Success | సక్సెస్ కావాలంటే ఈ అలవాట్లు మార్చుకోండి? నాణ్యమైన జీవితాన్ని పొందండి?-these are the habits you should quit for success and quality life ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Success | సక్సెస్ కావాలంటే ఈ అలవాట్లు మార్చుకోండి? నాణ్యమైన జీవితాన్ని పొందండి?

Success | సక్సెస్ కావాలంటే ఈ అలవాట్లు మార్చుకోండి? నాణ్యమైన జీవితాన్ని పొందండి?

Maragani Govardhan HT Telugu
Feb 28, 2022 02:59 PM IST

జన్మ ఎలా ఉన్నా జీవనం మాత్రం ఉన్నతంగా మార్చుకునే బాధ్యత మనుషులుగా మనపైనే ఉంటుంది. ఇందుకోసం ఎదురయ్యే అవాంతరాలన్ని అధిగమించాలి. అప్పుడే కెరీర్‌లో సక్సెస్ కాగలుగుతాం. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటాం. అయితే విజయం కూడా అంత సులభంగా రాదు. కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది.

<p>విజయం&nbsp;</p>
విజయం (Unsplash)

ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి జీవితం పూల పాన్పులా ఉండదు. కొంతమంది పుట్టుకతోనే కోటీశ్వరులుగా జన్మిస్తే.. మరికొంతమంది కడు పేదరికంతో జీవితాన్ని ప్రారంభిస్తారు. జన్మ ఎలా ఉన్నా జీవనం మాత్రం ఉన్నతంగా మార్చుకునే బాధ్యత మనుషులుగా మనపైనే ఉంటుంది. ఇందుకోసం ఎదురయ్యే అవాంతరాలన్ని అధిగమించాలి. అప్పుడే కెరీర్‌లో సక్సెస్ కాగలుగుతాం. అనుకున్న లక్ష్యం నెరవేర్చుకుంటాం. అయితే విజయం కూడా అంత సులభంగా రాదు. కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే విజయంతో పాటు, నాణ్యమైన జీవనాన్ని జీవించగలుగుతాం. ఈ నేపథ్యంలో సక్సెస్‌తో పాటు క్వాలిటీ లైఫ్ కోసం ఏయే అలవాట్లు మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.

సాకులు చెప్పకండి..

"ఓడిన వారే సాకులు, కారణాలు చెబుతారు" అని ఓ సినిమాలో అన్నట్లు జీవితంలో ఎదగాలంటే ఈ అలవాటును తప్పకుండా మార్చుకోవాలి. ఎందుకంటే ఓడిన సారి ప్రతీసారి కారణాలు, సాకులు వెతుక్కుంటే మన జీవితంలో విజయ తీరాలు చేరలేం. కాబట్టి సక్సెస్ అందుకోవాలంటే సాకులు అనే అవరోధాన్ని అధిగమించక తప్పదు.

బలిపశువయ్యయానని అనుకోవద్దు..

జీవితం ఎప్పుడూ మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు చేసే పనులకు పూర్తి బాధ్యత మీపైనే ఉంటుంది. కాబట్టి బలిపశువయ్యానని(victim card) అనుకోవద్దు. ఎలాంటి పరాజయాలు వచ్చినా ఎదుర్కోండి. అంతేకానీ ఓడిపోయానని బాధపడవద్దు. బాధితుడిగా మిగలొద్దు.

ఫిర్యాదులు చేయకండి..

సమస్యల గురించి ఎప్పుడు ఫిర్యాదులు చేస్తూ సమయాన్ని వృథా చేయకండి. బదులుగా వాటికి పరిష్కారాలను కనుగొనే ప్రయత్నించండి. చెప్పడం కంటే చేయడం మేలు అన్న చందంగా ఫిర్యాదులతో కాలాన్ని గడపవద్దు. ఇతరులకు చెప్పే ముందు మీరు ఆచరించి చూపాలి. అప్పుడే నాణ్యమైన జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు.

సరిహద్దులు పెట్టుకోండి..

ప్రతి ఒక్కరు తమ కంటూ కొన్ని సరిహద్దులు నిర్దేశించుకోవాలి. ప్రతి విషయానికి అవును అని తల ఊపకండి. చేయలేనివి, సాధ్యం కాని పనులకు లేదు, కాదు అని చెప్పడం నేర్చుకోండి. ఎందుకంటే కొన్నిసార్లు తిరస్కరించడానికి కూడా ధైర్యం కావాలి. కాబట్టి నో చెప్పడం అలవర్చుకోండి. ఇందుకు మీకంటూ కొన్ని హద్దులు పెట్టుకోండి.

లక్ష్యసాధన..

మీ లక్ష్యాలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి. అదేవిధంగా సాధించేవి అయి ఉండాలి. అప్పుడే మీకంటూ ఓ గుర్తింపు ఏర్పడుతుంది. వాటిని సాధించడానికి మీ వంతు ప్రయత్నం చేయాలి. ఎంత కష్టమైనా పట్టుదల, కృషితో లక్ష్యాలను అందుకోవాలి. అప్పుడే సక్సెస్ మీ వెంట వస్తుంది.

భయాన్ని పారద్రోలండి..

జీవితంలో మీ వైఫల్యానికి మొదటి కారణం మీ భయమే. కాబట్టి వీలైనంత వరకు భయం, బెరుకు లాంటి వాటిని మీ నుంచి తీసివేయండి. గెలుపు రుచి చూడాలంటే భయాన్ని ఆమడ దూరం వదిలిరావాలి. అప్పుడే విజయంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతారు.

నియంత్రణ..

అందరూ మీ నియంత్రణలోనే ఉండాలి, మీరు చెప్పిందే చేయాలి అనే స్వభావాన్ని వదిలిపెట్టండి. మన పని చేయకుండా ఇతరులపై అజమాయిషీ చేయడం వల్ల సమాజంలో గౌరవం లభించదు. మీ ముందు నటించినా వెనక మాత్రం చులకనగా మాట్లాడతారు.

ప్రతికూలత..

ఎన్ని సమస్యలొచ్చినా, అవరోధాలు ఎదురైనా సానుకూల దృక్పథంతోనే ఉండాలి. అదే మీ విజయానికి ప్రధాన కారణమవుతుంది. ప్రతికూల ఆలోచనలను దరికి రానీయకండి. ఎల్లప్పుడు పాజిటివిటీతో ముందుకు సాగండి.

కృతజ్ఞతా భావం..

ఇతరులకు ధన్యవాదాలు చెప్పడం అలవర్చుకోండి. ఎందుకంటే కృతజ్ఞతలు చెప్పడం వల్ల మీ మనస్సుకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఎదుటివారిలో మీపై గౌరవాన్ని పెంచుతుంది. కాబట్టి థ్యాంక్యూ చెప్పడం జీవితంలో ముఖ్యమైన మంచి అలవాటు.

 

Whats_app_banner

సంబంధిత కథనం