా ఉంటున్నారు ప్రధాని మోదీ. ఆదివారం కూడా అనేక మంది దేశాధినేతలతో కీలక చర్చలు జరపనున్నారు.
Sun, 10 Sep 202306:11 AM IST
వాతావరణ మార్పులపై చర్చ..
జీ20 సదస్సులో భాగంగా మరికొద్ది సేపట్లో.. దేశాధినేతలు వాతావరణ మార్పులపై చర్చించనున్నారు.
Sun, 10 Sep 202305:49 AM IST
దిల్లీలో భారీ వర్షం..
ఓవైపు జీ20 సదస్సు జరుగుతుంటే.. మరోవైపు దిల్లీలో భారీ వర్షం కురుస్తోంది. అనేక రోడ్లు నీట మునిగాయి. ఈరోజు కూడా వర్షం పడుతుందని వాతావరణశాఖ వెల్లడించింది.
Sun, 10 Sep 202305:22 AM IST
వియత్నంకు జో బైడెన్..
జీ20 సదస్సులో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. వియత్నంకు బయలుదేరారు.
Sun, 10 Sep 202304:38 AM IST
అక్షరధామ్ ఆలయానికి రిషి సునక్..
బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఆయన సతీమణని అక్షతా మూర్తి.. ఆదివారం ఉదయం దిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు.
Sun, 10 Sep 202304:11 AM IST
మహాత్మా గాంధీకి నివాళి..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా వివిధ దేశాధినేతలు రాజ్‌ఘాట్‌కు చేరుకున్నారు. మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు.
Sun, 10 Sep 202303:49 AM IST
రాజ్‌ఘాట్‌కు దేశాధినేతలు..
జీ20 సదస్సు రెండో రోజుకు చేరుకుంది. దేశాధినేతలు ఒక్కొక్కరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకుంటున్నారు. కొద్ది సేపట్లో, వారందరు మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు.
Sat, 09 Sep 202303:19 PM IST
మహాత్ముడికి నివాళి అర్పించనున్న దేశాధినేతలు
జీ 20 సదస్సులో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాధినేతలు ఆదివారం ఉదయం మహాత్ముడి సమాధి అయిన రాజ్ ఘాట్ ను సందర్శించి, మహాత్మా గాంధీకి నివాళులర్పించనున్నారు.
Sat, 09 Sep 202303:18 PM IST
అక్షర ధామ్ ఆలయాన్ని సందర్శించనున్న రుషి సునక్
బ్రిటన్ ప్రధాని రుషి సునక్ తన భార్య అక్షత మూర్తితో కలిసి ఆదివారం ఉదయం ఢిల్లీలోని అక్షర ధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. తాను హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతానని గతంలో రుషి సునక్ వ్యాఖ్యానించారు.
Sat, 09 Sep 202303:14 PM IST
బ్రిటన్ తో ‘ద్వైపాక్షికం’ బలోపేతం
ద్వైపాక్షిక సంబంధాలను, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, బ్రిటన్ లు నిర్ణయించాయి. జీ 20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీ, బ్రిటన్ పీఎం రిషి సునక్ లు ప్రత్యేకంగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
Sat, 09 Sep 202311:25 AM IST
న్యూఢిల్లీ డిక్లరేషన్ కు ఏకగ్రీవ ఆమోదం
జీ 20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విడుదల చేసే జాయింట్ డిక్లరేషన్ కు సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ లోని మొత్తం 83 పేరాలను ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా ఆమోదించాయి. అంతకుముందు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన పేరాపై కొన్ని అభ్యంతరాలు రాగా, ఆ పేరాలో భారత్ పలు మార్పులు చేసింది.
