Vital Signs of Body । మీ శరీరం మీకొక విషయం చెప్పాలనుకుంటుంది.. ఈ సంకేతాలు గమనించారా?
Vital Signs of Body: మీ శరీరం మీకు కొన్ని సంకేతాలను అందిస్తుంది. మీరు మీ శరీరానికి సరిపడని ఆహారం తీసుకుంటున్న సందర్భంలో మీ శరీరం అలాంటి సంకేతాలను ఇస్తుంది. అవి ఎలాంటి సంకేతాలో ఇక్కడ తెలుసుకోండి.
ఆరోగ్యవంతమైన జీవితానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. ఎలాంటి జబ్బుల బారినపడకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంలోనే అంతా ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, రక్తహీనత, మలబద్ధం వంటి సమస్యలతో దీర్ఘకాలంగా సతమతమవుతున్నారు. ఎప్పుడైనా సరే, ఆహారం విషయంలో రాజీ పడకూడదు. చాలా మంది పోషక విలువల కంటే కూడా రంగు, రుచి, వాసనలకే ప్రాధాన్యతలనిస్తారు. రుచిగా ఉందంటే ఏం తినడానికైనా సిద్ధపడతారు. ఈ ధోరణి నేరుగా వారి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మన శరీరానికి సరిపోని ఆహారం తీసుకోవడం వలన ఇబ్బందులు తలెత్తుతాయి. మీరు తినే ఆహారం మీకు సరిపడటం లేదంటే అందుకు శరీరం కొన్ని సంకేతాలు పంపిస్తుంది. ఆ సంకేతాలను మీరు గమనిస్తే, మీ డైట్ మార్చాలని అర్థం.
తినే ఆహారం శరీరానికి యోగ్యమైనది కానపుడు మీ శరీరం ముఖ్యంగా 5 రకాల సంకేతాలను ఇస్తుందని పోషకాహార నిపుణులు పేర్కొన్నారు. ఆ సంకేతాలు ఏమిటనేది ఈ కింద పరిశీలించండి.
నోటి దుర్వాసన
చాలా సందర్భాలలో, కీటోసిస్ అనే జీవక్రియ ప్రక్రియ వల్ల నోటి దుర్వాసన వస్తుంది. మన శరీరంలో శక్తికి సరిపడా గ్లూకోజ్ లేనప్పుడు, నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది, దాని కారణంగా కీటోన్ అనే ఆమ్లం ఏర్పడుతుంది. ఇది నోటి దుర్వాసనకు కారణమవుతుంది. తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం తీసుకునే వ్యక్తులు వారి శ్వాస నుండి కీటోన్‌లను విడుదల చేస్తారు.
మలబద్ధకం
తక్కువ నీరు, వ్యాయామం లేకపోవడం, ఆహారంలో ఫైబర్ లేకపోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉత్పన్నమవుతుంది. సరైన జీర్ణవ్యవస్థను నిర్వహించడానికి ఫైబర్, నీరు రెండూ అవసరం. మలబద్ధకం సమస్య పరిష్కారం కావాలంటే, వెంటనే మీ ఆహారంలో తృణధాన్యాలు, గింజలు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి.
పెదవులపై పగుళ్లు
రెండు పెదవుల అంచుల్లో తరచుగా కోతలు, పగుళ్లు ఏర్పడుతున్నాయంటే, ఇది శరీరంలో ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. అలాగే ఫంగల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా కారణం కావచ్చు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే ఐరన్ పుష్కలంగా ఆహారం తీసుకోవాలి. పెదవులపై పగుళ్లు నయం కావడానికి ఔషధతైలం ఉపయోగించండి.
విరిగిన జుట్టు
మీ జుట్టు చిట్లిపోవడం, వేగంగా రాలిపోవడం, పలుచని జుట్టు, సన్నని వెంట్రుకలు వంటి సమస్యలు ఉంటే, అందుకు కూడా శరీరంలో ఐరన్ లోపించినట్లు అర్థం. ఎవరికైనా జుట్టు రాలడానికి సాధారణ కారణం వారి శరీరంలో ఐరన్ లోపం ఏర్పడటం. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఆకు కూరలు, పప్పులను ఎక్కువగా తినాలి.
చర్మ సమస్యలు
సరిపడని ఆహారం తీసుకోవడం వలన ఫుడ్ ఎలర్జీలు కలుగుతాయి. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల ముఖంపై మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. అంతే కాకుండా శరీరంలో కాల్షియం లోపం కారణంగా చర్మంపై తెల్లటి మచ్చలు రావడం మొదలవుతుంది. దీన్ని నివారించడానికి, ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. మీరు పై సమస్యలను దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్నారంటే, వీలైనంత త్వరగా మీరు తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. న్యూట్రిషనిస్టుల సలహా తీసుకోండి.
టాపిక్