IIT-Kharagpur: ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యార్థిని అనుమానాస్పద మృతి
IIT-Kharagpur: ఐఐటీ ఖరగ్ పూర్ లో అనుమానాస్పద స్థితిలో ఒక విద్యార్థిని మరణించింది. ప్రాథమికంగా ఆత్మహత్యగా నిర్ధారించిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి విద్యాపరంగా ప్రతిభావంతురాలైన అమ్మాయి అని ఐఐటీ ఖరగ్ పూర్ ఆవేదన వ్యక్తం చేసింది.
IIT-Kharagpur: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్ పూర్ క్యాంపస్ లో సోమవారం ఉదయం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె మృతదేహం సరోజినీ నాయుడు/ ఇందిరాగాంధీ హాల్ ఆవరణలోని సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
ఐఐటీ ఖరగ్ పూర్ ప్రకటన
కేరళకు చెందిన ఆ విద్యార్థిని మృతిపై ఐఐటీ ఖరగ్ పూర్ (IIT-Kharagpur) ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేసింది. ఐఐటీ ఖరగ్ పూర్ క్యాంపస్ లోని సరోజినీ నాయుడు/ ఇందిరాగాంధీ హాల్ ఆవరణలో ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించిందని వెల్లడించింది. ఆమె బయోసైన్స్ అండ్ బయోటెక్నాలజీ విభాగంలో మూడో సంవత్సరం చదువుతోందని తెలిపింది. ప్రస్తుతం ఆమె బయోసైన్స్ అండ్ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ వద్ద సమ్మర్ ఇంటర్న్ షిప్ చదువుతోందని తెలిపింది.
చురుకైన విద్యార్థిని
తమ క్యాంపస్ లో విద్యార్థిని మృతి చెందడంపై ఐఐటీ ఖరగ్ పూర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. ఆమె చాలా ప్రతిభావంతురాలు, చురుకైన విద్యార్థిని అని పేర్కొంది. ‘‘ఆమె విద్యాపరంగా ప్రతిభావంతురాలైన, తెలివితేటలు, అంకితభావం ఉన్న విద్యార్థిని. (సీజీపీఏ 8.37). బయోసైన్సెస్, బయోటెక్నాలజీ రంగంలో గొప్ప భవిష్యత్తు ఉన్న విద్యార్థిని. సరోజినీ నాయుడు / ఇందిరా గాంధీ హాల్ కు ఆమె సామాజిక, సాంస్కృతిక విభాగాలకు ప్రధాన కార్యదర్శిగా ఉంది’’ అని తెలిపింది.
పోలీసు కేసు
విద్యార్థిని మృతి సమాచారాన్ని ఐఐటీ ఖరగ్ పూర్ యాజమాన్యం జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించింది. అలాగే, వెంటనే ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ‘‘విద్యార్థిని మృతికి దారితీసిన పరిస్థితులపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంస్థ అధికారులకు పూర్తిగా సహకరిస్తోంది’’ అని ఐఐటీ ఖరగ్ పూర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద సంఘటనతో ఐఐటీ ఖరగ్ పూర్ దిగ్భ్రాంతికి లోనైంది.
కేరళకు చెందిన విద్యార్థిని
ఐఐటీ ఖరగ్ పూర్ క్యాంపస్ లో చనిపోయిన విద్యార్థిని స్వస్థలం కేరళ. ఇటీవలనే ఆమె ఇంటి నుంచి క్యాంపస్ కు తిరిగివచ్చింది. ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖరగ్ పూర్ సబ్ డివిజనల్ ఆసుపత్రికి తరలించారు. ‘దర్యాప్తు అనంతరమే మరణానికి గల కారణాలను గుర్తించగలం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి తెలిపారు.
రెండేళ్ల క్రితం..
కాగా, క్యాంపస్ లో పాక్షికంగా కుళ్లిపోయిన విద్యార్థి మృతదేహం లభ్యమైన రెండేళ్ల తర్వాత సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అస్సాంకు చెందిన మెకానికల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం విద్యార్థి ఫైజాన్ అహ్మద్ ను హత్య చేసినట్లు రెండో ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రెండోసారి శవపరీక్ష నిర్వహించారు. ఫోరెన్సిక్ నిపుణుల నివేదికను గత నెలలో కోర్టుకు సమర్పించారు.