Sat, 09 Sep 202309:48 AM IST
‘అతిథుల ముందు వాస్తవాలను దాచాల్సిన అవసరం లేదు’: రాహుల్ గాంధీ
జీ 20 సదస్సు సందర్భంగా ఢిల్లీలోని పేదలు, మురికి వాడలను విదేశీ అతిథులకు కనిపించకుండా దాచేయాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశ వాస్తవ పరిస్థితిని అతిథులకు చూపడంలో తప్పు లేదన్నారు. చివరకు వీధి కుక్కలపై కూడా క్రూరంగా ప్రవర్తిస్తున్నారని, వాటి మెడ పట్టుకుని లాక్కెళ్లి, గదుల్లో బంధిస్తున్నారని విమర్శించారు. వాటికి కనీసం తిండి కూడా పెట్టడం లేదన్నారు.
Sat, 09 Sep 202309:35 AM IST
నియంతృత్వ దేశాల్లోనే అలా..
జీ 20 సదస్సు అతిథుల కోసం శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన విందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గేను ఆహ్వానించకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, ప్రతిపక్షం లేని నియంతృత్వ దేశాల్లో అలా జరుగుతుందన్నారు. కానీ భారత్ ఇంకా ఆ స్థాయికి చేరలేదని వ్యాఖ్యానించారు.
Sat, 09 Sep 202308:00 AM IST
‘రష్యా - ఉక్రెయిన్ యుద్ధం’ పై జీ 20 లో ప్రతిష్టంభన
రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి జీ20 సభ్య దేశాల మధ్య బేధాభిప్రాయాలు నెలకొన్నాయి. జీ 20 డిక్లరేషన్ లో.. ఉక్రెయిన్ పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించాలని అమెరికా, పలు యూరోప్ దేశాలు కోరుతుండగా, 2022 ఇండోనేషియా సదస్సు డిక్లరేషన్ తరహాలోనే ఈ 2023 ఢిల్లీ డిక్లరేషన్ కూడా ఉండాలని మరికొన్ని దేశాలు కోరుతున్నాయి.
Sat, 09 Sep 202307:53 AM IST
జీ 20 ఎజెండాలో ఇవే కీలకం
వాతావరణ మార్పు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడం, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కు ప్రోత్సాహం, అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు, మహిళా సాధికారత.. ఈ అంశాలు జీ 20 సదస్సు ఎజెండాలో ప్రధానంగా ఉన్నాయి.
Sat, 09 Sep 202307:01 AM IST
సెషన్ 1 మొదలు..
జీ20 సదస్సు సెషన్ 1 మొదలైంది. ప్రధాని మోదీతో పాటు దేశాధినేతలు వివిధ అంశాలపై చర్చలు జరుపుతున్నారు.
Sat, 09 Sep 202306:43 AM IST
దిల్లీకి నితీశ్ కుమార్, స్టాలిన్
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏర్పాటు చేసిన జీ20 డిన్నర్లో పాల్గొనేందుకు.. దిల్లీకి బయలుదేరారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార.్
Sat, 09 Sep 202306:03 AM IST
జీ20లో 'భారత్' పేరు..!
జీ20 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేమ్‌ప్లేట్‌పై 'భారత్' అని ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అక్కడ ఇండియా అని ఉండాలి. ఇండియా పేరును భారత్‌కు మార్చాలని కేంద్రం యోచిస్తోందన్న ఊహాగానాలకు తాజా పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.
Sat, 09 Sep 202306:00 AM IST
మోదీ వ్యాఖ్యలు
"ప్రపంచంలో విశ్వాసం అనే అంశంలో లోటు కనిపిస్తోంది. ఈ లోటును తొలగించి, నమ్మకాన్ని పెంచాలి. ప్రపంచం మంచి కోసం మనం అందరం కలిసి నడవాలి. 'సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్' మంత్రంతో అందరం ముందుకు వెళ్లాలి. తూర్పు-పడమర, ఉత్తరం-దక్షిణం మధ్య ఉన్న విభేదాలైనా, ఆహారం, ఇంధనం, ఉగ్రవాదం, సైబర్ సెక్యూరిటీ, ఆరోగ్యం, ఎనర్జీ.. ఇలా ఏదైనా.. భావి తరాల కోసం మనం మన సమస్యలను పరిష్కరించుకోవాలి," అని మోదీ అన్నారు.
Sat, 09 Sep 202305:44 AM IST
ఆఫ్రికెన్ యూనియన్‌కు సభ్యత్వం..
2023 జీ20 సదస్సులో కీలక ఘట్టం. ఆఫ్రికెన్ యూనియన్‌కు శాశ్వత సభ్యత్వం లభించింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడికి స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.
Sat, 09 Sep 202305:32 AM IST
జీ20 సదస్సు ప్రారంభం..
దిల్లీ వేదికగా జీ20 సదస్సు ప్రారంభమైంది. ప్రపంచ దేశాల్లో కొరవడిన నమ్మకాన్ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ.
Sat, 09 Sep 202304:56 AM IST
భారత మండపం వద్దకు జో బైడెన్..
జీ20 సదస్సులో పాల్గొనేందుకు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత మండపడం వద్దకు చేరుకున్నారు. ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు.
Sat, 09 Sep 202304:45 AM IST
అతిథులకు మోదీ స్వాగతం..
దేశాధినేతలు ఒక్కొకరుగా వేదిక వద్దకు చేరుకుంటున్నారు. వారందరికి ప్రధాని మోదీ స్వాగతం పలుకుతున్నారు.
Sat, 09 Sep 202304:17 AM IST
డబ్ల్యూటీఓ, ఐఎంఎఫ్ అధికారులు..
డబ్ల్యూటీఓ చీఫ్ టెడ్రోస్, ఐఎంఎఫ్ ఎంజీ క్రిస్టలీనా, బంగ్లాదేశ్ ప్రధాని హసీనాలు జీ20 సదస్సు వేదికకు చేరుకున్నారు.
Sat, 09 Sep 202304:08 AM IST
199లో ఏర్పడిన జీ20..
1999లో వచ్చిన ఆర్థిక సంక్షోభంతో ఆసియా దేశాలు విలవిలలాడిపోయాయి. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు లేదా నివారించేందుకు.. వివిధ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్‌లు ఒక్క చోట చేరి సమాలోచనలు చేసేందుకు ఏర్పాటు చేసిందే ఈ జీ20.
Sat, 09 Sep 202304:04 AM IST
సభ్య దేశాలు ఇవే..
ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియల్, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, టర్కీ, యూకే, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అంటే.. 85శాతం ప్రపంచ జీడీపీ, 75శాతం గ్లోబల్ ట్రేడ్, మూడింట రెండో వంతు ప్రపంచ జనాభాకు ఈ జీ20 సదస్సు ప్రాతినిథ్యం వహిస్తుంది.
Sat, 09 Sep 202304:04 AM IST
జీ20 సదస్సు అంటే ఏంటి?
జీ20 అంటే 'గ్రూప్ ఆఫ్ 20'. ఇందులో 19 దేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ కలిసి ఉంటుంది. 1999లో ఈ జీ20ని స్థాపించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపరిచే విధంగా ప్రణాళికలు రచించేందుకు ఇది వేదికగా మారింది.
Sat, 09 Sep 202304:03 AM IST
దేశాధినేతలు..
దిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే అనేక మంది దేశాధినేతలు దిల్లీకి చేరుకున్నారు. ఇంకొందరు దిల్లీలో శనివారం ఉదయం అడుగుపెట్టారు.
Sat, 09 Sep 202304:02 AM IST
జీ20 సదస్సు వేదికకు మోదీ..
జీ20 సదస్సు వేదిక అయిన ప్రగతి మైదాన్‌లోని భారత మండపం వద్దకు ప్రధాని మోదీ చేరుకున్నారు. విదేశాంగమంత్రి జైశంకర్.. మోదీకి స్వాగతం పలికారు.