Tuesday Motivation : మనీ ఉన్న వాడికంటే.. మర్యాద తెలిసినవాడే గొప్పవాడు
Tuesday Motivation : మనిషిగా పుట్టినప్పుడు పక్కవాడికి మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి. అహంకారంతో ప్రవర్తిస్తే.. ఎవరూ దగ్గరకు రారు. చివరకు ఒంటరిగా మిగిలిపోతారు.
గౌరవ, మర్యాదలు ఇవ్వడం అనేది నీలో ఉన్న మంచితనానికి నిదర్శనమైతే, నీకూ గౌరవ మర్యాదలు అదే స్థాయిలో దక్కుతాయి. గౌరవం సంపాదించాలి.. డిమాండ్ చేస్తే రాదు. మీకు ఒకరు గౌరవం ఇవ్వాలంటే.. ఇతరులకు మీరు ఇచ్చే గౌరవం మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఇచ్చే మర్యాదతోనే సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. అతడి దగ్గరకు వెళితే.. చక్కగా మాట్లాడుతాడనే అభిప్రాయం కలుగుతుంది. లేకుంటే మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మీ చుట్టుపక్కలకు వచ్చేందుకు కూడా ఇబ్బండి పడతారు. మీకోసం ఇక్కడ ఓ చిన్న స్టోరీ ఉంది.. చదవండి.
ఒక పెద్ద మర్రిచెట్టు కింద ఒక సన్యాసి కూర్చుని ఉన్నాడు. అతనికి కంటిచూపు లేదు. అటుగా వచ్చిన ఓ వ్యక్తి 'ఏయ్ ముసలాయన, ఈ దారిలో ఎవరైనా వెళ్ళారా?' అన్నాడు. అతను గౌరవం లేని అధికారంతో అడిగాడు. దానికి సన్యాసి, 'ఎవరూ అలా వెళ్ళినట్లు లేదు.' అని సమాధానమిచ్చాడు.
కాసేపటికి ఇంకొకరు వచ్చి 'అయ్యా ఇంతకు ముందు ఎవరైనా వెళ్ళారా?' అని అడిగాడు. ఏమో వెళ్లారేమో అని సన్యాసి సమాధానం ఇచ్చాడు. ఇంకొతను కూడా ఇదే ప్రశ్న అడిగాడని చెప్పాడు.
మళ్లీ కొంత సమయానికి మరొకరు వచ్చి.. 'నమస్కారం, సన్యాసి.. ఇంతకు ముందు ఎవరైనా ఈ మార్గంలో వెళుతున్న శబ్దం విన్నారా?' అని మర్యాదగా అడిగాడు.
ఒక్కసారిగా సన్యాసి, 'నమస్కారం, రాజా. ముందుగా ఓ సైనికుడు ఇటువైపు వెళ్ళాడు. తరువాత ఒక మంత్రి వచ్చాడు. ఇద్దరూ మీరు అడిగిన ప్రశ్న అడిగారు.' అని చెప్పాడు.
అప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు. సన్యాసి, మీకు దృష్టి లేదు కదా. అలాంటప్పుడు ముందు సైనికుడు వెళ్లాడని, ఆ తర్వాత మంత్రిని అని ఎలా సరిగ్గా చెప్పారు? అని ప్రశ్నించాడు. ఇది తెలుసుకోవటానికి చూపు అవసరం లేదు రాజు గారూ.. మాట్లాడిన వ్యక్తి మాటను బట్టి.. ఎవరో తెలుసుకోవచ్చని సన్యాసి సమాధానమిచ్చాడు.
'మొదటి వ్యక్తి అగౌరవంగా ఉన్నాడు, తదుపరి వ్యక్తి మాటలు అధికారాన్ని చూపించాయి. మీరు మాట్లాడితే వినయాన్ని చూపించింది.' అని రాజుతో చెప్పాడు సన్యాసి.
అంటే ఇక్కడ మీరు మాట్లాడే మాటలు.. మిమ్మల్ని రాజులా చేస్తాయి. మీరు ఇతరులకు మర్యాద ఇస్తే.. వారు మిమ్మల్ని ఉన్నతమైన వ్యక్తులుగానే చూస్తారు. మీరు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే.. మిమ్మల్ని దారుణంగానే చూస్తారు. వారి చుట్టు పక్కలకు కూడా రానివ్వరు. దారి వెంటే వెళ్తుంటే కూడా.. మీకు కావాల్సిన విషయం గురించి.. మర్యాద ఇచ్చి.. వినయంగా అడగాలి. అప్పుడే సరైనా సమాధానం వస్తుంది. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే సరైన సమాధానం రాదు. పైన చెప్పిన కథనే ఇందుకు ఉదాహరణ.
బరువులు మోసే వాడి కంటే.. బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు..
మనీ ఉన్న వాడికంటే.. మర్యాద తెలిసినవాడే గొప్పవాడు..
మనం వెళ్లిన చోట.. మర్యాద ఇవ్వలేదనడం తప్పు..
మర్యాద లేని చోటకు.. మనం వెళ్లడమే అసలు తప్పు..!