QS World Rankings 2025: టాప్ 150 యూనివర్సిటీల జాబితాలో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ
ప్రతిష్టాత్మక క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2025 విడుదలైంది. ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వ విద్యాలయాల ప్రమాణాలను అధ్యయనం చేసి క్యూఎస్ సంస్థ ప్రతీ సంవత్సరం ఈ వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీల లిస్ట్ ను రూపొందిస్తుంది. ఈ సంవత్సరం ఈ లిస్ట్ లోని టాప్ 150 కాలేజీల్లో ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి.
QS World Rankings 2025: క్వాక్వెరెల్లి సైమండ్స్ మంగళవారం క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2025ను విడుదల చేసింది. ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ మాత్రమే టాప్ 150 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఐఐటీ బాంబే గత ఏడాది కంటే మెరుగైన పనితీరు కనబరిచి 118వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా ఐఐటీ ఢిల్లీ ఈ ఏడాది 150వ స్థానానికి ఎగబాకింది. 2023, 2024 జాబితాలో ఐఐటీ బాంబే 149వ స్థానంలో, ఐఐటీ ఢిల్లీ 197వ స్థానంలో, ఐఐఎస్సీ బెంగళూరు 225వ స్థానంలో, ఐఐటీ-కేజీపీ 271వ స్థానంలో, ఐఐటీ కాన్పూర్ 278వ స్థానంలో, ఐఐటీ మద్రాస్ 285వ స్థానంలో నిలిచాయి.
211 వ స్థానంలో ఐఐఎస్సీ
ఈ ఏడాది బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ర్యాంకింగ్ కూడా పెరిగింది. 2025 జాబితాలో ఐఐఎస్సీ 211వ స్థానంలో నిలిచింది. ఐఐటీ ఖరగ్ పూర్ 222వ ర్యాంకు, ఐఐటీ మద్రాస్ 227వ ర్యాంకు, ఐఐటీ కాన్పూర్ 263వ ర్యాంకు సాధించాయి. ఈ క్యూఎస్ జాబితాలో ఢిల్లీ యూనివర్సిటీ 328వ స్థానంలో, ఐఐటీ రూర్కీ 335వ స్థానంలో, ఐఐటీ గౌహతి 344వ స్థానంలో, అన్నా యూనివర్సిటీ 383వ స్థానంలో నిలిచాయి. ఐఐటీ ఇండోర్ 477వ ర్యాంకు, ఐఐటీ బీహెచ్ యూ 531వ ర్యాంకు, ఢిల్లీలోని జేఎన్ యూ 580వ ర్యాంకు సాధించాయి.
ఈ ప్రమాణాల ఆధారంగానే..
క్యూఎస్ అధికారిక వెబ్ సైట్ ప్రకారం.. ఆయా యూనివర్సిటీల సబ్జెక్ట్ కాంప్రహెన్సివ్ నెస్, లెవెల్ కాంప్రహెన్సివ్ నెస్, బోధనా విధానం.. తదితర ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని క్యూఎస్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ను రూపొందిస్తారు. గత సంవత్సరం నుండి, ఇప్పటికే ఉన్న ప్రమాణాలతో పాటు మూడు కొత్త ప్రమాణాలను ప్రవేశపెట్టారు. సస్టైనబిలిటీ, ఎంప్లాయబిలిటీ, ఇంటర్నేషనల్ రీసెర్చ్ కొలాబరేషన్ అనే మూడు ప్రమాణాలను కొత్తగా ప్రవేశపెట్టారు.
ఈ అంశాలకు వెయిటేజీ..
ర్యాంకులను నిర్ధారించే సమయంలో.. వివిధ అంశాలకు వెయిటేజీ ఇస్తారు.అకడమిక్ రెప్యుటేషన్ కు 30%, ఎంప్లాయర్ రెప్యుటేషన్ కు 15%, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో కు 10%, ఫ్యాకల్టీ సైటేషన్ కు 20%, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ రేషియోకు 5%, ఇంటర్నేషనల్ స్టూడెంట్ రేషియో కు 5%, ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్ వర్క్ కు 5%, ఎంప్లాయిమెంట్ అవుట్ కమ్స్ అండ్ సస్టెయినబిలిటీకి 5% వెయిటేజీ ఇచ్చారు.