Crime news: ‘‘బాలిక లోదుస్తులు తొలగించడం, తన ముందు నగ్నంగా ఉండటం 'అత్యాచార యత్నం కాదు’’: రాజస్తాన్ హైకోర్టు-removing girls underwear getting naked not attempt to rape rajasthan hc ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News: ‘‘బాలిక లోదుస్తులు తొలగించడం, తన ముందు నగ్నంగా ఉండటం 'అత్యాచార యత్నం కాదు’’: రాజస్తాన్ హైకోర్టు

Crime news: ‘‘బాలిక లోదుస్తులు తొలగించడం, తన ముందు నగ్నంగా ఉండటం 'అత్యాచార యత్నం కాదు’’: రాజస్తాన్ హైకోర్టు

HT Telugu Desk HT Telugu
Jun 13, 2024 02:49 PM IST

Rajasthan Crime news: మైనర్ పై అత్యాచార యత్నానికి సంబంధించిన ఒక 33 ఏళ్ల నాటి కేసులో తీర్పు వెలువరిస్తూ రాజస్తాన్ హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. బాలిక లోదుస్తులు తొలగించడం, అమె ముందు తన బట్టలు విప్పి నగ్నంగా ఉండటం అత్యాచార యత్నం కిందకు రాదని స్పష్టం చేసింది.

అత్యాచార యత్నం కేసులో రాజస్తాన్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు
అత్యాచార యత్నం కేసులో రాజస్తాన్ హై కోర్టు కీలక వ్యాఖ్యలు

Rajasthan Crime news: మైనర్ బాలిక లోపలి దుస్తులను తొలగించి, ఆమె ముందు నగ్నంగా మారడం ‘అత్యాచార యత్నం (attempt to commit rape)’ కిందకు రాదని, దానికి బదులుగా ‘మహిళ గౌరవానికి భంగం కలిగించే నేరం (offence of outraging the woman's modesty)’ గా పరిగణించవచ్చని రాజస్తాన్ హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. 33 ఏళ్ల కిందటి కేసులో తీర్పు వెలువరిస్తూ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కేసు వివరాలు..

బాధితురాలైన ఆరేళ్ల బాలిక తరఫున ఆమె తాత చేసిన ఫిర్యాదు మేరకు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్తాన్ లో ఆ ఆరేళ్ల బాలిక ఒక వాటర్ బూత్ వద్ద నీరు తాగుతుండగా, ఆ సమయంలో అక్కడే ఉన్న 25 ఏళ్ల వయసున్న నిందితుడు ఆ బాలికపై అత్యాచారం చేయాలనే ఉద్దేశంతో ఆమెను బలవంతంగా సమీపంలోని ధర్మశాలకు తీసుకెళ్లాడు. బలవంతంగా ఆ బాలిక లో దుస్తులు తొలగించి, తాను కూడా బట్టలు విప్పి నగ్నంగా మారాడు. అయితే ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకుని ఆమెను రక్షించారు. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

పోలీసు కేసు, కోర్టు విచారణ

బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 33 ఏళ్ల తరువాత ఇటీవల ఈ కేసు విచారణ రాజస్తాన్ హై కోర్టుకు వచ్చింది. ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు తన బట్టలు విప్పుకోవడంతో పాటు, బాధితురాలి బట్టలు విప్పాడని ఫిర్యాదులో పేర్కొన్నారు కానీ, నిందితుడు ఆ బాలికపై ఎలాంటి లైంగిక దుశ్చర్యలకు పాల్పడినట్లు ఫిర్యాదులో లేదని కోర్టు గుర్తు చేసింది. అందువల్ల, ఇది ఐపీసీ 376, 511 సెక్షన్ల కింద అత్యాచారయత్నం నేరం కిందకు రాదని స్పష్టం చేసింది. ‘‘అత్యాచార యత్నం కేసుగా పేర్కొనడానికి నిందితుడు ‘ప్రిపరేషన్’ దశను దాటి ఉండాలి’’ అని పేర్కొంది.

ఈ 3 దశలు జరిగితేనే ‘అత్యాచార యత్నం’ గా నిర్ధారిస్తాం

అత్యాచార యత్నం కింద శిక్షార్హమైన నేరంగా నిర్ధారించడానికి నిందితుడు "మూడు దశలు" నెరవేర్చాల్సిన అవసరం ఉందని రాజస్తాన్ హైకోర్టు తెలిపింది. ‘‘అందులో మొదటిది, నిందితుడికి నేరం చేయాలనే ఆలోచన లేదా ఉద్దేశం ఉండడం; రెండవది, ఆ నేరం చేయడానికి ప్రిపరేషన్ లేదా సన్నాహాలు పూర్తి చేయడం; మూడవది, నిందితుడు ఉద్దేశపూర్వకంగా నేరం చేయడానికి చర్యలు తీసుకోవడం’’ అని హైకోర్టు వివరించింది. ఈ కేసులో నిందితుడు రెండవ దశలోనే ఉన్నాడని గుర్తు చేసింది. అందువల్ల, దీనిని అత్యాచార యత్నం కేసుగా నిర్ధారించలేమని స్పష్టం చేసింది.

Whats_app_banner