Left loses grip: అస్తిత్వ సంక్షోభంలో వామపక్షాలు; బెంగాల్, త్రిపురల తరువాత కేరళలోనూ వెలసిపోతున్న ఎర్ర జెండా
Left parties loses grip: ఒకప్పుడు భారత దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వామపక్షాలు కాలక్రమేణా, దేశవ్యాప్తంగా కనుమరుగు అవుతున్నాయి. దశాబ్దాల పాటు పాలించిన రాష్ట్రాల్లోనూ నామమాత్ర ఉనికితో కొనసాగుతున్నాయి. ఇప్పుడు వాటి ప్రభావం మరింత క్షీణించినట్లు 2024 లోక్ సభ ఎన్నికలు నిర్ధారించాయి.
ప్రస్తుతం వామ పక్షాలు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. మారుతున్న ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, తమ మార్గాన్ని మార్చుకోలేక క్రమంగా కనుమరుగు అవుతున్నాయి. దశాబ్దాలుగా పశ్చిమబెంగాల్, త్రిపురలను పాలించిన వామపక్షాలు 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లో ఒక్క లోక్ సభ సీటును కూడా దక్కించుకోలేక పోయాయి.
కేరళలో సింగిల్ సీటు
కేరళలో వామపక్షాలే అధికారంలో ఉన్నాయి. అయినప్పటికీ 2024 లోక్ సభ ఎన్నికల్లో ఈ రాష్ట్రం నుంచి కేవలం ఒక్క సీటును మాత్రమే సీపీఎం గెల్చుకోగలిగింది. సిపిఐ (ఎం) అభ్యర్థి కె రాధాకృష్ణన్ 20,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్, మాజీ రాష్ట్ర ఆరోగ్య మంత్రి కెకె శైలజ వంటి అనేక మంది హైప్రొఫైల్ అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. ఏదేమైనా, లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు కేరళలో సుమారు 32% ఓట్లను నమోదు చేయడం గమనార్హం. ఇది భారతీయ జనతా పార్టీ సాధించిన 16.7% ఓట్ల శాతం కన్నా దాదాపు రెట్టింపు. కేరళలో కాంగ్రెస్ 35% ఓట్లను సాధించింది.
పశ్చిమ బెంగాల్ లో..
2019 లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో సీపీఎం 6.33 శాతం ఓట్లు సాధించింది. కానీ, 2024 లోక్ సభ ఎన్నికల నాటికి, ఒకప్పుడు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన ఈ పార్టీకి లభించిన ఓట్ల శాతం 5 కు పడిపోయింది. పశ్చిమ బెంగాల్లోని 42 లోక్ సభ స్థానాల్లో పలు చోట్ల సీపీఎం మూడో స్థానంలో నిలిచింది. ఈ సారి ఎన్నికల్లో విద్యార్థి నాయకులను బరిలోకి దింపాలన్న వ్యూహం మొదటి తరం ఓటర్లను ఆకట్టుకోలేకపోయింది.
త్రిపురలో..
మరోవైపు, తమకు కంచుకోటగా ఉన్న త్రిపురలోనూ వామ పక్షాల ప్రభ మసకబారింది. రాష్ట్రంలో అధికారాన్ని బీజేపీకి కోల్పోయింది. అంతేకాదు, 2024 లోక్ సభ ఎన్నికల్లో, రాష్ట్రంలో ఉన్న రెండు లోక్ సభ స్థానాలను బీజేపీ గెల్చుకుంది. పశ్చిమ త్రిపుర నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బిప్లబ్ కుమార్ దేబ్ కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ కుమార్ సాహాను ఓడించగా, తూర్పు త్రిపుర నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థి రాజేంద్ర రియాంగ్ పై బీజేపీ అభ్యర్థి కృతి దేవి దేబ్బర్మన్ విజయం సాధించారు.