Wayanad landslides: వాయనాడ్ లో ఊహకందని విషాదం; నదిలో తేలుతున్న మృతదేహాలు-kerala bodies float bridge destroyed as 3 massive landslides strike wayanad ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Wayanad Landslides: వాయనాడ్ లో ఊహకందని విషాదం; నదిలో తేలుతున్న మృతదేహాలు

Wayanad landslides: వాయనాడ్ లో ఊహకందని విషాదం; నదిలో తేలుతున్న మృతదేహాలు

HT Telugu Desk HT Telugu

కేరళలోని వాయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన విషాదంలో మృతుల సంఖ్య గంటగంటకీ పెరుగుతోంది. ఇరువాజింజి నదిలో మృతదేహాలు కొట్టుకుపోతున్నాయి. మరోవైపు, వర్షం, ప్రతికూల భౌగోళిక పరిస్థితుల కారణంగా సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.

వాయనాడ్ లో నదిలో తేలుతున్న మృతదేహాలు (AP)

ఎడతెగకుండా కురుస్తున్న భారీ వర్షానికి మంగళవారం తెల్లవారుజామున వయనాడ్ లో వరుసగా మూడు భారీ కొండచరియలు విరిగిపడిన విషాదంలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. శిధిలాల కింద సహాయ చర్యలు కొనసాగుతున్న పరిస్థితుల్లో, మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.

భారీగా ప్రాణ నష్టం

మంగళవారం తెల్లవారు జామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య మూడు భారీ కొండచరియలు కింద ఉన్న జనావాసాలపై పడ్డాయి. దాంతో, నిద్రలోఉన్న వందలాది మంది ఆ శిధిలాల కింద కూరుకుపోయారు. చూరల్మాల గ్రామంలోని చాలా ప్రాంతాలు కొట్టుకుపోయి రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. కొండచరియలు విరిగిపడటంతో జరిగిన ప్రాణ నష్టాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక దళం, పోలీసులు తెలిపారు.

జాడ తెలియని ఉత్తరాది కార్మికులు

తెల్లవారు జామున 2 గంటల నుంచి 6 గంటల మధ్య ఈ ప్రాంతంలో మూడు కొండచరియలు విరిగిపడగా, దుకాణాలు, వాహనాలతో సహా చౌరల్మాల పట్టణంలోని ఒక భాగమంతా ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో ప్రధానంగా స్థానిక తేయాకు, యాలకుల తోటల్లో పని చేయడానికి యూపీ, బిహార్, మధ్య ప్రదేశ్ ల నుంచి వచ్చిన కార్మికులు ఉంటారు. అలాంటి దాదాపు 600 మంది వివరాలు తెలియరావడం లేదని స్థానిక అధికారులు తెలిపారు. వారి మొబైల్ నంబర్లు కనెక్ట్ కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

100 మందికి పైగా

ఈ విపత్తులో మంగళవారం సాయంత్రం వరకు 106 మృతదేహాలను వెలికి తీశామని సహాయ బృందాలు తెలిపాయి. వర్షంతో పాటు భౌగోళిక ప్రతికూలత కారణంగా సహాయ చర్యలు వేగంగా సాగడం లేదని తెలిపారు. అయితే, కొండచరియల శిధిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయి ఉండవచ్చని చెప్పారు. కొండచరియలు (land slides) విరిగిపడటంతో చూరల్మల గ్రామంలో 200కు పైగా ఇళ్లు కొట్టుకుపోయాయని స్థానికులు చెబుతున్నారు.

నదిలో మృతదేహాలు

ఇదిలావుండగా, ఇరువాజింజి నదిపై వంతెన కూలిపోవడం ముండక్కైలో సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది, ఎందుకంటే ఇది చౌరల్మాల మరియు ముండక్కై గ్రామాలను కలిపే ఏకైక వంతెన. మరోవైపు, ఆ నదిలో పెద్ద సంఖ్యలో మృతదేహాలు కొట్టుకుపోతూ కనిపించాయని స్థానికులు తెలిపారు. నదిలో పలు మృతదేహాలు కొట్టుకువచ్చాయని దిగువన ఉన్న ఆదివాసీ ప్రజలు తెలిపారు. మెప్పాడి కొండచరియలు విరిగిపడటంతో చాలియార్ నది నీటిమట్టం ప్రమాద స్థాయిని దాటింది.

ముమ్మరంగా సహాయ చర్యలు

రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. వెల్లింగ్టన్, కూనూర్ నుండి భారత ఆర్మీ బృందం వయనాడ్ కు వెళ్లింది. కాగా, గత 24 గంటల్లో పశ్చిమ కనుమల వెంబడి అనేక ప్రాంతాల్లో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ కేరళ ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.వాయనాడ్ కు అన్ని విధాలా సహాయం చేయాలని కేంద్ర మంత్రులతో మాట్లాడతానని వాయనాడ్ మాజీ లోక్ సభ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన కేరళలో 2018లో సంభవించిన భారీ వరదల్లో దాదాపు 400 మంది చనిపోయారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.