Maha Shivaratri 2022 | శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం.. పురాణాలు ఏమంటున్నాయ్..?-why we celebrate shivaratri on every year what is the behind story of shivaratri ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Maha Shivaratri 2022 | శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం.. పురాణాలు ఏమంటున్నాయ్..?

Maha Shivaratri 2022 | శివరాత్రి ఎందుకు జరుపుకుంటాం.. పురాణాలు ఏమంటున్నాయ్..?

Vijaya Madhuri HT Telugu
Feb 28, 2022 12:52 PM IST

శివరాత్రిని శివుని భక్తులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నియమ నిష్ఠలతో పూజలు చేస్తారు. పైగా మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి... ఆలయాలకు వెళ్లి పూజలు చేసి.. శివుని నామస్మరణలో మునిగి తేలుతారు. శివుడిని భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తారు. అంతటి పవిత్రమైన శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?

శివరాత్రి
శివరాత్రి

Maha Shivaratri 2022 | శివరాత్రి రోజున శివుడి అభిషేకం చేయడమనేది అత్యంత పవిత్రమైనదిగా జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటున్నాం. ఉపవాసం చేసి.. శివ జాగారణతో భక్తులు శివారాధన చేస్తారు. అలాంటి ఈ రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలున్నాయి. అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవండి..

మొదటిది.. క్షీరసాగర మథనం

పురాణకాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుడు మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులందరూ కలిపి ఐదు జాముల కాలం ఏకధాటిగా ఆడిపాడుతారు.

అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు.. వారు ఆడిపాడిన ఐదు జాములకాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం, జాగారణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు.

రెండోది లింగోద్భావం

నేను గొప్పంటే నేను గొప్పని బ్రహ్మ, విష్ణువులు గొడవ పడుతుంటారు. వారి తగువును తీర్చడానికే శివుడు లింగాకారమై.. మళ్లీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సకల జీవరాశుల తలరాతలు రాసేది నేను.. సృష్టిని సృష్టించేది నేను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ అంటుంటే.. నువ్వు కూర్చున్న చోటు నుంచి ఎటు వెళ్లవు. కాలు కదపకుండా తలరాతలు రాస్తే సరిపోతుందా లోకాలన్ని తిరిగి రకరకాల అవతారాలలో పర్యవేక్షిస్తూ పాలించేది నేను. కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణువు. వీరి తగువు ఎంతకీ తెగకపోవడంతో దానిని తీర్చేందుకు మహా శివుడే రంగంలోకి దిగుతాడు. ఒక చోట అగ్ని స్తంభం ఉందని.. దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప ఇక బయలుదేరండి అని చెప్తాడు శివుడు.

ఆద్యంతాలు తెలుసుకోండి..

అగ్నిస్తంభం ఆద్యంతాలు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతారు. ఆది కోసం బ్రహ్మ, అంతం కోసం విష్ణువులు బయలుదేరుతారు. ఎంత ప్రయత్నించినా దాని అంతం కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమిని అంగీకరించి శివుడి దగ్గరికి బయల్దేరుతాడు. దారిలో బ్రహ్మ కామధేనువును, మొగలిపువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కునా అని చెప్తాడు. ఇద్దరూ ఒకచోట చేరిన తర్వాత.. అగ్నిస్తంభం తానేనని.. దానికి ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు.

దీంతో తమ కంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మ, విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి మారేడు దళాలతో అర్చిస్తారు. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. అన్ని నేనే అంతటా నేనే.. నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్తాడు. అదే శివరాత్రి. శివుడు లింగరూపంలో ఉద్భవించిన రోజు. మాఘమాసం ఆరుద్ర నక్షత్రంలో శివుడు లింగరూపంలో ఉద్భవించాడని భావిస్తారు.

నాటి నుంచి ప్రతి మాఘమాస అమావాస్య రోజున మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నారు. శివలింగానికి రుద్రాభిషేకం చేసి.. ఉదయం నుంచి ఉపవాసం, జాగారం చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

WhatsApp channel

సంబంధిత కథనం