NDA, INDIA meetings: ప్రభుత్వ ఏర్పాటుపై నేడు ఢిల్లీలో రెండు కూటముల కీలక భేటీలు
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. స్వల్ప మెజారిటీతో అధికార ఎన్డీయే గట్టెక్కింది. విపక్ష ఇండియా కూటమి 234 స్థానాలతో మంచి ఫలితాలను సాధించింది. ఈ నేపథ్యంలో ఈ రెండు కూటములు వేర్వేరుగా దేశ రాజధానిలో బుధవారం రెండు కీలక సమావేశాలను నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు వ్యూహంపై చర్చించనున్నాయి.
NDA, INDIA meetings: లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు ఎన్డీయే, ఇండియా కూటమి నేతలు వేర్వేరుగా ఢిల్లీలో కీలక సమావేశాలను నిర్వహిస్తున్నారు. బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించని కారణంగా, ప్రభుత్వ ఏర్పాటులో, పాలనలో ఎన్డీయే మిత్రపక్షాలపై పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా బిహార్ సీఎ నితీశ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన చంద్రబాబునాయుడుల మద్ధతు ఎన్డీయే ప్రభుత్వానికిి చాలా అవసరం. ఈ నేపథ్యంలో, బీజేపీ మిత్రపక్షాల్లో కొన్నింటిని తమవైపు లాక్కోగలిగితే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చనే ఆశలు ఇండియా కూటమి నేతల్లో చిగురించాయి.
మిత్రపక్షాలే ఆధారం
లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లు మాత్రమే గెలుచుకుంది. 2014, 2019 ఎన్నికల ఫలితాలను మించి బీజేపీ ఘనవిజయం సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. ఊహించని పరిణామంతో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు కోసం మిత్రపక్షాలైన నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు, ఏక్ నాథ్ షిండేలపై ఆధారపడాల్సి వస్తోంది. వారి డిమాండ్లకు తలొగ్గాల్సిన పరిస్థితి నెలకొన్నది. టీడీపీ, జేడీయూ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రామ్ విలాస్) వరుసగా 16, 12, 7, 5 స్థానాల్లో విజయం సాధించాయి. తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.
ఢిల్లీకి ఎన్డీయే ముఖ్య నేతలు
ఎన్డీయే మిత్ర పక్షాల సమావేశం బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో జరగనుంది. ఈ భేటీలో పాల్గొనడానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఎన్డీయే నుంచి వైదొలగే ఆలోచన లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు ప్రధాని మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘థాంక్యూ @narendramodi గారూ! లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనకు అద్భుతమైన తీర్పు ఇచ్చారు’’ అని ఆయన ఎక్స్ లో రాశారు. ఎన్డీయేలో ఇటీవల చేరిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా నేడు ఢిల్లీ వెళ్తున్నారు. రాజకీయంగా కూటములను మార్చడంలో ఆయన సిద్ధహస్తుడనే పేరుంది.
ఇండియా కూటమి భేటీ
మరోవైపు, లోక్ సభ ఎన్నికల్లో అనూహ్యంగా అద్బుత ఫలితాలను సాధించిన ఇండియా కూటమి సమావేశం కూడా బుధవారం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సమావేశానికి ఇండియా కూటమిలోని కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, సమాజ్ వాదీ పార్టీ, ఎన్సీపీ, ఆర్జేడీ తదితర పార్టీల నేతలు హాజరవుతున్నారు. రాజకీయంగా తదుపరి కార్యాచరణపై వారు చర్చించనున్నారు. ముఖ్యంగా, ఎన్డీయే లోని కొన్న పార్టీలను తమ కూటమిలోకి ఆకర్షించి, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గల అవకాశాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై వారు చర్చించనున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు ఇండియా కూటమి సమావేశం జరగనుంది.