kids health in summer: వేసవి ప్రభావం పిల్లల మీద పడకుండా.. వైద్యుల సలహాలు ఇవే..-tips from doctors about children health in summer ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kids Health In Summer: వేసవి ప్రభావం పిల్లల మీద పడకుండా.. వైద్యుల సలహాలు ఇవే..

kids health in summer: వేసవి ప్రభావం పిల్లల మీద పడకుండా.. వైద్యుల సలహాలు ఇవే..

HT Telugu Desk HT Telugu
May 22, 2023 10:57 AM IST

kids health in summer: వేసవిలో పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యుల సలహా తెలుసుకోండి.

వేసవిలో పిల్లల సంరక్షణ
వేసవిలో పిల్లల సంరక్షణ (pexels)

రోజు రోజుకు ఎండలు మండి పోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటిపోతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో చిన్న పిల్లలను వెకేషన్ కు తీసుకుని వెళ్లాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అలాంటపుడు పిల్లల ఆరోగ్య సంరక్షణ చాలా ముఖ్యమైని వైద్యులు సూచిస్తున్నారు.

వేసవి కాలంలో పిక్నిక్ కు వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందో కామినేని హాస్పిటల్స్ డాక్టర్ డా. సౌజన్య యలవర్తి మాటల్లో తెలుసుకుందాం.

మీ పిల్లలను ఎండ నుంచి రక్షించండిలా..

సాధారణంగా వేసవిలో వడదెబ్బలు ఎక్కువగా తగులుతుంటాయి. మీ పిల్లలను బయటకు పంపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేడి బారిన పడకుండా రక్షిత దుస్తులను , టోపీలు, చలవ కళ్ల జోళ్లను ధరించడం మంచిది.

పిల్లల శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోండిలా..

వేసవి కాలంలో శరీరం డీ హైడ్రేట్ అవ్వడం సాధారణం. అలాని కూల్ డ్రింకులు తాగించకూడదు. పిల్లలను మార్కెట్లో దొరికే కూల్ డ్రింకులు, కార్బోనేటెడ్ డ్రింక్ లకు దూరంగా ఉంచాలి. వీటిని బదులు వీలైనంత ఎక్కువ నీళ్లు తాగేలా చూసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మీతో వాటర్ బాటిల్ తప్పకుండా తీసుకెళ్లండి.

స్విమ్మింగ్ చేసేటప్పుడు జాగ్రత్త..

వేసవి కాలంలో ఈత కొట్టడం పిల్లలకు మంచి సరదా. కానీ కొన్నిసార్లు ఇది ప్రమాదకరం కూడా కావచ్చు. పిల్లలు ఈతకు వెళ్లే సమయంలో తల్లిదండ్రులు కూడా దగ్గరుండాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలు ఈత నేర్చుకోవడం మంచిది. అలాగే ఈతాడే సమయంలో అందుకు తగిన దుస్తులను వేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్విమ్మింగ్ పూల్ చుట్టూ పరిగెత్తకుండా చూసుకోవాలి.

తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించాలి..

వేసవి కాలంలో పిల్లలు తీసుకునే ఆహారం పై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎండా కాలంలో వేడి, తేమ కారణంగా కొన్ని వ్యాధులు ఆహారం ద్వారా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా వీధుల్లో దొరికే చిరుతిండ్లు తినడం తగ్గించాలి. వీటి ద్వారా జీర్ణవ్యవస్థలో ఇబ్బందులు తలెత్తి విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. పండ్లు, కూరగాయలను తినడానికి ముందు బాగా కడగాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవడం మంచిది.

దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి..

వేసవిలో దోమల నుంచి దూరంగా ఉండాలి. అంతేగాకుండా పేలు, ఇతర ప్రాణహాని కలిగించే కీటకాలు మరింత చురుకుగా తిరుగుతుంటాయి. వీటి ద్వారా పిల్లలు డెంగ్యూ, మలేరియా వ్యాధి వంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వీటి నుంచి దూరంగా ఉండేలా జెట్ కాయిల్స్, రక్షిత దుస్తులను ధరించాలి.

పైన పేర్కొన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా వేసవి సెలవుల్లో పిల్లలను సురక్షితంగా ఉంచుకోవచ్చని డా. సౌజన్య యలవర్తి, సీనియర్ పీడియాట్రిషియన్ & నియోనాటాలజిస్ట్ - కామినేని హాస్పిటల్స్ చెప్తున్నారు.

“వేసవి సెలవుల్లో పిల్లలను ఎండ నుంచి సురక్షితంగా ఉంచడానికి తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరం డీ-హైడ్రెట్ కాకుండా శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలి. ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎండ నుంచి రక్షణ పొందడానికి తెల్ల రంగు దుస్తులు వేసుకోవాలి. ఇంటికి దగ్గరగా ఉన్న ప్రదేశాల్లో దోమలు, కీటకాలు రాకుండా క్రిమిసంహారక మందులను చల్లుకోవాలి. వేసవి కాలంలో వీలైనంత వరకు బయట ఆహారం తగ్గించడం మంచిది. ఇలా తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తల్లిదండ్రులు, తమ పిల్లలు వేసవి సెలవులను హాయిగా ఆనందించవచ్చు.”

- డా. సౌజన్య యలవర్తి, సీనియర్ పీడియాట్రిషియన్ & నియోనాటాలజిస్ట్ - కామినేని హాస్పిటల్స్, విజయవాడ

డా. సౌజన్య యలవర్తి, సీనియర్ పీడియాట్రిషియన్ & నియోనాటాలజిస్ట్
డా. సౌజన్య యలవర్తి, సీనియర్ పీడియాట్రిషియన్ & నియోనాటాలజిస్ట్
Whats_app_banner