Relationships: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌లో ఉన్నారా? ఈ చిట్కాలతో మీ బంధం పదిలం-these are the tips for long distance relationship and make you work ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  These Are The Tips For Long Distance Relationship And Make You Work

Relationships: లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌లో ఉన్నారా? ఈ చిట్కాలతో మీ బంధం పదిలం

Maragani Govardhan HT Telugu
Feb 15, 2022 09:02 AM IST

ఇద్దరూ వేరు వేరు ప్రదేశాల్లో ఉండటం వల్ల అక్కడి వాతావరణం, పరిసరాలు లాంటి భౌతికాంశాలు వ్యక్తులపై మానసికంగానూ ప్రభావం చూపుతున్నాయి. అందుకే చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్‌లో కొనసాగలేక బంధాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు. ఫలితంగా డిప్రెషన్‌కు లోనవుతున్నారు. సుదూర సంబంధాన్ని కొనసాగించడం కష్టమే కావచ్చు.. కానీ అసాధ్యం మాత్రం కాదు.

సుదూర సంబంధాలు
సుదూర సంబంధాలు (Unsplash)

మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు కంటే దూరంగా ఉన్నప్పుడే బంధం బలంగా ఉంటుందని, ప్రేమలు పెరుగుతాయని అంటారు. అది నిజమే.. కానీ ఒకప్పుడు. కానీ ప్రస్తుత కాలంలో చాలా వరకు ఈ సుదూర సంబంధాలు(Long Distance Relationships) స్వల్పకాలానికే పరిమితమవుతున్నాయి. ఇరువురి మధ్య దూరం శారీరకంగానే కాకుండానే మానసికంగానూ మసకబారుతోంది. ఇద్దరూ వేరు వేరు ప్రదేశాల్లో ఉండటం వల్ల అక్కడి వాతావరణం, పరిసరాలు లాంటి భౌతికాంశాలు వ్యక్తులపై ప్రభావం చూపుతున్నాయి. అందుకే చాలా మంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్‌లో కొనసాగలేక బంధాన్ని మధ్యలోనే ముగించేస్తున్నారు. ఫలితంగా డిప్రెషన్‌కు లోనవుతున్నారు. సుదూర సంబంధాన్ని కొనసాగించడం కష్టమే కావచ్చు.. కానీ అసాధ్యం మాత్రం కాదు. ఒకవేళ ఈ సంబంధంలో ఉంటే ఇక్కడ చిట్కాలు ఉన్నాయి పాటించండి. ఫలితంగా మీ రిలేషన్ సజావుగా సాగుతుంది.

దూరాన్ని అంగీకరించండి..

చాలా వరకు జంటలు చేసే మొదటి తప్పు ఇదే. ఇరువురు దగ్గరలో ఉన్నప్పుడు ఎలాగైతే ఉండేవారో అలాంటి అనుభూతులే దూరంగా ఉన్నప్పుడు కావాలనుకుంటారు. ఇరువురు వేర్వేరు ప్రదేశాల్లో నివసిస్తున్నప్పుడు ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఎదుటివారిపై నిందను వేయకూడదు. నిదానంగా ఆ భావాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. దూరంగా ఉంటున్నామని అంగీకరించండి. నమ్మకాన్ని కోల్పోకండి.

మాట్లాడండి.. అలాగే స్పేస్ ఇవ్వండి..

ఇద్దరూ దూరంగా ఉన్నప్పుడు కమ్యూనికేషన్ ఎక్కువగా ఉంటుంది. ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుకుంటూ ఎదుటివారికి ఏ మాత్రం ఖాళీ ఇవ్వరు. ఫలితంగా అవతలి వ్యక్తికి విసుగుతో పాటు మీపై అభిప్రాయం మారుతుంది. అలా కాకుండా తగినంతసేపు మాట్లాడుతూ ఎదుటి వారికి కూడా కాస్త స్పేస్ ఇవ్వడానికి ప్రయత్నించండి. ఏ విషయంలోనూ బలవంతం చేయకండి.

ఎదుటివారు చెప్పేది వినాలి..

మీ భాగస్వామి మాట్లాడేటప్పుడు ఆసక్తిగా వినడం ద్వారా వారికి మీపై మంచి అభిప్రాయం కలుగుతుంది. అంతేకాకుండా మీ విషయాలను, వారితో పంచుకోవడం ద్వారా కూడా మీ బంధం బలపడుతుంది. ముఖ్యంగా సుదూర సంబంధాల్లో ఈ విషయం చాలా మంది పెడచెవిన పెడుతుంటారు. ఎదుటివారి చెప్పేదానికి అస్సలు సమయం ఇవ్వకుండా తమదే పైచేయి అనేలా ప్రవర్తిస్తారు.

అతిగా మాట్లాడకండి..

సాధారణంగా ఇరువురు ప్రేమికులు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నప్పుడు బంధాన్ని కొనసాగించడానికి ఎక్కువగా కమ్యూనికేషన్ చేస్తుంటారు. ఒకవేళ మాట్లాడకపోతే రిలేషన్‌షిప్ బ్రేక్ అవుతుందని అభద్రతా భావానికి లోనవుతుంటారు. అలా కాకుండా మీరు అవతలి వ్యక్తి ఎంతగా ప్రేమిస్తున్నారో మీతో పాటు వారికి కూడా తెలుసు. కాబట్టి దారాన్ని బలంగా లాగకుండా ఎంతమేరకు ప్రశాంతంగా ఉండండి.

క్రియేటివ్‌గా ఆలోచించండి..

లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ కొనసాగించాలంటే మీరు వైవిధ్యంగా, సృజనాత్మకంగా ఆలోచించండి. సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ లేదా ప్రేమ లేఖలు మీ భాగస్వామికి పంపండి. ఎందుకంటే ఈ విధంగా వినూత్న రీతిలో ఆలోచించడం ద్వారా వారిపై మీకున్న ప్రేమ అవతలి వ్యక్తికి బాగా అర్థమవుతుంది.

కొత్త జ్ఞాపకాలను సృష్టించండి..

ఇద్దరు వ్యక్తులు దగ్గరగా ఉన్నప్పుడు వారికి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి. కానీ వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నప్పుడు కలిసి మెమరీలను సృష్టించడం వీలు పడదు. చాలా వరకు బంధాలు ఇలాంటి అనుభూతులు లేకపోవడం వల్లే మధ్యలోనే విచ్ఛిన్నమవుతున్నాయి. కాబట్టి మీరు మీ భాగస్వామితో కలిసి కొన్ని కార్యకలాపాలు చేయండి. ఇద్దరు కలిసి ఒకే సమయంలో సినిమాను చూడటం, వర్చువల్‌గా కుక్ చేయడం లాంటి కొత్త జ్ఞాపకాలు మీ బంధాన్ని పదిలంగా ఉంచుతాయి.

భాగస్వామిని నమ్మాలి..

బంధం బలంగా ఉండాలంటే అతిముఖ్యమైన అంశం నమ్మకం. అప్పుడే ఆ రిలేషన్‌షిప్ ఎక్కువ కాలంపాటు కొనసాగుతుంది. ముఖ్యంగా సుదూర సంబంధంలో ఉన్నవారు ఎదుటివారిపై నమ్మకాన్ని ఉంచాలి. ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు వచ్చినా వెంటనే తొలగించుకోవడానికి ప్రయత్నించాలి. ఎవరోకరు ముందుగా చొరవ తీసుకోవడానికి ట్రై చేయాలి.

WhatsApp channel

సంబంధిత కథనం