vintage interior: పాత కాలం నాటి వస్తువులే.. కొత్త ఇంటీరియర్ ట్రెండ్-tips to decorate vintage style home with modern twist ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vintage Interior: పాత కాలం నాటి వస్తువులే.. కొత్త ఇంటీరియర్ ట్రెండ్

vintage interior: పాత కాలం నాటి వస్తువులే.. కొత్త ఇంటీరియర్ ట్రెండ్

Akanksha Agnihotri HT Telugu
May 07, 2023 03:40 PM IST

vintage interior: ఆధునిక ఇంటీరియర్ డిజైనింగ్‌లో పాతకాలపు హుందాతనం ఉన్నలుక్ రావాలంటే ఇంటిని ఎలా అలంకరించాలో చూద్దాం.

పాత కాలం నాటి వస్తువులతో అలంకరణ
పాత కాలం నాటి వస్తువులతో అలంకరణ (Unsplash)

కొంతమందికి మోడర్న్ వాతావరణం ఉన్న ప్రదేశాలు నచ్చుతాయి. కొంత మందికి గ్రామీణ వాతావరణంలో అలంకరించిన చోటులో కూర్చుంటే ఇంట్లో ఉన్నంత అనుభూతి. మీకు అలా ప్రతి విషయంలో పాతకాలపు ఆహార్యాలు, డెకరేషన్‌లు ఇష్టమనుకుంటే మీ మోడర్న్ ఇంటిని కొన్ని మార్పులు చేసి పాత లుక్‌తో కొత్తగా మార్చేయొచ్చు. పాత కాలం నాటి వింటేజ్ లుక్ లో ఎక్కువగా పేస్టల్ రంగులు, ఆహ్లాదకరంగా ఉండే రంగులు వాడతారు. అంతేకాదు గోడలకు, ఫ్లూరింగ్‌కి, పైకప్పుకు కూడా ఈ పాత కాలం నాటి కళ ఉట్టిపడేలా బ్రిక్ రెడ్, ఆలివ్ గ్రీన్, పర్షియన్ బ్లూ, వాల్‌నట్ బ్రౌన్ లాంటి రంగుల్ని వాడతారు. ఫర్నీచర్, ఇంటిని అలంకరించే వస్తువుల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పాతకాలం నాటి స్వర్గంలా ఇంటిని మార్చేయొచ్చు.

ఈ మార్పులు చేయండి:

శ్యాండిలియర్లు:

పాతకాలం నాటి ఇళ్లంటే గుర్తొచ్చేవి పెద్ద శ్యాండిలియర్లు. ఇంటికి కొత్తందాన్ని తీసుకొస్తాయివి. ఒకటే కాకుండా వివిధ సైజుల్లో ఉన్న వాటిని తీసుకుని వరుసలో ఒకటి తరువాత ఒకటి వేలాడదీయాలి. గాజు బాటిళ్లను కూడా ఇంట్లో లైట్ల దగ్గర వాడొచ్చు. ఇంటి మధ్యలో కలపతో చేసిన ఒక ఊయల లేదా జూలా మీ పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తాయి. అలాగే ఇంట్లో కబోర్డ్ లో పాతకాలం నాటి ఖజానాను గుర్తుతెచ్చేలా ఒక లాకర్ ను ఏర్పాటు చేసుకోండి. దీన్ని ఖరీదైన వస్తువుల కోసం వాడకపోయినా, ఇంటికి మాత్రం అదిరిపోయే లుక్ తీసుకొస్తుంది.

రాకింగ్ చెయిర్:

రాకింగ్ చెయిర్ లేకుండా ఇంటికి పాత కాలం ఆహార్యం రాదు. టీవీ చూడటానికో, పుస్తకం చదవడానికో దీన్ని వాడుకుంటే మీకే తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది. చదువుకునే గదిలోనో, హాల్ లోనో లేదా వరండాలో అయినా దీన్ని పెట్టుకోవచ్చు. అలంకరించిన ట్రంకు పెట్టెలు, వింటేజ్ గడియారం, పాతకాలం లుక్ ఇచ్చే మంచి అలంకరణతో ఉన్న బల్బు హోల్డర్లు గది అందం పెంచుతాయి. ఒక అందమైన చెక్క బేంచీ, మంచి మెత్తలతో అలంకరించి పెడితే అదనపు హంగు. అలాగే గోడల అలంకరణలో ఏదైనా రాయి వాడితే దాన్ని పాలిష్ చేయకుండా నేరుగా వాడటం వల్ల ఇంకాస్త అందంగా కనిపిస్తుంది.

పెయింటింగ్స్:

పాత కాలం నాటి చరిత్రకు సంబంధించిన పెయింటింగులు గది గోడలకు పై భాగంలో వేయడం, లేదా చరిత్రను ప్రతిబింబించే కొన్ని వస్తువులను వాడొచ్చు. మీకు చరిత్రలో, పురాణాల్లో నచ్చిన ఏదైనా కథను తెలిపేలా చిన్న పెయింటింగ్స్ లేదంటే ఫ్రేములు పెడితే బాగుంటుంది. కిటికీలకు వాడే కర్టెయిన్లు కూడా పెయింటింగులతో, లేదా వెదురుతో చేసిన వాటిని వాడొచ్చు.

పాతకాలం నాటి లుక్ తో చేసే అలంకరణ వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ట్రెండ్ పాతబడిపోయే అవకాశం లేదు. ఎప్పటికీ భిన్నంగా కనిపిస్తుంది. యాంటిక్ ఫర్నీచర్, అలంకరణ వస్తువులు చాలా మార్పు తీసుకొస్తాయి. అయితే ఏ అలంకరణ చేసినా అది కేవలం చూడటానికే కాకుండా మీకు పనికొచ్చేదయ్యి ఉండాలి. అలాగే ఏదైనా ఎక్కువ చేస్తే చూడటానికి బాగోదు. ఎక్కడ ఏం అవసరమో చూసి వస్తువులు కొనండి. ఉన్నవాటినే ఏమైనా మార్పులు చేసి వాడొచ్చేమో చూడండి. మొత్తానికి మీరు చేసిన మార్పుల్లో మీ సౌకర్యం, మీ ఇష్టం చూసుకోండి.

WhatsApp channel