Vankaya Pachadi: వంకాయ పచ్చడి రెసిపీ ఇదిగో, ఒక్కసారి తిన్నారంటే మరిచిపోలేరు
Vankaya Pachadi: తెలుగువారికి పచ్చళ్ళపై ప్రీతి ఎక్కువ. ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు కాకుండా కొత్త కాంబినేషన్లు ప్రయత్నించండి. వంకాయ నువ్వుల పచ్చడి రెసిపీ ఇక్కడ ఇచ్చాము.
Vankaya Nuvvula Pachadi: వంకాయ పేరు చెబితేనే ఎంతోమంది ముఖం ముడుచుకుంటారు. నిజానికి వంకాయను సరైన పద్ధతిలో వండితే దాని రుచి మరి ఏ కూరకు రాదు. ఇక్కడ మేము వంకాయ నువ్వుల పచ్చడి ఇచ్చాము. ఈ రెండింటి కాంబినేషన్లో పచ్చడి అదిరిపోతుంది. ఎప్పుడూ ఒకేలాంటి పచ్చళ్ళు తినే కన్నా ఇలా కొత్త కాంబినేషన్లో ప్రయత్నించండి. దీన్ని స్పైసీగా చేసుకుంటే వేడి వేడి అన్నంలో రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని కేవలం అన్నంలోనే కాదు ఇడ్లీ దోశతో కూడా తినవచ్చు. దీని రెసిపీ కూడా చాలా సులువు. ఒకసారి చేసుకుంటే రెండు రోజులు తాజాగా ఉంటుంది. వంకాయ నువ్వులు పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
వంకాయ నువ్వులు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
వంకాయలు - అర కిలో
నువ్వులు - పావు కప్పు
వెల్లుల్లి - నాలుగు రెబ్బలు
నీరు - సరిపడినంత
టమోటాలు - నాలుగు
ఉల్లిపాయ - ఒకటి
నిమ్మరసం - ఒక స్పూను
నూనె - సరిపడినంత
ఆవాలు - అర స్పూను
ఎండుమిర్చి - రెండు
ఉప్పు - రుచికి సరిపడా
వంకాయ నువ్వులు పచ్చడి రెసిపీ
1. వంకాయలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసి కుక్కర్లో వేయాలి.
2. ఒక పావు కప్పు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకబెట్టాలి.
3. ఒక విజిల్ వచ్చాక స్టవ్ కట్టేయాలి. ఆవిరి పోయాక కుక్కర్ మూతను తెరిచి వంకాయలను ఒక ప్లేట్లో వేసుకోవాలి.
4. వంకాయ పైన ఉన్న తొక్కను తీసేయాలి.
5. ఇప్పుడు ఆ వంకాయలను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నువ్వులు వేయాలి.
7. నువ్వులు రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ కట్టేయాలి.
8. మిక్సీ జార్లో ఈ నువ్వులను కూడా వేసి మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
9. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ కళాయి పెట్టి నూనె వేయాలి.
10. ఆ నూనెలో ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి.
11. ఆ తర్వాత టమోటోలు వేసి వేయించాలి.
12. టమోటోలు మెత్తగా అయ్యేవరకు వేయించుకోవాలి.
13. అందులోనే ఎండుమిర్చిని కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి.
14. ఇప్పుడు ఈ మిశ్రమంలో రుబ్బిన వంకాయను వేసి బాగా కలుపుకోవాలి.
15. అందులోనే నువ్వుల పొడిని కూడా వేసి బాగా కలపాలి.
16. పైన నిమ్మ రసాన్ని వేయాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకోవాలి.
17. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నూనె వేయాలి.
18. ఆ నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.
18. అలాగే కరివేపాకులను కూడా వేయాలి.
19. ఈ పోపును చట్నీ పైన వేసి కలుపుకోవాలి.
20. అంతే టేస్టీగా వంకాయ నువ్వులు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది తినే కొద్ది తినాలనిపించేలా ఉంటుంది.
వంకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వారానికి ఒకటి రెండు సార్లు అయినా వంకాయను కచ్చితంగా తినాలి. కూరగా తినడం ఇష్టం లేకపోతే ఇలా పచ్చడి రూపంలో తింటే ఇంకా మంచిది. ఇక నువ్వుల లోని పోషకాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మహిళలు కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో నువ్వులు ఒకటి. ఈ వంకాయ నువ్వుల పచ్చడి ఒకసారి ట్రై చేయండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.
టాపిక్