Cloudburst In Kedarnath : కేదార్‌నాథ్‌లో క్లౌడ్ బరస్ట్.. మందాకిని నదిలో భారీ వరద.. భయంలో ప్రజలు-cloudburst in kedarnath and tehri several pilgrims stranded and fear of major damage ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cloudburst In Kedarnath : కేదార్‌నాథ్‌లో క్లౌడ్ బరస్ట్.. మందాకిని నదిలో భారీ వరద.. భయంలో ప్రజలు

Cloudburst In Kedarnath : కేదార్‌నాథ్‌లో క్లౌడ్ బరస్ట్.. మందాకిని నదిలో భారీ వరద.. భయంలో ప్రజలు

Anand Sai HT Telugu

Cloudburst In Kedarnath : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేదార్‌నాథ్ ప్రాంతంలో మేఘాలు కమ్ముకున్నాయి. మందాకిని నది నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది.

కేదార్‌నాథ్‌లో క్లౌడ్ బరస్ట్

ఉత్తరాఖండ్‌లో భారీ వానలు కురుస్తున్నాయి. కేదార్‌నాథ్‌లో క్లౌడ్ బరస్ట్ అయినట్టుగా కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజలు భయంలో బతుకుతున్నారు. భారీ వర్షంతో గౌరీకుండ్ సమీపంలోని మందాకిని నదిలో అకస్మాత్తుగా నీటిమట్టం పెరిగింది. కేదార్‌నాథ్-సోన్‌ప్రయాగ్-గౌరీ కుండ్ మార్గంలో భారీ వరదలు సంభవించాయి. ముందుజాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లోని మార్కెట్లు, హోటళ్లను అధికారులు ఖాళీ చేయించారు. నదిలోని నీరు సోన్‌ప్రయాగ్ పార్కింగ్ ప్రాంతానికి చేరుకోవడంతో యాత్రికుల్లో గందరగోళం నెలకొంది. నదిలో నీటిమట్టం పెరగడంతో భక్తుల్లో భయాందోళన నెలకొంది. ఈ సమాచారం తరువాత SDRF సంఘటనా స్థలానికి వెళ్లింది.

విరిగిపడ్డ కొండచరియలు

కేదార్‌నాథ్ మార్గంలో భారీ బండరాయి రావడంతో రైలింగ్, రోడ్డు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ప్రస్తుతం ప్రయాణికులను సురక్షిత ప్రదేశాల్లో నిలిపివేశారు. పోలీసులు, SDRF బృందం సహాయక చర్యల్లో ఉన్నాయి. కేదార్‌నాథ్‌లో భారీ వర్షం కురుస్తోందని విశాఖ పోలీసు సూపరింటెండెంట్ అశోక్ భదానే తెలిపారు. భీంబాలి-జంగల్‌చట్టి మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. విద్యుత్, కనెక్టివిటీ లేకపోవడంతో పూర్తి సమాచారం అందడం లేదు. 250 మంది ప్రయాణికులను భీంబాలి వద్ద నిలిపివేశారు. కాగా ప్రయాణ మార్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురు అవుతున్నాయి. కేదార్‌నాథ్, యమునోత్రి నడక మార్గాల్లో భారీ వర్షాల కారణంగా యాత్రను నిలిపివేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభినవ్ కుమార్ తెలిపారు. ప్రయాణికులను సురక్షిత ప్రదేశాల్లో ఉంచారు. మరోవైపు, సుర్కంద సమీపంలో కూడా మేఘాలు కమ్ముకున్నాయి.

సహాయక చర్యలు

ఉత్తరాఖండ్‌లో గత కొన్ని గంటలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఇప్పటికే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లను అప్రమత్తం చేశారు. కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే యాత్రికులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

గౌరీకుండ్-కేదార్‌నాథ్ మార్గంలో క్లౌడ్ బరస్ట్‌తో పరిస్థితి మరింత దిగజారింది. వరద పరిస్థితుల కారణంగా రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ యాత్రను నిలిపివేశారు. మందాకిని నది ఒడ్డున ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి, వారి భద్రతను నిర్ధారించడానికి SDRF సిబ్బంది ఉంది. గౌరీకుండ్‌లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

కొట్టుకుపోయిన హోటల్

టెహ్రీలోని భిలంగానా బ్లాక్‌లోని నౌతాడ్ టోక్‌లో ఒక హోటల్ కొట్టుకుపోయింది. హోటల్ కొట్టుకుపోవడంతో హోటల్ యజమాని భాను ప్రసాద్, అతని భార్య నీలం దేవి, వారి కుమారుడు విపిన్ కనిపించకుండా పోయారని జిల్లా విపత్తు నిర్వహణ అధికారి బ్రిజేష్ భట్ తెలిపారు. ఘటనాస్థలికి 100 మీటర్ల దూరంలో భాను, నీలం మృతదేహాలు లభ్యమైనప్పటికీ విపిన్‌ ఆచూకీ లభించలేదు. చార్ధామ్ యాత్రలో ఉన్న దాదాపు 200 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. వారిని తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇల్లు కూలి ఇద్దరు చిన్నారులు మృతి

మరో సంఘటనలో భారీ వర్షాల కారణంగా రూర్కీ సమీపంలోని భరత్‌పూర్ గ్రామంలో ఒక ఇల్లు కూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 11 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ ఘటనలో 10, 8 ఏళ్ల ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఎమర్జెన్సీ సర్వీస్‌లు, స్థానిక గ్రామస్తులు చిక్కుకున్న వారిని రక్షించేందుకు కృషి చేశారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

మరోవైపు భారత వాతావరణ శాఖ ఐఐఎండీ ఉత్తరాఖండ్‌లోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది.

క్లౌడ్ బరస్ట్ అంటే.. సుమారు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల పరిధిలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే క్లౌడ్ బరస్ట్ అంటారు అని ఐఎండీ పేర్కొంది. ఇలా వర్షాలు పడటం వలన వరదలు సంభవిస్తాయి.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.