Telangana Student Suicide: ఐఐటీ ఖరగ్ పూర్ లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య-telangana student at iit kharagpur dies by suicide ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Telangana Student Suicide: ఐఐటీ ఖరగ్ పూర్ లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

Telangana Student Suicide: ఐఐటీ ఖరగ్ పూర్ లో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

HT Telugu Desk HT Telugu
Oct 18, 2023 06:27 PM IST

Telangana Student Suicide: ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటీ ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ విద్యార్థి తెలంగాణ రాష్ట్రానికి చెందినవాడని ఐఐటీ ఖరగ్ పూర్ అధికారులు వెల్లడించారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Telangana Student Suicide: తెలంగాణా కు చెందిన విద్యార్థి కే కిరణ్ చంద్ర మంగళవారం తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఐఐటీ ఖరగ్ పూర్ అధికారులు వెల్లడించారు. కిరణ్ చంద్ర ఐఐటీ ఖరగ్ పూర్ లోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డ్యుయల్ డిగ్రీ కోర్సు నాలుగో సంవత్సరంలో ఉన్నాడు. ఇటీవల కాలంలో ఐఐటీ ఖరగ్ పూర్ లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతుండడం ఆందోళనకు కారణమవుతోంది. భారత్ లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలైన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ల్లో విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

రూమ్ మేట్స్ తో పాటు..

ఐఐటీ ఖరగ్ పూర్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు తన మరో ఇద్దరు రూమ్ మేట్స్ తో కలిసి కిరణ్ చంద్ర లాల్ బహదూర్ శాస్త్రి హాల్ ఆఫ్ రెసిడెన్స్ లోని తన గదిలోనే ఉన్నాడు. ఆ తరువాత ఆ ఇద్దరు రూమ్మేట్స్ వేరే పని పై బయటకు వెళ్లారు. అనంతరం రూమ్ లో ఒంటరిగా ఉన్న కిరణ్ చంద్ర గదికి లోపలి నుంచి గడియ వేసుకుని రూమ్ లోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాత్రి 8.30 గంటల సమయంలో వేరే విద్యార్థులు తలుపు లోపలి నుంచి గడియ వేసి ఉండడం, ఎంత సేపు తలుపు తట్టినా తెరవకపోవడంతో అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం, తలుపు బద్ధలు కొట్టి చూడగా, కిరణ్ చంద్ర ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే అధికారులు పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ రాత్రి 11.30 గంటల సమయంలో చనిపోయాడు. విద్యార్థి కిరణ్ చంద్ర తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చామని, వారు బుధవారం మధ్యాహ్నానికి చేరుకున్నారని ఐఐటీ ఖరగ్ పూర్ ఒక ప్రకటనలో వివరించింది. తమ విద్యార్థి ఆత్మహత్య తమను ఎంతో కలచి వేసిందని తెలిపింది. కిరణ్ చంద్ర ఆత్మహత్యకు కారణాలు తెలియదని, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించింది.