Wealthiest Temples: దేశంలో అంత్యంత సంపన్న దేవాలయాలు ఏవో మీకు తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయాలు కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి. దేశంలో నెలవైన కొన్ని దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాల జాబితాలో చోటు సంపాదించి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
భారతీయ సంస్కృతిలో దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ప్రాచీన కాలం నుంచే అనేక హిందూ, జైన, బౌద్ధ దేవాలయాలు దేశంలో నిర్మితమయ్యాయి. ఎన్నో సుప్రసిద్ధ, పురాతనమైన దేవాలయాలతో `భారతదేశం శోభిల్లుతుంది. ఈ ఆలయాలు వెలకట్టలేని సంపదగా నిలుస్తూ, నలుదిశలా ఆధ్యాత్మికతను విస్తరింపజేస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయాలు కలిగిన దేశాలలో భారతదేశం ఒకటి. దేశంలో నెలవైన కొన్ని దేవాలయాలు అత్యంత ధనిక దేవాలయాల జాబితాలో చోటు సంపాదించి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దేశంలోని కొన్ని సంపన్న దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
పద్మనాభస్వామి దేవాలయం, కేరళ
పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న హిందూ దేవాలయం. అనంత పద్మనాభస్వామి అందరికంటే ధనవంతుడు! ఈ ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో నెలవై ఉంది. గుడి నేలమాళిగల్లో ఆరు రహస్య గదులను గుర్తించారు. వాటిలో వజ్రాలు, బంగారు ఆభరణాలు, బంగారు విగ్రహాలను గుర్తించారు . వాటి విలువ దాదాపు 20 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
తిరుమల తిరుపతి వెంకటేశ్వర దేవాలయం, ఆంధ్రప్రదేశ్
సంపన్న దేవాలయాల జాబితాలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది. వైష్ణవ దేవాలయమైన తిరుపతిని ప్రతి ఏటా లక్షలాది భక్తులు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటారు. స్వామి వారికి భక్తులు సమర్పించే విరాళాల పరంగా తిరుపతి ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం. ప్రతి సంవత్సరం శ్రీ వేంకటేశ్వరుని పేరిట ఈ ఆలయానికి వచ్చే విరాళాలు దాదాపు 650 కోట్ల రూపాయల పైగానే ఉంటుంది. కేవలం శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అమ్మడం ద్వారానే ఆలయానికి లక్షల్లో ఆదాయం వస్తుంది .
షిర్డీ సాయిబాబా మందిరం, మహారాష్ట్ర
మహారాష్ట్రలోని షిర్డీ సాయిబాబా మందిరం దేశంలోని సంపన్న దేవాలయాల జాబితాలో మూడో స్థానంలో ఉంది. ఆలయ రికార్డుల ప్రకారం, షిర్డీ ఆలయానికి 32 కోట్ల రూపాయల విలువైన బంగారు అభరణాలు ఉన్నాయి. అంతేకాకుండా, ప్రతీ ఏటా భక్తులు ఆలయానికి భారీ విరాళాలు సమర్పించుకుంటారు. బాబా పేరిట వచ్చే విరాళాల వార్షిక విలువ సుమారు రూ. 360 కోట్ల పైమాటే ఉంటుంది.
వైష్ణో దేవి పుణ్యక్షేత్రం, జమ్మూకాశ్మీర్
వైష్ణో దేవి ఆలయం దేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా చెప్తారు. భారతదేశంలో గుర్తింపు పొందిన శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి. ఈ ఆలయానికి ప్రతీ ఏడాది రూ. 500 కోట్లకు పైగా విరాళాలు అందుతాయని సమాచారం. ప్రపంచం నలుమూలల నుండి అనేక మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఇక్కడకు వస్తారు.
జగన్నాథ దేవాలయం, పూరి, ఒడిశా
దేశంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మరొక దేవాలయం పూరీలోని జగన్నాథ ఆలయం. ఈ దేవాలయ సంపద గురించి ఖచ్చితంగా తెలియనప్పటికీ, ఆలయంలో 100 కిలోలకు పైగా బంగారం, వెండి అభరణాలు ఉన్నాయని అంచనా. ఏటా జరిగే జగన్నాథుడి రథ యాత్రకు లక్షలాది భక్తులు తరలివస్తారు.
సోమనాథ్ ఆలయం, గుజరాత్
భారతదేశంలోని అత్యంత ధనిక దేవాలయాల జాబితాలో గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయం కూడా చోటు సంపాదించింది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర ప్రాంతంలోని నెలవై ఉన్న అత్యంత పురాతనమైన ఈ శైవ దేవాలయాన్ని సందర్శించడానికి లక్షల మంది తరలివస్తారు. పరమ శివుని 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఒకటి