Elon Musk: ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ ఉద్యోగి, మాజీ ఇంటర్న్ తో శృంగారంలో పాల్గొన్నాడని, తన కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మరో మహిళను తనకు పిల్లలను కనివ్వాలని కోరాడని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఎలన్ మస్క్ చట్టవిరుద్ధమైన మాదకద్రవ్యాల వాడేవాడు. ఆఫీస్ లో కూడా ఎల్ఎస్డీ, కొకైన్, మష్రూమ్స్, కెటమైన్ వంటి డ్రగ్స్ ను తీసుకునేవాడు. ఎలన్ మస్క్ తో పాటు కొందరు బోర్డు సభ్యులు కూడా డ్రగ్స్ తీసుకునేవారు. ఎలాన్ మస్క్ తన సంస్థల్లో ఒక సంస్కృతిని సృష్టించారు. ఇది మహిళా ఉద్యోగులను అసౌకర్యానికి గురి చేసింది.
2016లో ఎలాన్ మస్క్ తనతో సెక్స్ లో పాల్గొనాలని కోరాడని స్పేస్ ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ గా గతంలో పనిచేసిన ఒక యువతి ఆరో పించింది. తనతో శృంగారంలో పాల్గొంటే ఒక గుర్రాన్ని కూడా కొనిస్తానని మస్క్ (Elon Musk) ఆఫర్ చేశాడని ఆమె తెలిపింది. స్పేస్ ఎక్స్ సంస్థలో పనిచేసి, రాజీనామా చేసిన మరో మహిళ కూడా ఎలాన్ మస్క్ పై పలు లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. తనతో పిల్లలను కనాలని మస్క్ కోరాడని ఆమె ఆరోపించింది. 2014లో కంపెనీలో పనిచేసే ఓ యువతి ఎలాన్ మస్క్ తో నెల రోజుల పాటు లైంగిక సంబంధం పెట్టుకుందని, ఆమె నేరుగా అతడికే రిపోర్ట్ చేసేదని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అయితే, అకస్మాత్తుగా ఆమె కంపెనీ కి రాజీనామా చేసి వెళ్లిపోయింది.
స్పేస్ ఎక్స్ లో పనిచేసిన ఓ మహిళకు ఎలన్ మస్క్ రాత్రిపూట పదేపదే మెసేజెస్ పంపించాడు. రాత్రి తన ఇంటికి రావాలని కోరేవాడు. ఆ మెసేజెస్ కు వెంటనే స్పందించకుండా, మర్నాడు ఉదయం మస్క్ కు ఆ యువతి రిప్లై ఇచ్చింది. ‘మీ మెసేజ్ వచ్చే సమయానికే నేను పడుకున్నాను. క్షమించండి’ అని ఆమె మస్క్ కు రిప్లై ఇచ్చింది. ఈ సందేశాలను ఆ తరువాత ఆ యువతి బహిర్గతపర్చింది. ఈ వివరాలను వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.