Vankaya Gravy: వంకాయ ఇగురు ఇలా చేశారంటే ఎవరికైనా నచ్చేస్తుంది-vankaya gravy recipe in telugu know how to make curry ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vankaya Gravy: వంకాయ ఇగురు ఇలా చేశారంటే ఎవరికైనా నచ్చేస్తుంది

Vankaya Gravy: వంకాయ ఇగురు ఇలా చేశారంటే ఎవరికైనా నచ్చేస్తుంది

Haritha Chappa HT Telugu
Jan 26, 2024 05:40 PM IST

Vankaya Gravy: వంకాయ ఇగురు అనగానే వంకాయ ముక్కలు కోసి, ఉల్లిపాయలు వేసే కూర అని అనుకుంటారు. నిజానికి వంకాయ ఇగురు వేరు, దీన్ని వంకాయ మెత్తగా చేసి ఇగురులా మారుస్తారు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.

వంకాయ ఇగురు రెసిపీ
వంకాయ ఇగురు రెసిపీ ( Hyderabadi Ruchulu/youtube)

Vankaya Gravy: వంకాయతో చేసిన వంటకాలకు అభిమానులు ఎక్కువే. మసాలా వంకాయ వండితే ఒక్క స్పూన్ కూడా మిగిల్చకుండా తినేస్తారు. కానీ సాధారణ వంకాయ కూర వండితే మాత్రం తినేందుకు ఇష్టపడరు, ఒకసారి కొత్తగా వంకాయ ఇగురును ప్రయత్నించండి. ఇందులో వంకాయ ముక్కలుగా ఉండదు, ఇగురు రూపంలోకి మారిపోతుంది. కాబట్టి టేస్టీగా ఉంటుంది. వంకాయ ముక్కలు కూడా తగలవు, వేడివేడి అన్నంలో ఈ వంకాయ ఇగురును కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటుంది. చపాతీ, రోటీ, పరాటాల్లోకి ఈ వంకాయ ఇగురు బాగుంటుంది. దీన్ని చేయడం చాలా సులువు. పెద్ద వంకాయ ఒకటి ఉంటే చాలు నలుగురికి సరిపడా ఇగురు రెడీ అయిపోతుంది. వంకాయ ఇగురు రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

వంకాయ ఇగురు రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పెద్ద వంకాయ - ఒకటి

ఉల్లిపాయలు - రెండు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

టమోటాలు - 4

మిరియాల పొడి - ఒక స్పూను

పసుపు - పావు స్పూను

కారం - అర స్పూను

నూనె - సరిపడా

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

ఆవాలు - ఒక స్పూను

చింతపండు - చిన్న నిమ్మకాయ సైజులో

ఉప్పు - రుచికి సరిపడా

వంకాయ ఇగురు రెసిపీ

1. చింతపండును కొంచెం నీళ్లలో నానబెట్టి గుజ్జులా చేయాలి.

2. మిక్సీలో ఉల్లిపాయ ముక్కలు, టమోటో ముక్కలు వేసి ఫ్యూరీలా మార్చుకోవాలి.

3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి.

4. అందులో పెద్ద వంకాయను ముక్కలుగా చేసి ఆ ముక్కలను వేయించాలి.

5. అవి మెత్తగా వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.

6. ఆ కళాయిలో మరి కాస్త నూనె వేసి ఆవాలు, జీలకర్ర చిటపటలాడే వరకు ఉంచాలి.

7. ఆ తరువాత ఉల్లి టమోటో పేస్టు వేసి బాగా కలపాలి.

8. అది పచ్చివాసన పోయే వరకు వేయించాలి.

9. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును, పసుపును వేసి చిన్న మంట మీద వేయించాలి.

10. ఐదు నిమిషాల తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి.

11. రుచికి సరిపడా ఉప్పును వేయాలి. స్పైసీగా కావాలనుకునేవారు ఎక్కువ కారాన్ని వేసుకోవచ్చు.

12. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి మూత పెట్టి పావుగంట సేపు ఉడకనివ్వాలి.

13. ఆ తర్వాత మూత తీసి ముందుగా వేయించుకొని మెత్తగా చేసిన వంకాయ ముక్కలను వేసి కలపాలి.

14. వంకాయ ముక్కలను గరిటతో నొక్కుతూ ఉండడం వల్ల అవి మెత్తగా ఇగురులో కలిసిపోతాయి.

15. అర గ్లాసు నీరు వేసి చిన్న మంట మీద 20 నిమిషాలు ఉడికించాలి.

16. వంకాయ ముక్కలన్నీ ఇగురులా మారిపోతాయి. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే టేస్టీ వంకాయ ఇగురు రెడీ అయినట్టే.

వంకాయ కూరలను ఇష్టపడని వారు ఒకసారి ఈ వంకాయ ఇగురును చేసుకుని చూడండి. కచ్చితంగా మీకు నచ్చుతుంది. ఇది దగ్గర దగ్గరగా వంకాయ పచ్చడిలా అనిపిస్తుంది. కానీ రుచి అదిరిపోతుంది. చపాతీతో తిన్నా అన్నంతో తిన్నా టేస్టీగా ఉంటుంది.

Whats_app_banner