Sweetcorn Pakodi: పిల్లలకు ఇలా సులువుగా స్వీట్ కార్న్ పకోడీ ట్రై చేయండి, పది నిమిషాల్లో వండేయచ్చు-sweetcorn pakodi recipe in telugu for kids ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sweetcorn Pakodi: పిల్లలకు ఇలా సులువుగా స్వీట్ కార్న్ పకోడీ ట్రై చేయండి, పది నిమిషాల్లో వండేయచ్చు

Sweetcorn Pakodi: పిల్లలకు ఇలా సులువుగా స్వీట్ కార్న్ పకోడీ ట్రై చేయండి, పది నిమిషాల్లో వండేయచ్చు

Haritha Chappa HT Telugu
Apr 25, 2024 03:30 PM IST

Sweetcorn Pakodi: స్వీట్ కార్న్ పకోడీ అనగానే కొంతమంది స్వీట్ కార్న్‌ను రుబ్బి చేస్తూ ఉంటారు. అలా కాకుండా నేరుగా గింజలతోనే కూడా చేయొచ్చు. ఈ స్వీట్ కార్న్ పకోడీ రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం.

స్వీట్ కార్న్ పకోడి
స్వీట్ కార్న్ పకోడి

Sweetcorn Pakodi: పిల్లలకు ఇష్టమైన చిరుతిండిలో స్వీట్ కార్న్ ఒక్కటి. పిల్లలకు ఎప్పుడు స్వీట్ కార్న్ ఉడికించి ఇస్తే బోర్ కొడుతుంది. వాటితో ఒకసారి పకోడీ చేసి చూడండి. స్వీట్ కార్న్ పకోడీ అనగానే ఆ గింజలను రుబ్బి చేసేవారు ఎంతోమంది. కానీ రుబ్బకుండానే క్రిస్పీ పకోడీని చెయ్యొచ్చు. కేవలం 10 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. దీన్ని వండడం చాలా సులువు. పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది.

స్వీట్ కార్న్ పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు

స్వీట్ కార్న్ - రెండు

ఉప్పు - రుచికి సరిపడా

కార్న్ ఫ్లోర్ - ఒక స్పూను

శెనగపిండి - మూడు స్పూన్లు

పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

కరివేపాకులు - గుప్పెడు

కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు

అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను

పసుపు - చిటికెడు

కారం - అర స్పూను

స్వీట్ కార్న్ పకోడీ రెసిపీ

1. స్వీట్ కార్న్ గింజలను వేరు చేసి ఒక గిన్నెలో వేయాలి.

2. ఆ గిన్నెలో సన్నగా, నిలువుగా తరిగిన ఉల్లిపాయలను, సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకోవాలి.

3. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా వేసి బాగా కలపాలి.

4. చిటికెడు పసుపు, కారం వేసి బాగా కలపాలి.

5. రుచికి సరిపడా ఉప్పును వేయాలి.

6. తర్వాత శెనగపిండి, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి.

7. ఈలోపు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

8. నూనె బాగా వేడెక్కాక ఈ కార్న్ మిశ్రమాన్ని పకోడీల్లాగా వేసుకోవాలి.

9. రెండు వైపులా రంగు మారేవరకు కాల్చుకోవాలి.

10. అంతే స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోతుంది.

11. ఇది క్రిస్పీగా, టేస్టీగా ఉంటుంది.

12. పిల్లలకు ఇది కచ్చితంగా నచ్చుతుంది.

13. ఆయిల్ పీల్చినట్టు అనిపిస్తే టిష్యూ పేపర్లో ఉంచి ఒత్తితే సరిపోతుంది. తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటాయి.

స్వీట్ కార్న్ పకోడీ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం పది నిమిషాల్లో చేసేయొచ్చు. కాబట్టి పిల్లలకు ఎప్పటికప్పుడు దీన్ని చేసి ఇచ్చేందుకు ప్రయత్నించండి. వారికి కూడా ఇది బాగా నచ్చుతుంది. అలాగే దీన్ని సాయంత్రం స్నాక్ గా కూడా ఇవ్వచ్చు. ఇందులో స్వీట్ కార్న్ అన్ని విధాలా పిల్లలకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. దీని చేయడం చాలా సులువు. కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.