World Down Syndrome Day | పిల్లలు అలా ఉన్నారంటే ఆ తప్పు వారిది కాదు!
ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం- ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒకరు ఈ డౌన్ సిండ్రోమ్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. ఇలాంటి అనారోగ్య పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీఏటా మార్చి 21న వరల్డ్ డౌన్ సిండ్రోమ్ దినోత్సవంగా పాటిస్తారు
ఈరోజు ప్రపంచ డౌన్ సిండ్రోమ్ దినోత్సవం. డౌన్ సిండ్రోమ్ (Down syndrome) అనేది ఒక రకమైన జన్యు సంబంధమైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు, ఆలోచననాశక్తి కూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ఒకరు ఈ డౌన్ సిండ్రోమ్ డిజార్డర్ తో బాధపడుతున్నారు. ఇలాంటి అనారోగ్య పరిస్థితిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతీఏటా మార్చి 21న వరల్డ్ డౌన్ సిండ్రోమ్ దినోత్సవంగా పాటిస్తారు. బిట్రీష్ వైద్యుడైన జాన్ లాంగ్డన్ డౌన్ మొదటగా ఈ వ్యాధిని 1862 సంవత్సరంలో గుర్తించారు.
ఒక మనిషి డీఎన్ఏలోని క్రోమోజోములో లోపాలు ఈ పరిస్థితికి దారితీస్తుంది. మనిషిగా నిర్ధారించే 21 క్రోమోజోముల్లో ఒకటి ఎక్కువైనపుడు, రెండు పోగులు ఉండాల్సిన చోట మూడు ఉంటాయి. అందువలన దీనిని ట్రైసోమీ 21 అని కూడా పిలుస్తారు. ఈ అదనపు క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో డౌన్ సిండ్రోమ్ డిజార్డర్ కు దారితీస్తుంది. దీనిమూలంగా కణాల అభివృద్ధి జరగదు. పిల్లల్లో భౌతికమైన పెరుగుదల మందగిస్తుంది. మానసికంగా కూడా పరిణతి ఉండదు. ముఖ కవలికల ఆధారంగానే వీరి పరిస్థితిని గుర్తించవచ్చును.
డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో సాధారణంగా మిగతా పిల్లల కంటే పరిమాణంలో తక్కువగా ఉంటారు. వీరు నెమ్మదిగా పెరుగుతారు. వయసు పెరిగినా చిన్న పిల్లల మాదిరిగానే కనిపిస్తారు. చదునైన ముఖం, సన్నని మెడ, పొడుచుకు వచ్చిన నాలుక, కండరాల స్థాయి ఉన్నంతలో ఉండకపోవడం లాంటి శారీరక లోపాలు కనిపిస్తాయి.
ఇక వీరికి తెలివితేటలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సగటున 90-110 మధ్య ఉండాల్సిన IQ స్థాయిల కంటే డౌన్ సిండ్రోమ్ కలిగిన వారిలో IQ 50 మాత్రమే ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏదీ అర్థంకాని పరిస్థితి ఉంటుంది.
కాబట్టి పిల్లలు ఎవరైనా ఎదుగుదల లోపించి బాధపడుతున్నారంటే అది వారి తప్పు కాదు, ఒక జన్యుపరమైన సమస్య. కాబట్టి అలాంటి వారిని నిందించడం, శిక్షించడం చేయకూడదు. వారు ఏది చెప్పిన ఆసక్తిగా వినాలి, వారి ఆలోచనలకు, చర్యలకు స్వేచ్ఛ ఇవ్వాలి.
వ్యాధి నిర్ధారణ ఎలా?
డౌన్ సిండ్రోమ్ సాధారణంగా గర్భధారణ సమయంలోనే గుర్తించవచ్చు. ఒకవేళ అప్పుడు గుర్తించలేకపోతే, తర్వాత కాలంలో శిశువు రూపాన్ని ఆధారంగా చేసుకొని వైద్యులు ఆ పరిస్థితిని నిర్ధారిస్తారు. అవసరమైతే రోగనిర్ధారణను నిర్ధారించడానికి రక్త పరీక్ష (కార్యోటైప్) చేస్తారు.
చికిత్స ఏంటి?
డౌన్ సిండ్రోమ్‌కు నిర్దిష్టమైన చికిత్స ఏమీ లేనప్పటికీ, కొన్ని థెరపీల ద్వారా పరిస్థితిలో కొంతవరకు మార్పు తీసుకురావొచ్చు. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లల్లో లోపాలు అందరికీ ఒకేలా ఉండవు. కొందరికి దృష్టిలోపం ఉంటే కళ్లద్దాలు అవసరం కావొచ్చు, ఇంకొకరికి వినికిడి పరికరాలు.. ఇలా ఒక్కొక్కరికి తలెత్తె లోపాలను బట్టి కొంతవరకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిష్కారం ఇవ్వవచ్చు. అయితే ఈ వ్యాధిని పూర్తిగా నయం చేసే చికిత్స లేదు.
సగటు ఆయుర్దాయం
జన్యు లోపాలున్నప్పటికీ డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు కూడా బాగానే జీవించవచ్చు. కొత్తకొత్త చికిత్సలతో ఇప్పుడు వీరి ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. డౌన్ సిండ్రోమ్ సగటున 60 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించగలరు.
సంబంధిత కథనం